పవన్ పోటీతో పిఠాపురానికి పెరిగిన క్రేజ్
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఫుల్ క్రేజ్ ఉన్న నియోజకవర్గం పిఠాపురం.. కుప్పం, మంగళగిరి, పులివెందుల తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసిన, మాట్లాడుకుంటున్న నియోజకవర్గం పిఠాపురం. 2024 ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన రోజు నుంచి.. ఎమ్మెల్యేగా గెలిచి, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో దాని క్రేజ్ పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న నియోజకవర్గాన్ని చూడడానికి అనేక ప్రాంతాల నుంచి పిఠాపురం వస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఇప్పుడు అలాంటి పిఠాపురంలో అభివృద్ధి మాట ఎలా ఉన్నా వివాదాలు మాత్రం పెరిగిపోతున్నాయి. టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా పిఠాపురం మారిపోతుంది.
అప్పట్లో నిరసనలకు దిగిన వర్మ అనుచరులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్మ అనుచర వర్గమంతా నిరసనలు చేపట్టింది. దాంతో టీడీపీ అధిష్టానం దృష్టిలో వర్మ ఓ మెట్టు దిగి పలచనవ్వాల్సి వచ్చింది. అదే వర్మ రాజకీయ ఎదుగుదలకు ఆటంకంగా మారినట్లు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఇ వర్మకు ఎలాంటి ఇంపార్టెన్స్ లేకపోవడం, ఏ విధమైన పదవి రాకపోవడంతో పిఠాపురంలో రోజురోజుకు రాజకీయ వివాదం రాజుకుంటూనే ఉంది. టీడీపీ శ్రేణులకు, జనసైనికులకు ఒక్క క్షణం కూడా పడడం లేదు. ఏ ప్రభుత్వ కార్యక్రమం చేపట్టాలన్న, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయాలన్నా రెండు పార్టీల మధ్య విభేదాలతో అధికారులు సైతం హడలిపోతున్నారంట.
నాగబాబు కామెంట్స్‌పై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం
పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ తర్వాత మరింత కాక పెరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న ఎమ్మెల్సీ నాగబాబు జనసేన ఆవిర్భావ సభలో చేసిన కామెంట్స్‌తో తెలుగు తమ్ముళ్ల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్పినా.. తగ్గేదేలే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అంటూ జనసైనికులు అగ్గికి మరింత ఆజ్యం పోస్తున్నారు. ఇన్నేళ్లూ పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు అన్నది నియోజకవర్గంలోని ప్రజలకు తప్ప మిగిలిన వారికి అంతగా తెలిసేది కాదు. ఇప్పటివరకు పిఠాపురం రాజకీయాలు కూడా లోకల్‌గానే సాగిపోతూ వచ్చాయి. ఎపుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీకి దిగారో అప్పటి నుంచి అది వీవీఐపీ నియోజకవర్గంగా మారిపోవడం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా అయిపోవడం రెండు చక చకా జరిగిపోయాయి.
తలలు పట్టుకుంటున్న ముఖ్య నేతలు, యంత్రాంగం
వర్మ పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజుకి స్ట్రాంగ్ లీడర్ గానే ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడంతో గెలిచిన జనసేనాని మంత్రి హోదాలో నియోజకవర్గానికి వచ్చి పర్యటనలు చేస్తుంటే తన ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన వర్మ మాత్రం నియోజకవర్గంలో ఎలాంటి పదవి లేకుండా సాధారణ వ్యక్తిగా తిరుగుతున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయంగా టీడీపీ జనసేన ల మధ్య రాజకీయ వైరానికి కారణమైనట్లు కనిపిస్తుంది. సహజంగా ఒక నియోజకవర్గంలో రాజకీయంగా రెండు ప్రత్యర్థి పార్టీల మధ్య వైరం ఉంటుంది కానీ పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం అధికారుల్లో భాగస్వామిగా ఉన్న టీడీపీ జనసేనల మధ్య రాజకీయ వివాదం నడుస్తుండడంతో పార్టీ ముఖ్యనేతలు, అక్కడి యంత్రాంగం కూడా తలలు పట్టుకోవాల్సి వస్తోంది.
తన గెలుపు బాధ్యతను వర్మ చేతుల్లో పెడుతున్నానని పవన్ ప్రకటన
ఎన్నికల ముందు తన గెలుపు బాధ్యతను వర్మ చేతుల్లో పెడుతున్నానని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్పారు. గెలిచిన తర్వాత తన గెలుపుకు వర్మే కారణమని ప్రశంసించారు. అయితే రోజులు గడుస్తున్న కొద్ది జనసేన పార్టీలో వస్తున్న మార్పులు రెండు పార్టీల మధ్య వివాదాలకు కారణం అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. జనసేన ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు చేసిన కామెంట్స్ టీడీపీ, జనసేనల మధ్య రాజకీయ వైరానికి బలమైన కారణంగా మారాయి. ఆ రోజు నుంచి ఇప్పటివరకు పిఠాపురం నియోజకవర్గంలో ఏదో ఒక వివాదం చెలరేగుతూనే వస్తుంది. లేటెస్ట్‌గా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలో ఆర్ ఓ ప్లాంట్ ప్రారంభోత్సవం టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణకు కారణమయ్యింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చందుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్ ఓ ప్లాంట్ ను ప్రారంభించేందుకు వెళ్లిన పిఠాపురం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొంత సేపు రచ్చ సాగింది.
ప్రారంభోత్సవానికి వర్మను పిలవకపోవడంతో మొదలైన వివాదం
ఆర్వో ప్లాంట్ ప్రారంభానికి వర్మను ఎందుకు పిలవలేదు అంటూ టిడిపి కార్యకర్తలు ప్రశ్నించడంతో గొడవ స్టార్ట్ అయింది. ప్రారంభోత్సవం తర్వాత మాట్లాడడానికి స్టేజ్ పైకి వెళ్లిన పిఠాపురం జనసేన ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడకుండానే వెనుతిరిగి వెళ్లారంటేనే రెండు పార్టీ కార్యకర్తలు నాయకులు మధ్య వివాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో వస్తున్న రాజకీయ విభేదాలను పరిష్కరించడానికి అటు టిడిపి, ఇటు జనసేన ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారంట. ఇప్పటికే జనసేన, టీడీపీ నేతలు విడివిడిగానే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
కార్యకర్తే అధినేత అంటూ జనంలోకి వెళ్తున్న వర్మ
వర్మ ఒక అడుగు ముందుకు వేసి కార్యకర్తే అధినేత అంటూ జనంలోకి వెళ్తున్నారు. వర్మ తనదైన శైలిలో జనాలను కలసి హామీలు ఇస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఇలా ఎవరికి వారు రాజకీయాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇపుడు ఏ చిన్న కార్యక్రమం చేపట్టిన రెండు పార్టీల మధ్య అది ఘర్షణగా మారుతోంది. దానికి తోడు పిఠాపురంలో వైసీపీ నుండి జనసేనలోకి వచ్చిన వాళ్ళ ఆధిపత్యం పెరగడంతో ముందు నుండి జనసేన పార్టీ కోసం పని చేసిన నాయకులు కార్యకర్తలు సైలెంట్ అయిపోయి జనసేన నాయకులు పైనే తిరగబడే స్థాయికి వస్తున్నారు. వైసీపీ నుండి వచ్చి ఆధిపత్యం చెలాయిస్తున్న నాయకులను చూసి వాళ్లతో కలిసి వెళ్లలేక, పార్టీలో ఉండలేక.. జనసేనాని ఏం చెప్తారో చూద్దాం అని ఎదురు చూస్తున్నారంట.
వర్మకు పదవి వచ్చేవరకు ఈ పరిస్థితి తప్పదా
గడిచిన ఏడు నెలల నుంచి నియోజకవర్గంలో టిడిపి, జనసేనల మధ్య వివాదాల నడుస్తున్నా సయోధ్య కుదిరే ఛాన్స్ లేదా అంటే.. మాజీ ఎమ్మెల్యే వర్మకు పదవి వచ్చేవరకు అది సాధ్యం కాదని నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్.. ఇప్పట్లో ఎలాగూ వర్మకి పదవి వచ్చే అవకాశం లేకపోవడంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఈ వివాదాలు కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. పైస్థాయిలో కూటమి పెద్దల మధ్య ఉన్న సామరస్యం గ్రౌండ్ లెవెల్ లో లేదు అనడానికి పిఠాపురం పరిస్థితులే అద్దం పడుతున్నాయి.