Surya Namaskar benefits: సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే.. మంచి పోషకాలు కూడిన ఆహారంతో తీసుకోవడంతో పాటు శరీరాన్ని కదిలించే వ్యాయామాలు కూడా చేస్తుండాలి. అయితే, మనలో చాలామంది వ్యాయామాల కోసం ఉదయాన్నే హడావుడిగా జిమ్‌కు వెళ్తుంటారు. అలా జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడం కుదరని వాళ్లు.. ఇంట్లోనే సూర్య నమస్కారాలు చేస్తే అటు ఆరోగ్యంగా, ఇటు సమయాన్నీ ఆదా చేసుకోవచ్చు. ఈ క్రమంలో సంప్రదాయ యోగాలో సూర్య నమస్కారాలు వెనుక చాలా ముఖ్యమైన ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. దీనిని కేవలం ఒక వ్యాయామంగా కాకుండా, శరీరం, మనస్సు, శ్వాసను సమన్వయం చేసే ఒక సంపూర్ణ యోగా సాధనగా భావిస్తారు. క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్య నమస్కారం అంటే.. శరీరం, శ్వాస, మనస్సుల సంపూర్ణ సమన్వయం అని చెబుతుంటారు నిపుణులు. ఇది పన్నెండు భంగిమల కలయిక. ఈ సూర్య నమస్కారం శరీరం మొత్తంలోని ముఖ్యమైన కండరాలు, కీళ్లపై పని చేస్తుంది. భుజాలు, మెడ, వెన్నెముక, మోకాళ్లు వంటి ముఖ్యమైన భాగాలకు మంచి మద్దతునిస్తుంది. సూర్య నమస్కారం పూర్తి శరీర వ్యాయామంగా పరిగణించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. దీనిలోని కొన్ని భంగిమలు కడుపు, కాలేయం, ప్రేగులు వంటి అవయవాలపై ఒత్తిడిని కలిగించి అవి బాగా పనిచేసేలా చేస్తాయని తెలిపారు. ఈ సూర్య నమస్కారం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను సైతం తగ్గిస్తుంది.
ప్రతిరోజూ కాసేపు సూర్య నమస్కారాలను వేగంగా చేయడం ద్వారా శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుందని, దీని వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చువ్వడంతో పాటు జీవక్రియను వేగవంతం చేస్తుందంటున్నారు నిపుణులు. సూర్య నమస్కారాలను ఇది క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు తగ్గి, బరువు అదుపులో ఉంటుందని వివరించారు నిపుణులు.
సూర్య నమస్కారాలు చేయడం వల్ల ముఖానికి సహజమైన మెరుపు లభిస్తుంది. ఈ ఆసనాల ద్వారా శరీరంలోని ప్రతి భాగానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో అవయవాల పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా.. చర్మానికి తగినంత ఆక్సిజన్ అందడం వల్ల కాంతివంతంగా మారుతుందని తెలిపారు. సూర్యనమస్కారాలతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది శరీర భాగాలపైనే కాకుండా గ్రంథులపైనా పని చేస్తాయి. సూర్య నమస్కారాలు థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంథులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఉపకరిస్తాయి.
* నమస్కారాసనం
* హస్త ఉత్తానాసనం
* పాద హస్తాసనం
* ఆంజనేయాసనం
* పర్వతాసనం
* సాష్టాంగ నమస్కారం
* సర్పాసనం
* ఆంజనేయాసనం
* పాదహస్తాసనం
* హస్త ఉత్తానాసనం
* నమస్కారాసనం