కరువు కోరల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడేందుకు సర్కార్ సమగ్ర కార్యచరణను రూపొందించింది. ప్రస్తుత సీరియస్ పరిస్థితులపై సీఎం స్వయంగా ప్రెస్మీట్ పెట్టి మరీ వివరించారు. మంత్రులతో సమగ్రంగా చర్చించిన తరువాత .. నేరుగా ఆయనే మీడియా ముందుకు వచ్చి ప్రధానంగా మూడు వర్గాలకు హంబుల్ అప్పీల్ చేశారు. రైతాంగం వచ్చే ఎండాకాలం కోసం వరి వేసుకోవడం మానేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పుడు వేసిన వరిని కాపాడుకునే ప్రయత్నం సర్కార్ చేస్తుందని, వచ్చే సీజన్కు మాత్రం వేయొద్దని రిక్వెస్టు చేశారు. రైతులను ఆదుకుంటామని, రైతు కూలీలను ఉపాధి హామీ ద్వారా పనులు కల్పించి వారి జీవనానికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ప్రజలు .. విద్యుత్ తీవ్ర కొరతను దృష్టిలో ఉంచుకుని తాగునీటిని పొదుపుగా వాడాలని కోరారు.
కరెంటు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆదా చేయాలని రిక్వెస్టు చేశారు. సాగు, తాగు నీటికి అత్యంత ప్రయార్టీ ఇస్తున్నామని సర్కార్ తెలిపింది. ఇప్పుడున్న 200 టీఎంసీల నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని, ప్రధానంగా తాగునీటి అవసరాలకే వీటిని వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. మీడియా కూడా సంయమనంతో ఉండాలని కోరారు. బీఆరెస్ పైశాచికంగా దీనిపై రాజకీయం చేయాలని చేస్తున్నదని, వారి ట్రాప్లో మీడియా పడొద్దని కోరారు.
మీడియాకు నిరంతరం వాస్తవ పరిస్థితులను వివరించేందుకు సమగ్ర సమాచారం ఇచ్చేందుకు నోడల్ అధికారిని నియమిస్తున్నామన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ను పెడుతున్నామన్నారు. ప్రముఖులు కూడా కరువుపై జనాన్ని చైతన్యం చేయాలని కోరారు. సీనియర్ జర్నలిస్టుల విశ్లేషణలు, సంపాదకీయాలను కూడా సీఎం స్వాగతించారు. వైద్యారోగ్యంపై శ్రద్ద పెడుతున్నామన్నా సీఎం.. పశు సంపదను కాపాడుకునేందుకు కూడా సర్కార్ ఆలోచనలు చేస్తున్నదన్నారు.
ఏ ఒక్క వర్గాన్ని కూడా కరువు ఇబ్బందులు పెట్టకుండా సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. దసరా తరువాత అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని, ఢిల్లీకి కూడా వెళ్లి కేంద్రానికి ఇక్కడి పరిస్థితులు వివరిస్తామన్నారు. ప్రపంచమంతటా కరువు చాయలు ఉన్నాయని, బీఆరెస్ ఇది తెలంగాణలో వచ్చిందనే విధంగా ఇక్కడి రైతాంగాన్ని, జనాన్ని భయపెట్టి రాజకీయ పబ్బం గడపాలని చూస్తోందని సీఎం రేవంత్ తీవ్రంగా విమర్శించారు.
ప్రజల్లో అవగాహన ఉందని, ఏం జరుగుతుందో అర్థం చేసుకునే చైతన్యం వారిలో ఉందన్న సీఎం.. గోదావరి, కృష్ణా జలాలపై చర్చకు సిద్దమన్నారు. మీరు అబద్దాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారని, అసెంబ్లీలో అవమానమే తప్ప మీకు మరోటి ఉండబోదని ఆయన వార్నింగ్ ఇచ్చారు.