CM Chandrababu: ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు.. సీఐఐ నిర్వహించిన రోడ్‌షోలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అపారమైన అవకాశాలను.. యూఏఈ పారిశ్రామికవేత్తలకు వివరించారు. సీఎం ఇచ్చిన ప్రజంటేషన్‌కు.. కంపెనీల నుంచి అపూర్వమైన స్పందన కనిపించింది. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో మైక్రోసాఫ్ట్ కీలకపాత్ర పోషించిందని.. ఇప్పుడదే తరహాలో విశాఖ అభివృద్ధిలో.. గూగుల్ కీరోల్ పోషిస్తుందన్నారు సీఎం. వైజాగ్.. ఫ్యూచర్ టెక్నాలజీ హబ్‌గా మారుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు.. ఈ వారం యూఏఈ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. అబుదాబిలో.. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల సీఈవోలు, ప్రభుత్వ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సీఎం చంద్రబాబు వారికి వివరించారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో.. సీఎం కీలక చర్చలు జరిపారు. అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్ అహ్మద్ అల్ జాబి, జీ42 సీఈవో అల్ మన్సూరి, అబుదాబి పెట్టుబడుల విభాగం ఛైర్మన్ ఖలీఫా యూసుఫ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లులు గ్రూప్, అతియా గ్రూప్, మస్దార్ సిటీ లాంటి సంస్థల ప్రతినిధులతోనూ వరుస సమావేశాలు నిర్వహించారు. వివిధ టూరిజం ప్రాజెక్టులను సందర్శించారు.
దుబాయ్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు.. అక్కడున్న ఫ్యూచర్ మ్యూజియాన్ని మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. అంతరిక్షం, వాతావరణం, ఆరోగ్యం, విద్య, వైద్యం, ఏఐ రంగాల్లో.. భవిష్యత్తు ఆవిష్కరణలు ఎలా ఉండబోతున్నాయనేది టెక్నాలజీ ద్వారా ఇందులో ప్రదర్శిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఫ్యూచర్ జర్నీ పేరుతో ఏర్పాటుచేసిన ఎక్స్‌పీరియన్స్ జోన్‌నూ సీఎ చంద్రబాబు సందర్శించారు.
అమరావతిలో పెట్టుబడుల కోసం యూఏఈ వెళ్లిన సీఎం చంద్రబాబుకు.. తొలిరోజు అక్కడి స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అదేరోజు.. అబుదాబి ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ శ్రీ అమర్‌నాథ్, దుబాయ్ ఇండియన్ కౌన్సిల్ జనరల్ సతీష్ కుమార్ శివన్‌లతో భేటీ అయి.. వివిధ అంశాలపై చర్చించారు. మొదటిరోజు పర్యటనలోనే.. సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. ఇందుకు వివిధ కంపెనీల ప్రతినిధులు ఆసక్తి చూపించారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రపంచస్థాయి గ్రంథాలయం నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం యూఏఈ పర్యటనలో ఈ దిశగా కీలక అడుగు పడింది. రాజధాని అమరావతిలో.. స్టేట్ లైబ్రరీ నిర్మాణానికి శోభా గ్రూప్ 100 కోట్ల విరాళం ప్రకటించింది.
శోభా గ్రూప్ ఫౌండర్, చైర్మన్ పీఎన్సీ మీనన్‌తో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు.. 100 కోట్ల విరాళం ప్రకటించటంపై సీఎం వారిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే పీ4 విధానంలో భాగంగా పేదరిక నిర్మూలన కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మించే క్రతువులో.. శోభా రియాల్టీ సంస్థ కూడా భాగస్వామి కావాలని ఆహ్వానించారు. ఏపీకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించాలని శోభా గ్రూప్ ఛైర్మన్‌ని కోరారు. శోభా రియాల్టీ లాంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సరైన గమ్యస్థానం ఆంధ్రప్రదేశేనని తెలిపారు సీఎం. మూడేళ్లలో రాజధాని అమరావతిలో రోడ్లు, నీటి సదుపాయం, నైపుణ్యం ఉన్న మానవ వనరుల లాంటి మౌలిక సదుపాయాలు సిద్ధం చేస్తామన్నారు. విశాఖలో గూగుల్ డేటా ఏఐ హబ్, అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు కానున్నాయని వివరించారు. తిరుపతి, విశాఖ, అమరావతికి ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని శోభా గ్రూప్ ఫౌండర్, ఛైర్మన్ మీనన్‌ను చంద్రబాబు ఆహ్వానించారు.
ఏపీలో లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటు ప్రతిపాదనలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు షరాఫ్ గ్రూప్ సంస్థను కోరారు. ఆ సంస్థ వైస్ ఛైర్మన్, షరావుద్దీన్ షరాఫ్‌తో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. షరాఫ్ గ్రూప్ తన అనుబంధ సంస్థ హింద్ టెర్మినల్స్ ద్వారా లాజిస్టిక్స్, గిడ్డంగి సదుపాయాలు ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేసింది. దీనికోసం రైల్వే, పోర్టు లింక్ కలిగిన ప్రాంతాన్ని గుర్తించాలని ఆ సంస్థ ప్రతినిధులు కోరారు. ఏపీలో నిర్మాణంలో ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్లలో ఆధునిక లాజిస్టిక్ పార్కులు, గిడ్డంగుల ఏర్పాటుకు అవకాశం ఉందని తెలిపారు సీఎం. పెట్టుబడులు పెట్టే సంస్థలకు అవసరమైన మౌలిక వసతులు, మానవ వనరులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పోర్టులు, జాతీయ రహదారుల ద్వారా సరకు రవాణాకు రాష్ట్రం అనుకూలమని చెప్పారు. లాజిస్టిక్స్‌పై ప్రస్తుతం 14 శాతం ఖర్చు అవుతోందని.. దీనిని 8 నుంచి 9 శాతానికి తగ్గించాలని చూస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందనుకుంటే పాలసీల్లో మార్పులు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం చంద్రబాబు.
దుగరాజపట్నంలో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటులో భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ట్రాన్స్‌వరల్డ్ గ్రూప్ సానుకూలంగా స్పందించింది. ఆ సంస్థ ఛైర్మన్ రమేష్ ఎస్.రామకృష్ణన్‌తో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీలో లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించే ఆలోచనలో ఉన్నామని సీఎం తెలియజేశారు. త్వరలో మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం ఓడరేవులు అందుబాటులోకి వస్తాయన్నారు. రైల్వే, పోర్టులు, విమానాశ్రయాలకు కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు.
వైద్య రంగంలో రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్‌లో సుదీర్ఘ అనుభవం కలిగిన బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చింది. అబుదాబిలో అతి పెద్ద క్యాన్సర్ ఆస్పత్రిని నిర్వహిస్తున్న బుర్జిల్ హెల్త్ కేర్ సంస్థ.. ఏపీలో వైద్య ఆరోగ్య రంగంలో పెట్టుబడుల ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించింది. తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ముందుకొచ్చింది. ఏపీ వైద్య రంగంలో ప్రివెంటివ్-క్యూరేటీవ్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇప్పటికే హెల్త్ కార్డుల డిజిటలైజేషన్‌ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని వివరించారు.
ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు.. సీఐఐ నిర్వహించిన రోడ్‌షోలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అపారమైన అవకాశాలను.. యూఏఈ పారిశ్రామికవేత్తలకు వివరించారు. సీఎం ఇచ్చిన ప్రజంటేషన్‌కు మంచి స్పందన కనిపించింది. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో మైక్రోసాఫ్ట్ కీలకపాత్ర పోషించిందని.. ఇప్పుడు అదే తరహాలో విశాఖ అభివృద్ధిలో గూగుల్ కీరోల్ పోషిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ ఫ్యూచర్ టెక్నాలజీ హబ్‌గా మారుతుందన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, టూరిజం.. ఇలా ప్రతి రంగంలో ప్రపంచంలోని అత్యుత్తమ టెక్నాలజీని ఏపీకి తీసుకొస్తానన్నారు సీఎం. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు.. దుబాయ్ పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆహ్వానించారు. సరైన పారిశ్రామిక ప్రతిపాదనలతో వస్తే, అవగాహన ఒప్పందాలతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు తక్షణమే ఆమోదం తెలుపుతామన్నారు. ఏపీకి వచ్చి.. ప్రభుత్వ విధానాలను, అవకాశాలను పరిశీలించిన తర్వాతే.. పెట్టుబడులు పెట్టాలని వారికి భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ శాఖలు అందిస్తున్న వివిధ పౌర సేవలు, సంక్షేమ పథకాలపై సచివాలయంలోని ఆర్టీజీఎస్‌లో సీఎం చంద్రబాబు ఈవారం రివ్యూ చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందే సేవలు, వారిలో సంతృప్తి స్థాయి సాధించే అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, సీఎస్ కె.విజయానంద్, ఐటీ, ఆర్టీజీ, ఆర్థిక, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మహిళా సాధికారత సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్న అన్ని రంగాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఈ వారం సచివాలయంలో సెర్ప్, మెప్మా విభాగాలపై రివ్యూ నిర్వహించారు. 8 రకాల సేవలు అందించే మెప్మా-మన మిత్ర యాప్‌ని ప్రారంభించారు. మెప్మా చేపట్టే కార్యకలాపాలను వివరిస్తూ రూపొందించిన అవని వార్షిక సంచికను, ప్రజ్ఞ యాప్‌ని కూడా ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా మెప్మా సభ్యులకు వర్చువల్ ట్రైనింగ్ అందిస్తారు. అలాగే కోటీ 25 లక్షల బ్యాంక్ రుణం పొంది.. వ్యాపారం చేస్తున్న మంగళగిరికి చెందిన మహిళను సీఎం అభినందించారు.
కందుకూరు హత్య కేసు బాధితులకు.. ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు భరోసానిచ్చారు. మృతుడు లక్ష్మీ నాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, 5 లక్షల పరిహారం, ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, 5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. లక్ష్మీ నాయుడు పిల్లలను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కారు దాడిలో గాయపడ్డ పవన్‌కు 4 ఎకరాల భూమి, 5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందన్నారు. భార్గవ్‌కు 3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించాలని నిర్ణయించారు. ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై వేగంగా దర్యాప్తు పూర్తి చేయించాలని ఆదేశించారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈ వారం మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో.. సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అమరులు వారు అనే పుస్తకాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో.. సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రి అనిత, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పాల్గొన్నారు.
Story by Anup, Big tv