CM Chandrababu: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ బెస్ట్ డెస్టినేషన్ అన్నారు సీఎం చంద్రబాబు. 3 రోజుల దుబాయ్ పర్యటనలో.. ఎందరో బడా పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారంపై వారితో చర్చించారు సీఎం. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి రావాలంటూ ఆహ్వానించారు. తెలుగువారు గ్లోబల్ లీడర్ల స్థాయికి ఎదిగారని.. ప్రతి ఒక్కరూ జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.
3 రోజుల యూఏఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం బిజీబిజీగా గడిపారు. దుబాయ్‌లో.. పలువురు వ్యాపారవేత్తలు, అక్కడి ప్రభుత్వ ప్రతినిధులతో.. సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహించారు. వాళ్లందరికీ.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను వివరించారు. యూఏఈ పర్యటనలో భాగంగా.. సీఎం చంద్రబాబు తెలుగు డయాస్పోరాతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి.. ఒమన్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ, కువైట్‌సహా మిగతా గల్ఫ్ దేశాల నుంచి వేలాది మంది ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. యూఏఈలో ఎక్కడికి వెళ్లినా.. తెలుగువారంటే మంచి అభిప్రాయం కనిపించిందన్నారు సీఎం. దుబాయ్‌లో ఏ ఆఫీసుకి వెళ్లినా తెలుగువారు ఉన్నతస్థానాల్లో కనిపించారని.. గ్లోబల్ లీడర్ల స్థాయికి ఎదిగారని చెప్పారు. ప్రతి ఒక్కరూ.. జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఎడారిగా ఉన్న దుబాయ్‌ని.. 15 ఏళ్లలో స్వర్గంలా తీర్చిదిద్దారన్నారు చంద్రబాబు. వర్షాలు లేని ప్రాంతాన్నే ఇలా తీర్చిదిద్దితే.. అన్ని వనరులున్న ఏపీ ఏ స్థాయిలో ఉండాలన్నారు సీఎం. అందుకోసమే.. ఒకప్పుడు హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తెస్తే.. ఇప్పుడు విశాఖకు గూగుల్ తెస్తున్నామన్నారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే.. అమరావతికి క్వాంటమ్ వ్యాలీ వస్తోందన్నారు సీఎం చంద్రబాబు.
దుబాయ్‌లో.. యూఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. యూఏఈ, ఏపీ మధ్య వాణిజ్య బంధం పెంచుకునే అంశంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. భారత్- యూఏఈ దేశాలు నాలెడ్జ్ ఎకానమీపై దృష్టి పెట్టే అంశంపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాలన, పౌరసేవలను మరింత మెరుగ్గా అందించే అంశంపై భేటీలో మాట్లాడారు. సాంకేతికంగా పౌరసేవలు, పాలనా అంశాల్లోని అత్యుత్తమ విధానాలను ఆర్టీజీఎస్ ద్వారా ఇచ్చిపుచ్చుకునే అంశంపై యూఏఈ ఆర్థిక శాఖ మంత్రి వివరించారు. స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలకు నిధులు ఇవ్వటం ద్వారా ఏపీని నాలెడ్జ్ ఎకానమీగా ప్రోత్సహించే అంశంలో దుబాయ్ సిలికాన్ ఓయాసియా తీసుకున్న చర్యలపైనా ఇరువురు నేతలు మాట్లాడారు. ఏఐతో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేలా.. అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్- దుబాయ్ సిలికాన్ ఒయాసియా మధ్య కొత్త భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసే అంశంపై అంగీకారం తెలిపారు. ఆహార భద్రత అంశంపై ఏపీతో కలిసి పనిచేసేందుకు, కొత్త అవకాశాలను అన్వేషించే అంశాన్ని ప్రస్తావించారు యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి. అదేవిధంగా.. లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు, నూతన భాగస్వామ్యాల ఏర్పాటుపైనా సీఎం చర్చించారు.
అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ విదేశీ, వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్ జియాదీ ఆసక్తి చూపారు. ఏపీలో ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. థానీ బృందంతో జరిగిన సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారంపై చర్చించారు సీఎం. యూఏఈ-భారత్ మధ్య పెట్టుబడి సంబంధాలు బలోపేతం చేసుకోవాలన్న ఆకాంక్ష థానీ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక విద్యుత్, పెట్రో కెమికల్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో భాగస్వామిగా ఉండేందుకు అంగీకరించారు.
ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ధి, భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా.. ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు.. దుబాయ్‌లో ప్రారంభించారు. దీని ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ఏపీకి చెందిన ఉద్యోగులు, విద్యార్థులు లబ్ధి పొందొచ్చు. ఉద్యోగులు, వలస కార్మికులు, విద్యార్థుల కొరకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. తక్కువ ప్రీమియంతోనే.. 10 లక్షల దాకా బీమా అందుతుంది. బీమా చేసిన వ్యక్తి.. ప్రమాదం వల్ల మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగి.. 10 లక్షల ఆర్థికసాయం అందిస్తుంది ఏపీ సర్కార్. ఈ పథకాన్ని ఏపీ నుంచి విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. APNRTS వెబ్‌సైట్ ద్వారా.. ఈ పథకంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవాసాంధ్రులు ఎదుర్కొనే న్యాయపరమైన ఇబ్బందులను పరిష్కరించేందుకు.. ఎన్నార్టీ సొసైటీ ద్వారా లీగల్ కౌన్సెలింగ్, డాక్యుమెంటేషన్, అడ్వకేట్ ఫీజుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు సీఎం. ప్రసూతి ఖర్చుల కింద 35 వేలు, సిజేరియన్‌కు 50 వేలు అందిస్తామని తెలిపారు.
Story by Anup , Big tv