BigTV English
Advertisement

Private Bus: జనం ప్రాణాలతో.. ప్రైవేట్ ట్రావెల్స్ ఆటలు !

Private Bus: జనం ప్రాణాలతో.. ప్రైవేట్ ట్రావెల్స్ ఆటలు !

Private Bus: ప్రమాదాన్ని మనం ఆపలేం! జరగబోయే ఘోరాన్ని మనం ఊహించలేం! యాక్సిడెంట్స్ అంటేనే.. రెప్పపాటులో జరిగిపోయేది. కానీ.. ఒకే తరహా ప్రమాదం పదే పదే జరుగుతూ ఉంటే.. కచ్చితంగా జాగ్రత్తపడాల్సిందే! ఇప్పుడు.. ప్రైవేట్స్ ట్రావెల్స్ బస్సుల వరుస ప్రమాదాలు హెచ్చరిస్తున్నది కూడా ఇదే! రూల్స్‌ని బ్రేక్ చేస్తూ.. రోడ్ల మీద జనం ప్రాణాలను ఫణంగా పెడుతున్నాయ్ ప్రైవేట్ ట్రావెల్స్. మరి.. వీటిని కంట్రోల్ చేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు ? ఆర్టీఏ ఆఫీసర్ల ధోరణిపై.. జనంలో జరుగుతున్న చర్చేంటి ?


ఏదైనా ఘోర బస్సు ప్రమాదం జరిగినప్పుడు.. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయినప్పుడు.. అయ్యో పాపం అనే నిట్టూర్పులు చూస్తాం మనం. అదే సమయంలో.. ఓ నాలుగైదు రోజులు ఆర్టీఏ అధికారుల తనిఖీలు, హడావుడి.. మామూలుగా ఉండదు. కానీ.. ప్రమాదం జరిగినప్పుడే.. అధికారులకు తమ విధులు గుర్తొస్తాయా? ప్రాణాలు పోయినప్పుడే.. ట్రావెల్స్ యాజమాన్యాల నిబంధనలు అతిక్రమిస్తున్నారనే విషయం అర్థమవుతుందా? వరుస ప్రమాదాలు జరుగుతున్నా.. ఆర్టీఏ అధికారులు తమకు సంబంధం లేదన్నట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ముందునుంచే.. ప్రైవేట్ ట్రావెల్స్‌ని కంట్రోల్ చేసి ఉంటే.. ఈ పరిస్థితులు వచ్చేవా? అనే చర్చ.. ఇప్పుడు జనంలో గట్టిగా వినిపిస్తోంది.

అన్నీ తెలిసినా పట్టించుకోని ఆర్టీఏ అధికారులు:

ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్య ధోరణి, ఆర్టీఏ అధికారుల పట్టింపులేనితనం గురించి మాట్లాడుకునేకంటే ముందు.. గత రెండు, మూడు రోజుల్లో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాల గురించి మాట్లాడుకోవాలి. 19 మంది చనిపోయారు కాబట్టి.. కర్నూలు బస్సు ప్రమాదం చాలా పెద్దదిగా కనిపిస్తోంది. నిజానికి.. ఇది ఎంతో విషాదాన్ని మిగిల్చిన దుర్ఘటన. కానీ.. చిన్నటేకూరు దగ్గర బస్సు ప్రమాదానికి గురై.. ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడానికి ఒక్క రోజు ముందే.. తిరుపతి జిల్లా పెన్నేపల్లి నేషనల్ హైవేపై.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయింది. నెల్లూరు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలతో.. క్షణాల్లోనే బస్సు కాలి బూడిదైంది. ఈ సమయంలో.. అందులో ప్రయాణిస్తున్న 22 మంది ప్రయాణికులు ప్రాణాపాయాన్ని తప్పించుకొని.. సురక్షితంగా బయటపడ్డారు. ఇది జరిగిన తర్వాతి రోజే.. కర్నూలు శివార్లలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా.. రోడ్డుపై పడి ఉన్న బైక్‌ని ఢీకొట్టి ప్రమాదానికి గురైంది.


కొత్తూరు నేషనల్ హైవేపై మరో ప్రైవేట్ బస్సు ప్రమాదం:

శుక్రవారం కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదాన్ని మరువకముందే.. అదే ఎన్‌హెచ్ 44పై.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు.. తెల్లవారుజామున లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. యాక్సిడెంట్ అయిన బస్సుని.. 80 కిలోమీటర్లకు పైగా నడిపి.. హైదరాబాద్ దాకా తీసుకొచ్చాడు డ్రైవర్. శంషాబాద్ దగ్గర తనిఖీలు చేస్తున్న ఆర్టీఏ అధికారులకు ఈ బస్సు కనిపించింది. వెంటనే.. ప్రయాణికులను దించేసి.. కేసు నమోదు చేసి బస్సుని సీజ్ చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో కొత్తూరు నేషనల్ హైవేపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో.. హైవే రెయిలింగ్‌‌ని ఢీకొట్టింది బస్సు. రాజమండ్రి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు డ్రైవర్లు, 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

కేవలం టికెట్లు, ఆదాయం మీదే ట్రావెల్స్ ఫోకస్:

హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద కూడా న్యూగో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. 15 మంది ప్రయాణికులతో.. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు.. పెద్ద అంబర్‌పేట సమీపంలో.. ప్రమాదానికి గురైంది. 9 మందికి గాయాలవడంతో.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఇలా.. 3 రోజుల్లోనే.. తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట ప్రైవేట్ ట్రావెల్స్‌కి చెందిన బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ట్రావెల్స్ యాజమాన్యాలు మాత్రం నిబంధనలు పట్టించుకోకుండా, జాగ్రత్తలు పాటించకుండా.. టికెట్లు అమ్ముకోవడం, ఆదాయం మీదే ఫోకస్ చేశాయ్. ప్రయాణికుల సేఫ్టీ గురించి అస్సలు ఆలోచించడం లేదు. అందువల్లే.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నియంత్రణలో.. తెలుగు రాష్ట్రాల్లో రవాణా శాఖ ఫెయిలైందంటున్నారు ప్రజలు. అడుగడుగునా ఆర్టీఏ అధికారుల అలసత్వం కనపడటంతో.. జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నిసార్లు రూల్స్ బ్రేక్ చేసినా చర్యలు ఉండవా?

వాస్తవానికి.. తెలుగు రాష్ట్రాలలో స్లీపర్ కోచ్ బస్సులకు అనుమతి లేదు. అయినప్పటికీ.. 2 రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలే కేంద్రంగా ప్రైవేట్ ట్రావెల్స్ దందా బాగా సాగుతోంది. పర్మిషన్ లేకుండా స్లీపర్ కోచ్‌లు తిరుగుతున్నా.. ఆర్టీఏ అధికారులు మాత్రం పట్టించుకోట్లేదు. దీంతో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు గూడ్స్ క్యారియర్లుగా మారుతున్నాయి. బస్ అడుగు భాగంలో ప్యాసింజర్ల లగేజీతో పాటు వివిధ వస్తువులను నింపేస్తున్నారు. ప్రమాదకర కెమికల్స్, బ్యాటరీలు, ఇంధన క్యాన్లని కూడా లగేజీ బాక్సుల్లో నింపేస్తున్నారు. ప్రయాణికులను తీసుకెళ్లే బస్సుల్లో గూడ్స్ తీసుకెళ్లకూడదనే నిబంధనకు ప్రతిరోజూ తూట్లు పొడుస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నో ఎంట్రీ టైమ్‌లోనూ.. భారీ వాహనాలు నగరం మొత్తం తిరుగుతున్నా.. ట్రాఫిక్ సిబ్బంది మాత్రం పట్టించుకోవట్లేదు. కర్నూలు దగ్గర మంటల్లో కాలిపోయిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుపై.. 16 చలానాలు ఉన్నా.. ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్న తలెత్తుతోంది. అదే.. టూవీలర్లపై రెండు చలానాలున్నా.. ముక్కు పిండి వసూలు చేసేస్తారు ట్రాఫిక్ సిబ్బంది. మరి.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని.. మండిపడుతున్నారు. వ్యవస్థల అలసత్వమే.. వరుస ప్రమాదాలకు కారణమని చెబుతున్నారు. ఇప్పటికైనా.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను కట్టడి చేయాలని కోరుతున్నారు.

ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలి అంటున్న ప్రజలు:

ఎప్పుడో ఒకప్పుడు.. ఏదో ఒక బస్సు ప్రమాదానికి గురైందంటే.. ఏమో అనుకోవచ్చు. కానీ.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయ్. ఈ యాక్సిడెంట్లకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? ప్రైవేట్ ట్రావెల్స్‌ని కంట్రోల్ చేసేందుకు.. ఆర్టీఏ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పటికైనా.. రవాణా శాఖ అధికారులు మేల్కోవాలనే డిమాండ్.. చాలా గట్టిగా వినిపిస్తోంది. లేకపోతే.. ప్రమాదాలను కూడా అలవాటు చేసుకునే దుస్థితి వస్తుందంటున్నారు.

నిబంధనలు పాటించకుండానే రోడ్లపైకి ప్రైవేట్ బస్సులు:

కర్నూలు దగ్గర వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన తర్వాత.. వినిపిస్తున్న చర్చ ఒకటే. ఇంతటి విషాదానికి నిర్లక్ష్యం ఒక్కటే కాదు.. ఆర్టీఏ అధికారుల అలసత్వం కూడా కారణమనే వాదన గట్టిగా వినిపిస్తోంది. రవాణాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ఉంటే.. ట్రావెల్స్ యాజమాన్యం.. నిబంధనలు పాటించి.. సరైన జాగ్రత్తలు తీసుకొని ఉంటే.. ఇంత దాకా వచ్చేది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. వాస్తవానికి.. ఏ ట్రావెల్స్ బస్సు కూడా రూల్స్ పాటించి.. రోడ్ల మీద తిరగడం లేదు. ఒక బస్సు.. కంపెనీలో ఏ విధంగా డిజైన్ అయిందో.. అక్కడ ఎలా తయారైందో.. ప్రయాణికుడిని చేరే వరకు దాని డిజైన్ అలాగే ఉండాలి. కానీ.. మన దగ్గర అలా కాదు. ట్రావెల్స్ యాజమాన్యాలు ఒక బస్సు కొన్నాయంటే.. వారి టాలెంట్ అంతా దానిమీదే చూపిస్తారు. అనేక మార్పులు చేస్తారు. కంపెనీలో బస్సు ఉండే డిజైన్‌కి.. రోడ్డు మీద తిరిగే బస్సుకి అస్సలు సంబంధం ఉండదు. కొన్నిసార్లు సెమీ స్లీపర్ బస్సుల్ని.. పూర్తిగా స్లీపర్ కోచ్‌ బస్సుగా మార్చేస్తారు. ఇంకొందరు.. సీట్లు తీసేసి.. స్లీపర్ బెర్తులు పెట్టేస్తారు. ఇంకొందరు.. బస్సు కొన్నప్పుడు ఉన్న సీట్ల సంఖ్య కన్నా.. వాళ్లదగ్గరికి వచ్చిన తర్వాత సీట్ల సంఖ్య పెంచేస్తారు. వీటన్నింటిని.. రవాణాశాఖ పర్మిషన్ అస్సలు ఉండదు. నిజానికి.. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. అయినాసరే.. తమకు నచ్చినట్లుగా బస్సు డిజైన్‌ని మార్చేస్తున్నారు. సీట్లు, బెర్తుల సంఖ్య పెంచి.. ప్రయాణికుల ప్రాణాలను డేంజర్‌లో పెట్టి మరీ సొమ్ము చేసుకుంటున్నారు.

నచ్చినట్లుగా బస్సుల డిజైన్లు మార్చేస్తున్న ట్రావెల్స్:

కొన్నేళ్లుగా స్లీపర్ బస్సుల్లో జరుగుతున్న వరుస ప్రమాద ఘటనలు.. ప్రయాణికులను టెన్షన్ పెడుతున్నాయ్. అందువల్లే.. ప్రైవేట్ ట్రావెల్స్‌ని కంట్రోల్ చేసేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయ్. ముఖ్యంగా.. ఈ ప్రమాదాలకు డిజైన్ లోపమే కారణమనే చర్చ సాగుతోంది. బెర్త్‌ల మధ్య గ్యాలరీలు చాలా ఇరుగ్గా ఉండటంతో.. కేవలం ఒక్కరు మాత్రమే వెళ్లేందుకు వీలవుతోంది. ఇలా.. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు.. అందులోని ప్రయాణికులు ఇరుకైన గ్యాలరీ నుంచి వేగంగా బయటకు రాలేక మంటల్లోనే కాలిపోతున్నారు. బస్సు ఉన్నట్టుండి ఓ వైపుకి ఒరిగినప్పుడు.. ప్రయాణికులు మెయిన్ డోర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను చేరడం కష్టమవుతోంది. స్లీపర్ బస్సుల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు.. మొదటి రెండు నిమిషాల్లో స్పందించే తీరే అత్యంత కీలకం. అయితే.. ఈ స్లీపర్ కోచ్ బస్సుల్లో ప్రయాణించే వారు ఎక్కువగా నిద్రలోనే ఉంటారు. ప్రమాదం జరిగే సమయానికి.. వెంటనే తేరుకున్న వారే ప్రాణాలతో.. బయటపడుతున్నారు. అప్పర్ బెర్తుల్లో ఉన్నవారు బయటపడటం కష్టమవుతోంది.

Also Read: రైతుల భూ సమస్యలకు.. సీఎం రేవంత్ శాశ్వత పరిష్కారం

కావేరి ట్రావెల్సెబస్సులో 234 స్మార్ట్ ఫోన్లు దగ్ధం:

ఇక.. చిన్నటేకూరు దగ్గర ప్రమాదానికి గురైన.. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో.. 234 స్మార్ట్ ఫోన్లు దగ్ధమైపోయాయ్. ఓ హైదరాబాద్‌ వ్యాపారి.. 46 లక్షలు విలువ చేసే మొబైల్ ఫోన్ బాక్సులను.. బెంగళూరుకు పార్సిల్ చేశారు. ప్రమాదంలో.. మంటల తీవ్రత పెరగడానికి సెల్ ఫోన్ బ్యాటరీలు పేలిపోవడం కూడా ఓ కారణమని ఫోరెన్సిక్ నిపుణులు అంటున్నారు. అవే కాదు.. బస్సులోని ఏసీ సిస్టమ్‌కు అమర్చిన ఎలక్ట్రిక్ బ్యాటరీలు కూడా పేలిపోయాయ్. మంటల తీవ్రతకు బస్సు ఫ్లోర్‌పై ఉన్న అల్యూమినియం షీట్లు కరిగిపోయాయ్. బస్సు తయారీలో ఇనుముకు బదులు.. తేలికపాటి అల్యూమినియం షీట్లని వాడటం వల్ల.. వాహనం బరువు తగ్గుతుంది. ఫలితంగా.. బస్సు వేగంగా వెళ్లేందుకు వీలవుతుంది. ఈ లోపమే.. ప్రమాదాలు జరిగినప్పుడు.. మంటల తీవ్రతని పెంచుతోంది. ప్రాణాలను బలితీసుకుంటోంది. అందువల్ల.. బస్సుల కంపెనీలు తయారుచేసిన డిజైన్‌కు.. ఎలాంటి మార్పులు-చేర్పులు చేయొద్దంటున్నారు.

ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా.. బస్సు బయల్దేరడానికి ముందే.. ఓ చెక్ లిస్ట్ సిద్ధం చేసుకొని.. అన్ని సరిగ్గా ఉన్నాయో లేవో పరిశీలించాలి. ఆ తర్వాతే.. బస్సుని నడపాలని సూచిస్తున్నారు. డ్రైవర్లు రాత్రివేళల్లో ఓవర్ స్పీడ్‌తో నడపకుండా, నిద్రమత్తులోకి జారకుండా జాగ్రత్తపడాలి. కేవలం.. ఎమర్జెన్సీ విండో దగ్గరే కాదు.. ప్రతి అద్దం దగ్గర అత్యవసర సమయాల్లో దాన్ని బ్రేక్ చేసేందుకు అవసరమయ్యే పరికరాన్ని అందుబాటులో ఉంచాలి. బస్సు బయల్దేరడానికి ముందే.. ఏదైనా ప్రమాదం జరిగితే.. ఎలా బయటపడాలన్న దానిపై ప్రయాణికులకు 2 నిమిషాల పాటు అవగాహన కల్పించాలి. అప్పుడు మాత్రమే.. ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు.. బస్సులో ఉన్నవారు సేఫ్‌గా బయటపడే అవకాశం ఉంటుందనే సూచనలు వినిపిస్తున్నాయ్.

Story by Anup, Big tv

Related News

CM Revanth: రైతుల భూ సమస్యలకు.. సీఎం రేవంత్ శాశ్వత పరిష్కారం

CM Revanth: పట్టణ ప్రాంత పేదలకు శుభవార్త జీ+1 తరహాలో.. ఇందిరమ్మ ఇండ్లు

West Godavari: పశ్చిమ టీడీపీ పగ్గాలు ఎవరికో?

Pocharam Srinivas: చెప్పుతో కొట్టండి! పోచారం స్వరం మారుతుందా?

Dharmana prasada : కొడుకు ఎంట్రీ.. రాజకీయాలకు ధర్మాన గుడ్ బై..!

Karimnagar: అడ్లూరికి తలనొప్పిగా మంత్రి పదవి!

Golconda Dimond: గోల్కొండ డైమండ్.. ఫ్రెంచ్ దాకా ఎలా వెళ్లింది?

Big Stories

×