⦿ క్రిప్టో కరెన్సీలో తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు
⦿ కేటుగాళ్లకు అవకాశంగా మారిన ఈ అభిప్రాయం
⦿ ఉద్యోగాల పేరుతో రిక్రూట్ చేసుకుంటూ వాళ్లతోనే నేరాలు
⦿ మయన్మార్‌లో నడిచే అక్రమ సైబర్ డెన్‌లు
⦿ తెలంగాణకు చెందిన ఇద్దరు బాధితులు
⦿ మయన్మార్ సైబర్ క్రైమ్ సిండికేట్‌ల నుండి రెస్య్కూ
⦿ అమెరికాలోని పెట్టుబడిదారులను లక్ష్యంగా చేసుకుని…
⦿ పెద్ద ఎత్తున క్రిప్టోకరెన్సీ స్కామ్ నిర్వహణ
⦿ బాధిత యువతను రక్షించిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
⦿ తెలంగాణకి చెందిన 24 మంది వ్యక్తుల అక్రమ రవాణా
⦿ నకిలీ ఉద్యోగ ఆఫర్ల పేరుతో యువతను ఆకర్షించిన స్కామర్లు
⦿ నల్గొండ జిల్లాకు చెందిన బాధితుల్లో ఒకరైన 23 ఏళ్ల కాటం వేణు
⦿ అతనికి E18 అనే నకిలీ గుర్తింపు
⦿ నీస్ ఆపరేటర్ల నియంత్రణలో ఉన్న ఈ ప్లాట్‌ఫామ్
⦿ ప్లాట్‌ఫామ్‌లో నాణేల ధర గ్రాఫ్ తారుమారు
⦿ మాయచేయడానికి కాల్ సెంటర్‌ల నుండి మహిళలతో వీడియో కాల్
⦿ పెట్టుబడులు తిరిగి తీసుకోవాలని ప్రయత్నిస్తే అకౌంట్ లాక్
⦿ హైదరాబాద్‌లోని జహనుమాకు చెందిన 23 ఏళ్ల మొహమ్మద్ అర్బాజ్
⦿ అర్బాజ్ పాత్ర NRIగా, సెలబ్రిటీగా నటించడం
⦿ అకౌంట్‌కి తగినంత మంది ఫాలోవర్స్ వచ్చిన తర్వాత…
⦿ ఫాలోవర్లలో నమ్మకాన్ని పెంచడానికి పర్సనల్ చాటింగ్
⦿ పరస్పర చర్యలు చట్టబద్ధమైనవే అన్నట్లు మోసం
⦿ బాధితులను USDT లేదా ETH కొనుగోలు చేయాలని వత్తిడి
⦿ అర్బాజ్‌కు ప్రతి లక్ష డాలర్ల పెట్టుబడిపై 1% కమిషన్
⦿ రెండు నెలల పనికి కేవలం 31 వేల థాయ్ బాట్‌తో మోసం
⦿ మార్చి 14న 8మంది ఏజెంట్లను అరెస్టుచేసిన TGCSB
⦿ జగిత్యాల నివాసితులు అల్లెపు వెంకటేష్, చల్లా మహేష్
⦿ ఫలక్‌నుమా నివాసి మహ్మద్ జలాల్
⦿ హైదరాబాద్‌లోని బిఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన బొమ్మ వసంత్ కుమార్
⦿ బడంగ్‌పేటకు చెందిన దాసరి ఏక్‌నాథ్ గౌడ్
⦿ వేములవాడకు చెందిన కాటంగూరి సాయి కిరణ్
⦿ బహదూర్‌పురాకు చెందిన హెచ్ బషీర్ అహ్మద్
⦿ బండ్లగూడకు చెందిన గాజుల అభిషేక్
⦿ సదరు స్కామ్‌లో పాల్గొన్న 15 మంది ఏజెంట్లు
నకిలీ ఖతర్నాక్‌లు గాలం వేస్తున్నారు జాగ్రత్త. క్రిప్టో కాయిన్‌లో రూపాయి పెట్టుబడి పెడితే వంద రూపాయిలు వస్తాయంటే నమ్మేయకండి. ఇది కేవలం గాలం మాత్రమే. అయితే, మనకు గాలం వేయడానికి మనలాంటి వారిని ఇంకొందర్ని బలిపశువుల్ని చేస్తున్నారు ఈ కేటుకాళ్లు. మయన్మార్‌లో అడ్డా పెట్టి… సైబర్ క్రైమ్‌లు యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో యువకుల్ని రిక్రూట్ చేసుకుంటూ… దొంగదారుల్లో రవాణా చేస్తున్నారు. బంధించి, వేధించి వాళ్ల చేత ఈ నేరాలు చేయిస్తున్నారు. తాజాగా ఈ సైబర్ నేరల బాధితుల్ని పోలీసులు భారత్ తీసుకొచ్చారు. వారిలో తెలంగాణకు చెందిన యువకులు కూడా ఉన్నారు. ఇంతకీ, వీళ్లు ఈ వలలో ఎలా చిక్కుకున్నారు…? క్రిప్టో కాయిన్ పేరుతో జనాల్ని ఎలా మోసం చేసేవాళ్లు..? పూర్తి వివరాలు మీ కోసం..
క్రిప్టో కరెన్సీ క్రేజ్ ఇటీవల మరింత పెరిగింది. అమెరికా అంతటి దేశమే క్రిప్టోను అధికారికంగా ఒప్పుకుంటుంటే… ప్రపంచవ్యాప్తంగా ఈ డిజిటల్ కరెన్సీకి డిమాండ్ మరింత పెరుగుతోంది. ఒక్క బిట్ కాయిన్ ఖరీదు అమ్మో అంత ఉంటుందా అంటూ సామాన్యుడు సైతం క్రిప్టో కరెన్సీకి ఆకర్షితుడౌతున్నారు. ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు అందులో పెట్టుబడి పెట్టడానికి చాలా మంది క్యూ కడుతున్నారు. ఇక, ఈ ట్రెండింగ్ కరెన్సీలో తక్కువ పెట్టుబడి పెట్టి, ఎక్కువ లాభాలు పొందడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సరిగ్గా ఇదే అభిప్రాయం… కేటుగాళ్లకు అవకాశంగా మారింది. క్రిప్టో కరెన్సీని గాలం వేసి… సాధ్యమైనంత దోచుకోడానికి భారీ కంపెనీలనే నడిపిస్తున్నారు. దీని కోసం యువతను ఉద్యోగాల పేరుతో రిక్రూట్ చేసుకుంటూ వాళ్లతోనే నేరాలు చేయిస్తున్నారు. అక్రమంగా వాళ్లను ఇతర దేశాలకు రవాణా చేసి, అక్కడ బంధించి.. వేధించి.. అమాయక జనాల్ని వలలో వేసుకుంటున్నారు. అందినంత లాగి, అకౌంట్ లాక్ చేస్తున్నారు. అయితే, ఇంత దారుణమైన మోసంలో బలయ్యేది ఇద్దరే. ఒకరు ఉద్యోగం కోసం వాళ్లకు బంధీ అయిన యువత… వారి చేతులో మోసపోయిన అమాయక జనం. ఇప్పుడు ఈ రాకెట్‌ను భారత్ పోలీసు వర్గాలు ఛేదించాయి. మయన్మార్‌లో నడిచే ఈ అక్రమ సైబర్ డెన్‌ల నుండి బాధిత యువకుల్ని భారత్ తరలిస్తున్నారు.
తెలంగాణకు చెందిన ఇద్దరు బాధితుల్ని ఇటీవల మయన్మార్‌లో ఉన్న సైబర్ క్రైమ్ సిండికేట్‌ల నుండి రక్షించారు పోలీసులు. వీళ్లు అక్కడ జరిగే దారుణమైన ఈ మోసాల్ని బయటపెట్టారు. ముఖ్యంగా, వీళ్లు మయన్మార్ నుండి అమెరికాలోని పెట్టుబడిదారులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున క్రిప్టోకరెన్సీ స్కామ్‌ను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సిండికేట్‌లు… మోసపూరితంగా గోల్డ్ బేస్డ్ క్రిప్టోకరెన్సీ పెట్టుబడులకు గాలం వేస్తున్నారు. ఎలాంటి అనుమానం రాకుండా వ్యక్తులను మోసం చేస్తున్నారు. పెట్టుబడీదారుల్ని ఆకర్షించడానికి నకిలీ ఆన్‌లైన్ గుర్తింపుతో యువకుల్ని వినియోగిస్తున్నారు. ఇలాంటి బాధిత యువతను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రక్షించింది. తెలంగాణకి చెందిన 24 మంది వ్యక్తులను అక్రమ రవాణా చేసినందుకుగాను ఎనిమిది మంది ఏజెంట్లను అరెస్టు చేసింది. నకిలీ ఉద్యోగ ఆఫర్ల పేరుతో వారిని ఆకర్షించి… వారితో మయన్మార్‌లో సైబర్ స్కామ్ కార్యకలాపాలు చేయిస్తున్నారు. ఇందులో చిక్కుకున్న వందలాది మంది భారతీయు్లో తెలంగాణకు చెందిన ఈ ఇద్దరు బాధితులు కూడా ఉన్నారు.
నల్గొండ జిల్లాకు చెందిన బాధితుల్లో ఒకరైన 23 ఏళ్ల కాటం వేణును KK4 పార్క్‌లోని షాన్స్ హబ్ కంపెనీకి నియమించారు ఈ సైబర్ కేటుగాళ్లు. అక్కడ అతనికి E18 అనే నకిలీ గుర్తింపును ఇచ్చారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లో ఒక మహిళగా నటిస్తూ అమెరికాలోని పెట్టుబడిదారులతో మాట్లాడమని చెప్పారు. ఇక, చైనీస్ ఆపరేటర్ల నియంత్రణలో ఉన్న ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా క్రిప్టోకరెన్సీ బంగారు నాణేలను కొనుగోలు చేయమని పెట్టుబడిదారులను ఒప్పించడం అతని పని. అలాగే, వాళ్లు పెట్టే పెట్టుబడులు లాభదాయకంగా కనిపించేలా చేయడానికి… స్కామర్లు ఈ ప్లాట్‌ఫామ్‌లో నాణేల ధర గ్రాఫ్‌ను తారుమారు చేస్తుంటారు. ఇలాంటి వాతారవణంలో బాధితుడైన వేణు వారాల తరబడి పెట్టుబడిదారులతో చాట్ చేస్తూ వచ్చారు. ఒకవేళ, ఎవరైనా పెట్టుబడిదారుడు అనుమానం వచ్చి సందేహాలు అడిగితే… వాళ్లను మరింత మాయచేయడానికి కాల్ సెంటర్‌ల నుండి మహిళలతో వీడియో కాల్‌లను చేయిస్తారు. చివరికి, ఎవరైనా బాధితులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి ప్రయత్నిస్తే… వాళ్ల అకౌంట్‌లో డబ్బులు లాక్ అయిపోతాయి. అకౌంట్ అందుబాటులో లేదని చెబుతారు. అయితే, ఇలాంటి మోసపూరిత వాతావరణంలో… మూడు నెలలు పనిచేసిన తర్వాత కూడా వేణుకు ఇస్తానన్న జీతం సరిగ్గా ఇవ్వలేదు స్కామర్లు. బదులుగా కంపెనీ టార్గెట్‌ను పూర్తి చేయడానికి మరింత మంది బాధితులను నియమించుకోవాలని ఒత్తిడి చేశారు.
తెలంగాణకు చెందిన మరో బాధితుడు హైదరాబాద్‌లోని జహనుమాకు చెందిన 23 ఏళ్ల మొహమ్మద్ అర్బాజ్ బిన్ బా బాజర్. ఇతన్ని KK2, KK పార్క్‌లోని ఝంటు కంపెనీలో ఉంచారు. అక్కడ అతను సోషల్ మీడియా మానిప్యులేషన్ ఉపయోగించి, క్రిప్టోకరెన్సీ మోసంలో శిక్షణ పొందాడు. తర్వాత స్కామర్లు, అతడి నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను సృష్టించారు. ఇక్కడ, అర్బాజ్ పాత్ర NRIగా… సెలబ్రిటీగా నటించాల్సి ఉంది. దీంతో అతడి సోషల్ మీడియా అకౌంట్‌కి తగినంత మంది ఫాలోవర్స్ వచ్చిన తర్వాత… అతడు, అతని బృందం కలిసి అందులో కొంతమంది వ్యక్తులను ఎంచుకోవాలి. దాని కోసం ఫాలోవర్లలో నమ్మకాన్ని పెంచడానికి పర్సనల్ చాటింగ్ కోసం ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను పంపుతారు. ఇలా, ఈ సిండికేట్ నిజమైన యూఎస్ వాట్సాప్ నంబర్‌ల యాక్సెస్‌ను పొందుతుంది. దీంతో… పరస్పర చర్యలు చట్టబద్ధమైనవే అన్నట్లు మోసం చేస్తారు. ఈ టార్గెట్‌ల కోసం ఫాలోవర్స్‌తో స్నేహం చేయడం అర్బాజ్ పని. ఇలా అర్బాజ్…. సిండికేట్ నియంత్రించే మోసపూరిత ప్లాట్‌ఫామ్ నుండి బాధితులను USDT లేదా ETH కొనుగోలు చేయాలని చెబుతాడు. ఇక, వెబ్‌సైట్‌లో తారుమారు చేసిన ధరలతో క్రిప్టోకరెన్సీని డిస్కౌంట్‌కు అమ్ముతున్నట్లు మోసం చేస్తారు. అయితే, లావాదేవీలు పూర్తయిన తర్వాత, బాధితులు తమ నిధులను తిరిగి తీసుకోలేరు. ఇలా, అర్బాజ్‌కు ప్రతి లక్ష డాలర్ల పెట్టుబడిపై 1% కమిషన్ ఇస్తామని స్కామర్లు హామీ ఇచ్చారు. కానీ, అతడు చేసిన రెండు నెలల పనికి కేవలం 31 వేల థాయ్ బాట్ మాత్రమే చెల్లించారు.
మొత్తానికి, తెలంగాణకు చెందిన వేణు, అర్బాజ్ ఇద్దరూ ఆ క్రైమ్ డెన్ నుండి బయటపడ్డారు. అక్కడి నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. వీరిచ్చిన సమాచారం మేరకు… అక్రమ రవాణా రాకెట్ పై కఠిన చర్యలు తీసుకునే క్రమంలో సైబర్ స్లూత్స్ 8 మంది ఏజెంట్లను పట్టుకున్నారు. మయన్మార్‌లోని సైబర్ క్రైమ్ డెన్స్‌లకు మానవ అక్రమ రవాణా చేస్తున్న ఎనిమిది మంది ఏజెంట్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మార్చి 14న అరెస్టు చేసింది. అరెస్టయిన వ్యక్తులను జగిత్యాల నివాసితులు అల్లెపు వెంకటేష్, చల్లా మహేష్… ఫలక్‌నుమా నివాసి మహ్మద్ జలాల్…. హైదరాబాద్‌లోని బిఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన బొమ్మ వసంత్ కుమార్… బడంగ్‌పేటకు చెందిన దాసరి ఏక్‌నాథ్ గౌడ్…. వేములవాడకు చెందిన కాటంగూరి సాయి కిరణ్…. బహదూర్‌పురాకు చెందిన హెచ్ బషీర్ అహ్మద్…. బండ్లగూడకు చెందిన గాజుల అభిషేక్‌గా గుర్తించారు.
అయితే, ఈ ఆపరేషన్‌లో భాగంగా, సదరు స్కామ్‌లో పాల్గొన్న 15 మంది ఏజెంట్లు, మధ్యవర్తులను కూడా పోలీసులు గుర్తించారు. ఇందులో ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేయగా, మిగిలిన అనుమానితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ధృవీకరించారు. కాగా, పరారిలో ఉన్న వ్యక్తులను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు శిఖా గోయల్ తెలిపారు. ఇక, తెలంగాణలోని వివిధ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో పది మంది బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటివరకు తొమ్మిది కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
ఇంతవరకూ బానే ఉంది… బాధితుల్లో కొంతమంది భారత్ వచ్చేశారు. స్కామర్లకు సహకరించిన ఏజెంట్లను పోలీసులు పట్టుకున్నారు. పరారిలో ఉన్నవారిని వెతుకుతున్నారు. అయితే, ఇంత పెద్ద మోసం వెనుక ఉన్నది ఎవరు…? ఈ మాయాడెన్ మయన్మార్ నుండి నడుపుతుంది చైనీయులేనా…? ఇక్కడ ఉద్యోగులుగా పనిచేస్తున్న బాధిత యువత ఎవర్ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది..? బంధీలుగా మారిన ఈ యువత పనిచేయడానికి నిరాకరిస్తే వారిని హింసిస్తారా…? అసలు, వీళ్లు ఎలా బయటపడ్డారు…?
ఏదైనా దేశంలో రహస్యంగా ఒక స్కామ్ జరుగుతుందంటే… దాన్ని గుర్తించడం చాలా కష్టం. ముఖ్యంగా, విదేశాల్లో జరుగుతున్నదాన్ని మనదేశం నుండి ట్రేస్ చేయడం మరింత కష్టం. ఇక, సైబర్ నేరాలు మితిమీరుతున్న కాలంలో ఏ మోసం ఎక్కడి నుండో జరుగుతుందో తెలుసుకోవడం కూడా అసాధ్యం. కానీ, దొంగతనం ఎప్పుడైనా బయటపడక మానదు. అలాగే, మయన్మార్ నుండి నిర్వహిస్తున్న ఈ నేరాలు కూడా బయటపడ్డాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, మయన్మార్-థాయిలాండ్ సరిహద్దులోని సైబర్ క్రైమ్ కేంద్రాల నుండి ఇలాంటి బాధితలు 549 మంది రెస్య్కూ అయ్యారు. వీళ్లను రెండు సైనిక విమానాలలో స్వదేశానికి తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. వీరిలో 24 మంది తెలంగాణకు చెందినవారు ఉన్నారు. వీళ్లు మార్చి 11-12 తేదీల్లో ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు. వీళ్లు సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చిన తర్వాత… ఇలా విదేశీ ఉద్యోగాల ముసుగులో బాధితులను అక్రమ రవాణా చేసినవాళ్లు ఎవరనే దిశగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తు ప్రారంభించింది. అలాగే, డేటా ఎంట్రీ ఉద్యోగాల ముసుగులో మయన్మార్‌కు సైబర్ నేరాల కోసం అక్రమ రవాణాకు గురైన బాధితుల నుండి జాతీయ దర్యాప్తు సంస్థ వాంగ్మూలాలను నమోదు చేయడం ప్రారంభించింది.
ఇలా బాధితులుగా మారిన వారిలో కరీంనగర్ జిల్లా మానకొండూర్‌కు చెందిన మధుకర్ రెడ్డి కూడా ఒకరు. దుబాయ్‌లో పనిచేసుకుంటున్న ఇతను టెలిగ్రామ్ ద్వారా ఒక ఉద్యోగానికి అప్లై చేసుకున్నారు. కాగా, టెలిగ్రామ్‌లోనే ఈ నకిలీ ఉద్యోగ ఇంటర్వ్యూ జరిగింది. కొన్ని రోజులకు ఆ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లు మధుకర్‌కి మెసేజ్ వచ్చింది. తర్వాత, అతన్ని అక్రమ మార్గంలో థాయలాండ్ ద్వారా మయన్మార్‌లోని సైబర్ నేరాల డెన్‌కి తీసుకెళ్లారు.
విన్నారుగా… మధుకర్ లాంటి వాళ్లు అక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్లు మయన్మార్‌లోకి ఎంటర్ అయిన వెంటనే వాళ్ల పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకొని, వాళ్ల పేర్లు కూడా మార్చేస్తారు. మయన్మార్‌లోని మైవాడీలోని కెకె పార్క్‌లో సైబర్ స్కామ్ సిండికేట్‌లకు వారి అమ్మేస్తారు. ఇక, సైబర్ క్రైమ్ డెన్స్‌లో సంపాదించిన జీతాలను బినాన్స్ ద్వారా బదిలీ చేసి, థాయ్ బాట్ ఉపయోగించి క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేసి, దానిని యుఎస్ డాలర్లుగా మార్చి, చివరికి భారతీయ రూపాయలలోకి వారి కుటుంబాలకు పంపినట్లు బాధితులు చెబుతున్నారు. ఇలాంటి బాధితుల్లో ఒక్క భారతీయులు మాత్రమే కాదు. శ్రీలంక, నేపాల్ వంటి దేశాల నుండి కూడా చాలా మంది ఉన్నారు.
ఇక, ఈ స్కామర్లకు యువతను సరఫరా చేసే ఏజెంట్లలో కొందరు స్థానికంగా పనిచేస్తే.. మరికొందరు రాష్ట్రం బయటో… లేదంటే, విదేశాల నుండో కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. చాలా మంది బాధితులను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నియమించుకుంటారు. తర్వాత, వీళ్లను థాయ్‌లాండ్-మయన్మార్‌లకు పంపించి, అక్కడ ఈ మోసపూరిత ఉద్యోగాల ఆఫర్లను ఇస్తారు. ఇక్కడకు వచ్చిన వాళ్లు ఏయే దేశాల నుండి వచ్చారో… వాళ్లు అమెరికాలో ఉన్న వాళ్ల దేశాలకు చెందిన వారిని ట్రాప్ చేయాల్సి ఉంటుంది. ముందుగా చెప్పుకున్నట్లు డౌట్ వస్తే… వీడియో కాల్‌లో మాట్లాడటానికి అక్కడ అమ్మాయిలు కూడా రెడీగా ఉంటారు. ఇక, ఈ సైబర్ క్రైమ్ కాంపౌండ్స్‌కు చేరుకున్న తర్వాత, బాధితులను ప్రతిరోజూ 14 నుండి 15 గంటలు పని చేయమని బలవంతం చేస్తారు. ఎవరైన మాట వినకపోతే చిత్రహింసలకు గురిచేస్తారు.
మొత్తానికి, మధుకర్ తన బంధువులను సంప్రదించిన తర్వాత… భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మయన్మార్ సైన్యం మయన్మార్ డెన్‌లోని ముఠాను పట్టుకుంది. స్కామర్ల కేంద్రంపై దాడి చేసి, బాధితులను కొందర్ని విడిపించింది. ఇందులో, ఇటీవల 260 మందికి పైగా భారతీయులను రక్షించారు. తర్వాత, వారిని రాయబార కార్యాలయంలోని భారత అధికారులకు అప్పగించారు. అయితే, మధుకర్ చెబుతున్న వివరాల ప్రకారం… మయన్మార్ పోలీసులు కూడా స్కామర్లకు అమ్ముడు పోయారనే విషయం తెలుస్తుంది. అందుకే, అక్కడ స్థానిక పోలీసులు కూడా ఈ అక్రమ, చట్టవిరుద్ధమైన వ్యవహారాల్ని చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నేరుగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగితే తప్ప బాధితులకు స్వేచ్ఛ లభించలేదు. దీని అర్థం ఏంటంటే… ఇంకా మయన్మార్‌లో ఇలాంటి బాధితులు చాలా మందే ఉన్నారు. ఇప్పటికి, బహుశా సగం మందిని మాత్రమే ప్రభుత్వం విడిపిచగలిగింది. ఇంకా, ఎంతో మంది యువత మయన్మార్ మాయాడెన్‌లో బంధీలుగా ఉండి, నేరాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇక, ఈ దారుణమైన నేరాలకు సంబంధించి కొనసాగుతున్న దర్యాప్తులో సిబిఐ కూడా పాల్గొంటుంది. మయన్మార్‌లోని మైవాడీలో సైబర్ స్కామ్ కాంపౌండ్స్‌లో చిక్కుకున్న 549 మంది భారతీయ పౌరులను రక్షించి స్వదేశానికి రప్పించడంలో భారత ప్రభుత్వం విజయం సాధించింది. వీరిని మార్చి 10-11 తేదీల్లో మొదటి బ్యాచ్‌లో 283 మంది, రెండవ బ్యాచ్‌లో 257 మందితో… రెండు బ్యాచ్‌లుగా ఢిల్లీకి తిరిగి తీసుకొచ్చారు. అయితే, యాప్‌ల ఆధారంగా జరుగుతున్న ఈ సైబర్ నేరాల్లో చాలా వరకూ చైనీయులే సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. నేపాల్, చైనా, ఇండోనేషియా, దుబాయ్ తదితర దేశాల్లో కూర్చొని, ఇక్కడ ఏజెంట్లు ఏర్పాటు చేసుకొని, వీళ్లు ఈ దందా నిర్వహిస్తున్నారు. అయితే, క్రిప్టో వాలెట్స్‌లో రెండు రకాలు ఉంటాయి. ఈ వాలెట్స్‌లో బినాన్స్, కాయిన్ బేస్ వంటి కస్టోడియన్ వాలెట్స్‌తో పాటు సేఫ్ పాల్, ట్రస్ట్ వంటి నాన్-కస్టోడియన్ వాలెట్స్ కూడా ఉంటాయి. అయితే, వీటిలో కేంద్ర ఆర్థిక శాఖ ఆధీనంతోలని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనుమతి తీసుకొని నడిచేవి కస్టోడియన్ వాలెట్స్. వీటిని ఆపరేట్ చేయడానికి వినియోగదారుడికి కేవైసీతో, వర్చువల్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఇలా చేస్తే పట్టుబడతారు గనుక నేరగాళ్లు ఎక్కువగా నాన్-కస్టోడియన్ వాలెట్స్‌ని వాడతారు. అందుకే, ఇలాంటి వ్యవహారాల్లో అప్రమత్తత చాలా అవసరం అంటున్నారు పోలీసులు.
Also Read: బంగారం రికార్డు బద్దలు.. తొలిసారి తులం పసిడి రూ.90 వేలు, ఎప్పుడు తగ్గనుందో తెలుసా?
ఇక, విదేశాల్లో ఉద్యోగాలను అంగీకరించేటప్పుడు… ముఖ్యంగా కనీస అర్హతలుంటే చాలు అధిక జీతాలు ఇస్తామని హామీ ఇచ్చే ఉద్యోగాలకు వెళ్తున్నప్పడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. ఏదైనా ఉద్యోగానికి వెళితే… విదేశీ యజమాని నుండి వ్రాతపూర్వక ఒప్పందం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, అస్పష్టమైన, అసాధారణంగా ఉన్న ఉద్యోగ వివరాలను పరిశీలించాలి. ఇక, విదేశీ ఉద్యోగాల ఆఫర్లు వస్తే… emigrate.gov.inలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ వంటి ఛానెల్‌ల నుండి సదరు ఆఫర్‌లను ధృవీకరించుకోవాలి. ఒకవేళ ఏదైనా, మోసపూరిత విదేశీ ఉద్యోగ స్కామ్‌లను గుర్తిస్తే… బాధితులు 1930కి కాల్ చేయడం ద్వారా… లేదంటే, www.cybercrime.gov.inలో కంప్లైంట్ చేయాలి. అప్పుడు, మయన్మార్ మాయాడెన్ లాంటివి మూతపడటానికి అవకాశం ఉంటుంది.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాల తీరు కూడా మారుతూనే ఉంటుంది. అందుకే, టెక్నాలజీని వాడే వాళ్లు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అవకాశాలను ఆచి తూచి ఎంపిక చేసుకోవాలి. అప్పుడే, భవిష్యత్ బాగుంటుంది.