భారతీయ రైల్వేలోకి ఎప్పటికప్పుడు సరికొత్త వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8న నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ రైళ్లతో దేశ వ్యాప్తంగా మొత్తం వందేభారత్ రైళ్ల సంఖ్య 164కు పెరిగింది. ఈ రైళ్లు బనారస్–ఖజురహో, లక్నో–సహరాన్ పూర్, ఫిరోజ్‌పూర్–ఢిల్లీ, ఎర్నాకుళం–బెంగళూరు మార్గాల్లో నడవనున్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) తయారు చేసిన ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు భారతీయ ఆధునిక రైలు సేవల నెట్ వర్క్ ను మరింత విస్తరించనున్నాయి. ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేయనున్నాయి.
బనారస్–ఖజురహో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెండు నగరాల మధ్య ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తుంది. ప్రస్తుత రైళ్లతో పోలిస్తే ప్రయాణ సమయాన్ని దాదాపు 2 గంటల 40 నిమిషాలు తగ్గిస్తుంది. ఈ రూట్ వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, ఖజురహోతో సహా దేశంలోని అత్యంత ప్రసిద్ధ మత పరమైన, సాంస్కృతిక గమ్యస్థానాలను కలుపుతుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఖజురహోకు యాత్రికులు, సందర్శకులకు మరింత వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది. సాంస్కృతిక పర్యాటకాన్ని బలోపేతం చేస్తుంది. ఈ రైలు మొత్తం 443 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. వింధ్యాచల్, ప్రయాగ్ రాజ్, చిత్రకూట్ ధామ్, బందా, మహోబా స్టేషన్లలో ఆపుతుంది. గురువారం తప్ప ఆరు రోజులు నడుస్తుంది.
లక్నో-సహారన్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సుమారు 7 గంటల 45 నిమిషాలలో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ప్రస్తుత సమయంతో పోల్చితే గంట సమయం ఆదా అవుతుంది. ఈ సర్వీసు లక్నో, సీతాపూర్, షాజహాన్ పూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నోర్, సహారన్‌పూర్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మార్గం రూర్కీ ద్వారా హరిద్వార్ కు వెళ్లే అవకాశం కల్పిస్తుంది. సోమవారం తప్ప వారానికి ఆరు రోజులు నడుస్తుంది.
ఫిరోజ్ పూర్ – ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 6 గంటల 40 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది, ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలుగా గుర్తింపు తెచ్చుకోనుంది. ఇది ఢిల్లీ, ఫిరోజ్ పూర్, బటిండా, పాటియాలా లాంటి ముఖ్యమైన పంజాబ్ నగరాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఈ రైలు కూడా వారానికి ఆరు రోజులు నడుస్తుంది.
ఎర్నాకులం-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయాన్ని రెండు గంటలకు పైగా తగ్గిస్తుంది. తన ప్రయాణాన్ని 8 గంటల 40 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఈ మార్గం కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని కీలక వాణిజ్య, ఐటీ కేంద్రాలను కలుపుతుంది. ఈ సేవ వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపికను అందిస్తుంది. నిపుణులు, విద్యార్థులు, పర్యాటకులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది మూడు దక్షిణాది రాష్ట్రాలను ప్రాంతీయ వృద్ధి సపోర్ట్ చేస్తుంది. ఈ రైలు కృష్ణరాజపురం, జోలార్ పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్ లో ఆగుతుంది. బుధవారం తప్ప వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ఇందులోని ఏ రైలు కూడా తెలుగు రాష్ట్రాలను కలుపుతూ వెళ్లడం లేదు.
Read Also: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 60 ప్రత్యేక రైళ్లు!