CM Revanth Reddy: బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరూ బ్యాడ్ బ్రదర్స్ అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో.. సీఎం ఆ నియోజకవర్గ ఓటర్లను ఉద్దేశించి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి బాటలో నడిపిస్తోందని. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి తమ నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అప్పులు, అవినీతులపై సీఎం తీవ్రంగా ధ్వజమెత్తారు.
నగర అభివృద్ధికి మూల కారణం కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఐఎస్‌బీ (ISB) వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, ఐటీ కారిడార్, ఫార్మా, మెట్రో రైలు, మెట్రో జలాలు, అమెరికన్ కౌన్సలేట్ వంటివన్నీ కాంగ్రెస్ హయాంలోనే నగరానికి వచ్చాయని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌ను ‘గ్రోత్ ఇంజన్’గా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని.. ఈ ఘనత తమదేనని ఆయన నొక్కి చెప్పారు. దీనికి భిన్నంగా.. కేసీఆర్, మోదీ ప్రభుత్వాలు ఐటీ కారిడార్‌ను రద్దు చేసి లక్షలాది ఉద్యోగాలను పోగొట్టేలా చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌కు అప్పగించినప్పుడు ఉన్న ఆర్థిక స్థితిగతులను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ‘తెలంగాణను అప్పగించినప్పుడు రూ.69 వేల కోట్ల అప్పు మాత్రమే ఉంది. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండేది. కానీ, పదేళ్ల పాలన తర్వాత.. వారు మాకు రూ.8.11 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పగించారని అన్నారు. ఈ భారీ అప్పులకు కారణం కేసీఆర్ విలాసవంతమైన పాలనే అని విమర్శించారు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపైనా సీఎం విమర్శలు గుప్పించారు. రూ.లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని పేర్కొన్నారు. అలాగే, కొత్త సచివాలయం నిర్మాణంపై సీఎం మండిపడ్డారు. కేసీఆర్ కేవలం తన కొడుకు భవిష్యత్తు.. వాస్తు కోసమే రూ. 2 వేల కోట్లతో కొత్త సచివాలయం నిర్మించారని ఆరోపించారు. సచివాలయంలోని పాత దేవాలయాన్ని కూల్చేస్తే.. కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం టెలిఫోన్ ట్యాపింగ్, ప్రతిపక్షాలపై నిఘా కోసమేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీపై కూడా రూ.10 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌లను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వారిద్దరూ ‘బ్యాడ్ బ్రదర్స్’ అని వ్యాఖ్యానించారు. ఇద్దరూ కలిసి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పదేళ్ల బీజేపీ కేంద్రంలో ఉన్నప్పటికీ, హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే వచ్చాయని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్రాన్ని ఎలా తీర్చిదిద్దాలో అనే దానిపై ఒక విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గ్రోత్ ఇంజన్ అనేది కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్ ఓటర్లు తమ ఓటును ఆలోచించి.. రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ALSO READ: Jubilee Hills: మాగంటి డెత్ మిస్టరీ.. జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ చీప్ పాలిటిక్స్.. మరీ ఇంత దిగజారాలా..?