Dharmasthala Secret: ధర్మస్థల. ఇదొక కర్ణాటక తిరుమల. కొండల్లో వెలసిన ఈ మంజునాథ స్వామి ఆలయానికి విశేషమైన చరిత్ర. అలాంటి చారిత్రక ఆధ్యాత్మిక కేంద్రంలో వరుస హత్యలు. అందునా మహిళలు, యువతులు, మైనర్ బాలికలున్నారా? ఒక సఫాయి కార్మికుడు చెబుతున్న సాక్ష్యం ద్వారా అసలేం జరుగుతోంది? ఈ మొత్తం ఉదంతం ద్వారా వెలుగులోకి వస్తోన్న కఠిన వాస్తవాలేంటి? వినే కొద్దీ ఒడలు గగుర్పొడిచే ఈ చేదు నిజాలు ఎలాంటివి?
మంజునాథుడి భక్తులు ఉలిక్కిపడేలా చేస్తోన్న కేసు
ఇదిగో ముసుగు ధరించి చేతిలో బ్యాగు పెట్టుకుని పోలీసుల మధ్య వెళ్తున్న ఇతడ్ని గమనించారా? ప్రస్తుతానికి ఇతడి పేరైతే.. అప్రస్తుతం కానీ, ఇతడెవరూ? ఏంటన్నది మాత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మంజునాథుడి భక్తులు ఉలిక్కి పడేలా చేస్తోంది. జూలై 3న ఈ మాజీ ధర్మస్థల ఆలయ పారిశుధ్య కార్మికుడు వచ్చి.. ఒక ఫిర్యాదునిచ్చారు. దీని సారాంశం ఏంటంటే.. 1995- 2014 మధ్య కాలంలో.. తాను తన చేతుల మీదుగా కొన్ని వందలాది శవాలను నేత్రావతీ పరిసర ప్రాంతాల్లో ఖననం చేశానని అంటాడు. ఈ పక్కనే ఉన్న అడవుల్లో కొన్ని మృతదేహాలను దహనం కూడా చేశాననీ చెప్పుకొచ్చాడు. మరి కొన్ని మృతదేహాలను తాను నదిలో పాడేశానని అనడం విన్న పోలీసులకు మొదట అర్ధం కాలేదు. ఎవరితడు? ఎందుకిలా అనవసర ప్రేలాపనలు పేలుతున్నాడు? ఇతడికసలు మతి ఉండే ఇలా మాట్లాడుతున్నాడా? పిచ్చిగానీ పట్టిందా? అన్న కోణంలో చూశారు పోలీసులు. ఇలాక్కాదని చెప్పి అతడు తాను స్వయంగా తన చేతులతో పూడ్చి పెట్టిన మృతదేహం తాలూకూ ఆధారాలను చూపించాడు. దీంతో దిమ్మ తిరిగిన పోలీసులు జూలై 4న కేసు నమోదు చేశారు. అంతే కాదు ఇతడు బెళ్తంగడి న్యాయస్థానంలో కూడా వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త రాష్ట్ర వ్యాప్త సంచలనంగా మారింది.
సీఎంని కలిసిన సుప్రీం రిటైర్డ్ జడ్జ్
ఇతడిచ్చిన వాంగ్మూలంతో ఒక యూట్యూబర్ వీడియో రూపొందించడంతో.. అది అర మిలియన్ వ్యూస్ పోయింది. దీనిపైనా కేసు బుక్ అయ్యింది. ఆ సరికే అది జనబాహుళ్యంలోకి విస్తృతంగా వెళ్లడంతో.. ఈ కేసు, దాని వివరాలు తీవ్ర ప్రకంపనలు నమోదు చేయడం మొదలైంది. అదెలాగంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గోపాల గౌడ సీఎం సిద్ధరామయ్యను కలసి.. ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని కోరారు. ఇందులో మహిళలు, యువతులు, మైనర్ బాలికలు సైతం ఉండటం గుర్తించిన కర్ణాటక మహిళా కమిషన్ సైతం ప్రభుత్వాన్ని దర్యాప్తు పై ఒత్తిడి చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన కన్నడ మంత్రి గుండూరావు.. ఈ కేసులో తాము ఎవర్నీ రక్షించేయత్నం చేయడం లేదని. కాకుంటే సంచలనం చేయకూడదని భావించామని అన్నారాయన. అంతే కాదు.. ఈ కేసు విషయంలో ఎవరున్నా సరే వదిలే ప్రసక్తే లేదంటారు మంత్రి గుండూరావు. ఈ కేసులో ఉన్న ఆధారాలతో దర్యాప్తు లోతుగా చేసే అవకాశముందని అంటారు జస్టిస్ గోపాల గౌడ వంటి వారు.
ఆలయ ధర్మకర్తలు జైన్లు, శివుడికి వైష్ణవ పూజలు జరిగే ధర్మస్తల
ఈ మాజీ సఫాయి కార్మికుడు చెప్పినదంతా ఎలా నమ్మాలి? కొన్నేళ్ల తరబడి ఎంతో నిష్టాగరిష్టతలతో తులతూగుతున్న ఆలయ ప్రాంతానికి ఇంతటి అప్రదిష్ట మూటగట్టడమా? దానికి తోడు ఈ ఆలయ ప్రాంతం పేరే దర్మస్థల. ఇక్కడ ధర్మ దేవత ధర్మాన్ని నాలుగు పాదాలా నడిపిస్తుందని అంటారు. ఈ ఆలయ ధర్మకర్తలు జైన్లు కాగా, ఆలయంలోని శివుడికి పూజలు చేసేవారు వైష్ణవులు. ఇదొక ఆధ్యాత్మిక త్రివేణీ సంగమం. ఆంధ్రకు వెంకటేశ్వరస్వామి వారు ఎలాగో కర్ణాటకలో మంజునాథ స్వామి వారు అలాగ. ఇక్కడ వంశపారంపర్య ధర్మకర్తగా ఎంపీ వీరేంద్ర హెగ్డే ఉన్నారు. ఈయన ఇక్కడ దాదాపు ఒక సమాంతర న్యాయ వ్యవస్థను నడుపుతారు. ఈ ఆలయం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్య, వైద్య సేవలు విశేషంగా అందుతాయి. కుటుంబ- వ్యాపార- ఇతర సమస్యలేవైనా వస్తే ఈ ప్రాంతానికే తలపెద్దగా భావించే హెగ్డే దగ్గరకొచ్చి తమ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఎన్నో జంటలకు ఎంపీ వీరేంద్ర హెగ్డే ఇచ్చే తాళిబొట్టుతో పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఇక్కడ ధర్మం నాలుగు పాదాలా నడుస్తుందనడానికి ఎన్నెన్నో ఉదాహరణలు. అలాంటి ధర్మస్థల లో వందలాది హత్యలు జరిగాయని తెలియడంతో ప్రపంచమంతా షాకైంది.
కంప్లయింట్ చేసిన తల్లిని బెదిరించి పంపిన పోలీసులు
ఇంతకీ ఇతడు చెప్పేదేంటని చూస్తే తన చేజేతులా.. ఎన్నో శవాలకు ఖననం, దహనం నిర్వహించానని అంటాడాయన. అంతే కాదు తనకు ఇష్టం లేకపోయినా ఎందరో మహిళలు, యువతులు, మైనర్లు మృతదేహాలను ఖననం చేశానని చెప్పుకొచ్చారు. 2010లో తానిలాగే ఒక స్కూల్ డ్రెస్ వేసుకున్న మైనర్ బాలిక మృతదేహాన్ని ఖననం చేశానని అంటాడీ మాజీ పారిశుధ్య కార్మికుడు. అంతే కాదు 2003లో అనన్య భట్ అనే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ తన స్నేహితులతో కలసి ధర్మస్తలకు వచ్చి.. ఆపై కనిపించకుండా పోయింది. ఆ సమయంలో మృతురాలి తల్లి ఫిర్యాదు చేయగా పోలీసులు ఆమెను బెదిరించి పంపారని అంటారు. ఇక 2012లో సౌజన్య అనే మరో యువతి హత్యాచారం కేసు పై కూడా కొంత కాలంగా వివాదం చెలరేగుతోంది.
తనకు ప్రాణ హాని ఉందంటోన్న మాజీ పారిశుధ్య కార్మికుడు
ఇంతకీ ఈ సఫాయి కార్మికుడు ఇక్కడి నుంచి ఎందుకెళ్లాడు? ఆ వివరాలేంటని చూస్తే.. 2014లో తన కుటుంబానికి చెందిన మైనర్ బాలికను సైతం ఇలాగే లైంగికంగా వేధించారు. దీంతో తనకు విరక్తి వచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోయానని అంటాడాయన. తనలోని పాపభీతి ఇన్నాళ్లకు నిజం బయటకొచ్చేలా చేసిందని.. తాను గత కొంత కాలంగా అపరాధభావంతో కుమిలిపోతున్నట్టు చెప్పుకొచ్చారీ మాజీ పారిశుధ్య కార్మికుడు. తానీ పని చేస్తున్నప్పటి నుంచి తప్పుగానే భావించాననీ.. అయితే బలవంతానా తన చేత ఈ దుర్మార్గపు పని చేయించారనీ.. లేదంటే చంపేస్తామంటూ బెదిరించేవారని చెబుతాడీ మాజీ సఫాయి కార్మికుడు. తనకు ప్రాణహాని ఉందని కూడా చెబుతాడితను.
మంజునాథ అన్న పేరెత్తగానే టక్కున గుర్తొచ్చేది ధర్మస్థల, ధర్మస్థల అన్న పేరెత్తగానే వెంటనే గుర్తుకొచ్చేది ధర్మాధికారి హెగ్డే, ఆయన కుటుంబం. ఈ ప్రాంతంలో వారి ప్రభావం అంత కీలకంగా ఉంటుంది. ఇక్కడ చీమ చిటుక్కుమన్నా వారికి తెలీకుండా జరగదు. ఇంత భారీ ఎత్తున ఇక్కడొక హత్యాకాండ జిరిగిన విషయం వారికి అస్సలు తెలీదనుకోవాలా? అదే జరిగితే.. అంత నిర్లక్ష్యపు పర్యవేక్షణ సాగుతోందా? తమ ఆధీనంలోని ఆలయం, ఆ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ హత్యా పరంపరపై వారి రియాక్షనేంటి? ఆ వివరాలు ఎలాంటివి?
ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేకి రాజ్యసభ సభ్యత్వం
సుప్రీం కోర్టును ఆశ్రయించిన కొన్ని మీడియా సంస్థలుప్రస్తుతం ధర్మస్థల వివాదం చినికి చినికి గాలి వానగా మారింది. అంతే కాదు చిలువలు పలువలుగా మారి ఈ స్టోరీ ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ని చూసినా కనిపిస్తోంది. దీంతో ఇది తీవ్ర ఆందోళన కరంగా మారింది. కారణమేంటంటే ఒక్క ధర్మస్థల అంటే కేవలం అది మంజునాథ స్వామి వారి ఆలయం మాత్రమే కాదు. ఈ ఆలయ కేంద్రంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఎన్నో విద్య వైద్య వ్యవసాయ సేవలు సైతం అందుతుంటాయి. ఇక్కడి చరిత్ర అలాంటిది. ఇక్కడి వంశపారంపర్య పాలనా పరంపర అలాంటిది. అందుకే ఈ ఆలయ ధర్మకర్త వీరేంద్ర హెగ్డేకి రాజ్యసభ్యత్వం ఇచ్చి గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. ఆయన ఇది వరకే పద్మ పురస్కారాలతో పాటు ఇంకా ఎన్నో విశేష పురస్కారాలు అందుకున్నారు. ధర్మస్తల అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతటి అశేష సామాజిక ప్రాధాన్యత ఉంది.
కార్యమేదైనా హెగ్గే అనుమతి తీస్కునే స్థానికులు
వీరేంద్ర హెగ్డే వీరికొక ధర్మాధికారి మాత్రమే కాదు. అంతకన్నా మించి. ఆయనకు పరోపకారి అన్నదొక బిరుదు. ఈ ప్రాంత కీర్తి ప్రతిష్టల పతాక.. హెగ్డే కుటుంబం. ఈ ఆలయ చరిత్రతో ఈ జైన కుటుంబ చరిత్ర అంతగా మమేమకమై కనిపిస్తుంది. వీరేంద్ర హెగ్డే కుటుంబం తరతరాలుగా ఇక్కడి స్థానికుల నుంచి నీరాజనాలు అందుకుంటోంది. ఈ ప్రాంత వాసుల ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా ఆ మంజునాథుడే తమకు ఆనతిచ్చినట్టుగా హెగ్డే దగ్గరకు వచ్చి అనుమతి తీసుకుని వెళ్తారు. అంతగా ఇక్కడి ఆచార వ్యవహారాలు నడుస్తాయి. వారికేదైనా వివాదం వచ్చినా తీర్చుకోడానికి ఇక్కడికే వస్తుంటారు. గతంలో గ్రామ పెద్దలు, ఊరి పెద్దల పంచాయితీలు- తీర్పులు ఎలా సాగేవో.. ఇప్పటికీ ఇక్కడ అలాగే కొనసాగుతుంటాయి. ధర్మస్థల ఆలయం తద్వారా వచ్చే ఆదాయం, దాని ద్వారా నడిచే అనుబంధ సంస్థలదొక చరిత్ర. ఎన్నో జీవితాలు ఈ వ్యవస్థపై ఆధారపడి ఉంటాయి. దీంతో ఈ కేసు దాని ద్వారా జరుగుతున్న ప్రచారం చూసి ఉలిక్కి పడింది హెగ్డే కుటుంబం. ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే సోదరుడు హర్షేంద్ర హెగ్డే ఒక పిటీషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయ స్థానం కొన్ని ఆదేశాలను జారీ చేసింది.
ధర్మస్థల ఉందంతానికి సంబంధించి 8,842 పోస్టులు
వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ధర్మస్తల ఉదంతానికి సంబంధించిన 8, 842 లింకులను తొలగించాలని కోర్టు ఆదేశించింది. గతంలో తమ దగ్గర పని చేసినపారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలకు సంబంధించిన ఫుటేజీ పూర్తిగా తొలగించాలని, వీటిని డీ- ఇండెక్స్ చేయాలని కోరారు హర్షేంద్ర. అంతే కాదు.. తన పిటిషన్లో ఆయన ఎక్స్, ఫేస్ బుక్, థ్రెడ్ వంటి ప్లాట్ ఫామ్స్ పై పోస్టుల గురించి కూడా ప్రస్తావించారు. ఈ వివాదంపై పలు యూట్యూబ్ చానెళ్లు, సోషల్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాలో ప్రచురించడం, ప్రసారం చేయడం, ఫార్వర్డ్ చేయడం అప్ లోడ్ చేయడాన్ని నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బెంగళూరులోని పదో అదనపు సిటీ సివిల్ సెషన్స్ కోర్టులో హర్షేంద్ర దాఖలు చేసిన పిటిషన్లో గ్యాగ్ ఆర్డర్ తో పాటు జాన్ డో ఆర్డర్ సైతం పొందారు. హర్షేంద్ర తన పిటిషన్లో 338 సంస్థలు, వ్యక్తులను ప్రతివాదులు గా చేర్చారు. 4, 410 యూట్యూబ్ వీడియోలు, 932 ఫేస్ బుక్ పోస్టులు, 3, 584 ఇన్ స్టా పోస్టులు, 108 న్యూస్ లింకులు, 37 రెడ్డిట్ పోస్టులతో పాటు 41 ఎక్స్ పోస్టులతో కలిసి 8, 842 పోస్టులను తన పిటిషన్లో పొందుపరిచారాయన. మరీ ముఖ్యంగా ఈ ఉదంతంపై తీవ్రంగా ఫోకస్ చేసిన ప్రముఖ మీడియా సంస్థలనూ ప్రతివాదులుగా చేర్చారు.
సుప్రీం కోర్టును ఆశ్రయించిన కొన్ని మీడియా సంస్థలు
అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయమేంటంటే గ్యాగ్ ఆర్డర్ లో ప్రస్తావించిన వారిని మాత్రమే నియంత్రించే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు హర్షేంద్ర కుమార్ జాన్ డో ఆర్డర్ ఇవ్వాల్సిందిగా.. జడ్జికి విన్నవించుకున్నారు. దీంతో ఊరు పేరు లేని సంస్థలు వ్యక్తులు, పార్టీలకు సైతం ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన న్యాయమూర్తి.. ప్రతి పౌరుడికి ప్రతిష్ట అత్యంత కీలకమైనది. కొన్ని ప్రజలతో సంబంధమున్న సంస్థలు కావచ్చు, ఇలాంటి ప్రతిష్టాత్మక దేవాలయాలు కావచ్చు.. వాటిపై వచ్చే ఏ వార్త అయినా.. జనబాహుళ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి పరువు నష్టం కలిగించకుండా.. ప్రచురణ, ప్రసార సంస్థలు సంయమనం వహించాలని సూచించారాయన. ఈ ఉత్తర్వు తమ భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తోందంటూ కొన్ని ప్రతివాద మీడియా సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం. ఇలా ఈ మొత్తం ఎపిసోడ్ తో ధర్మస్థల దద్దరిల్లుతోంది. ఇటు మీడియా అటు కోర్టుల మధ్య చిక్కిన నిజం. వెలుగు చూడాలా వద్దా? అన్న సంశయంలో పడి కొట్టుమిట్టాడుతున్న దృశ్యం కనిపిస్తోందని అంటారు కొందరు సామాజికవేత్తలు.
Also Read: స్థానిక ఎన్నికల భయంలో బీఆర్ఎస్.. ఎందుకంటే?
ధర్మస్థల మిస్టరీ మరణాల వివాదం అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వైరల్. కారణమేంటంటే ధర్మస్తల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే ఒక రాజ్యసభ ఎంపీ. ఇంతటి ప్రశాంత వాతావరణంలోని ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇలాంటి మారణకాండ జరగటమేంటి? ఇంతకాలం ఇదెలా గుట్టుగా ఉంది? ఎవరికీ అనుమానం రాలేదు ఎందుకని? నదిలోనూ కొన్ని మృతదేహాలు పడేశానని ఆ పారిశుధ్య కార్మికుడు చెబుతుంటే.. మరి అప్పుడే ఆ మృతదేహాలు ఎక్కడో ఒక చోట తేలి.. కనిపించేవి కదా? ఒకటి రెండు తప్ప .. మరే కేసు కూడా ఇప్పటి వరకూ ఎందుకు వెలుగులోకి రాలేదన్నది షాకింగా ఉంది. ఇటు ప్రభుత్వమే కాదు అటు, హెగ్డే కుటుంబం కూడా దీన్నించి ఎలా బయట పడాలో అర్ధంకాక సతమతమవుతోంది. మరి చూడాలి.. ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో తేలాల్సి ఉంది.
Story By Adinarayana, Bigtv