DK Shivakumar: కర్ణాటక సీఎంపై ఆశలు పెట్టుకున్న పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు నిరాశే ఎదురైంది. కర్నాటక ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని ముందుకు నడిపించిన ఆయన.. సీఎం పదవిని మాత్రం దక్కించుకోలేకపోయారు. కర్ణాటకలో రాజకీయ అవసరాల దృష్ట్యా ప్రస్తుతానికి సిద్ధరామయ్యనే సీఎంగా నియమించాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన శివకుమార్ కు పార్టీ నిర్ణయాన్ని అంగీకరించక తప్పలేదు. డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోక తప్పలేదు.
నాలుగేళ్ల క్రితం బీజేపీ కర్ణాటక సీఎం పదవిని దక్కించుకున్నప్పటి నుంచి డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో పెద్ద దిక్కుగా నిలిచారు. తనకున్న అంగ, అర్ధ బలగాలతో పార్టీని ముందుకు నడిపించారు. అధికార బీజేపీ ఆయనను అర్ధికంగా, రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు పెట్టింది. సీబీఐ, ఈడీ, ఐటీలను ప్రయోగించింది. అక్రమ కేసులతో ఆర్థిక మూలాలను దెబ్బతీయడంతో పాటు జైలులో కూడా నిర్భంధించింది.
బీజేపీ వేధింపులను ఓ వైపు ఎదుర్కొంటూనే డీకే శివకుమార్.. కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారు. రాత్రి, పగలు తేడా లేకుండా రాష్ట్రంలో ఎక్కడ కాంగ్రెస్ కార్యకర్తకు అన్యాయం జరిగినా అక్కడ ప్రత్యక్షమయ్యారు. అంతకు ముందు జేడీఎస్ – కాంగ్రెస్ సంకీర్ణ సర్కారును కూలగొట్టే క్రమంలో 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన మరుక్షణం నుంచే కార్యకర్తల్లో మనో బలాన్ని నింపేందుకు డీకే శివకుమార్ కృషి చేశారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను కర్ణాటకలో విజయవంతం చేయడంలో డీకే శివకుమార్ పాత్ర అత్యంత కీలకమైంది. అన్ని వర్గాల ప్రజలు, మేధావులను రాహుల్ చెంతకు చేర్చడానికి ఆయన పాటు పడ్డారు. ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి బీజేపీ వ్యూహాలను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ కాంగ్రెస్ ను ముందుకు నడిపించారు. కర్ణాటక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 135 స్థానాల్లో ఆ పార్టీ ఘనవిజయం అందుకుందంటే దానికి డీకే శివకుమార్ దూకుడు నిర్ణయాలు, ప్రత్యర్థిని చిత్తు చేసే రాజకీయ వ్యూహాలే కారణమని చెప్పక తప్పదు.
మొత్తానికి అధిష్టాన నిర్ణయం డీకే శివకుమార్ కు నిరాశనే మిగిల్చినప్పటికీ.. ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయనకు కీలక భాగస్వామ్యం దక్కుతుందని కాంగ్రెస్ అధిష్టానం భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు ఆయనకు పలు కీలక శాఖల బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఆయన అనుచరులకూ పెద్ద సంఖ్యలో పదవులు వస్తాయని చెబుతున్నారు. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరోసారి ముందుండు నడిపించాల్సిన బృహత్తర బాధ్యతను సైతం డీకేకే అప్పగించారు సోనియా గాంధీ.
డీకే శివకుమార్ ప్లస్‌లు, మైనస్‌లు:
–పార్టీకి వీర విధేయుడిగా పేరు
–డీకే శివకుమార్‌పై అనేక కేసులు
–మనీలాండరింగ్ కేసుల్లో ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం
–డీకేది అగ్రకులం కావడమూ సీఎం సీటు దక్కకపోవడానికి ఓ కారణం
–ఎమ్మెల్యేల మెజార్టీ తక్కువే.. 30 మందికి మించి లేరని టాక్..
–సిద్ధరామయ్యతో పోలిస్తే మాస్ ఇమేజ్ తక్కువ
–సిద్ధూతో పోలిస్తే వయస్సు, అనుభవమూ తక్కువే
–సిద్ధరామయ్యకు ఇవే లాస్ట్ ఎన్నికలు కావడంతో డీకేకి ఛాన్స్ మిస్