Chicago Clashes: యూఎస్ బోర్డర్ పెట్రోల్ సిబ్బంది, చికాగోలోని లిటిల్ విలేజ్ నివాసితుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆపరేషన్ మిడ్‌వే బ్లిట్జ్ సందర్భంగా సీసీరోలోని సామ్స్ క్లబ్ పార్కింగ్ స్థలంలో శనివారం ఉదయం ఈ ఘర్షణ తలెత్తింది. యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు తన కుమార్తె అరియాన్నాపై పెప్పర్ స్ప్రే చేశారని రాఫెల్ వెరాజా అనే వ్యక్తి ఆరోపించారు. తాను, తన కుమార్తెతో కారులో ఉండగా పోలీస్ సిబ్బంది తమపై దాడి చేశారని అతడు ఆరోపించాడు.
తన కుమార్తె ఆస్తమాతో బాధపడుతుందని, ఆమెపై పోలీసులు పెప్పర్ స్ప్రే చేయడంతో చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిందని అతడు తెలిపారు. ఇద్దరం కొంతకాలం ఆసుపత్రి పాలయ్యామని వెరాజా స్థానిక మీడియాతో తెలిపారు.
ఈ వివాదంపై హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పందించింది. ఈ ఘటనపై అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్‌లాఫ్లిన్ సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చారు. “సామ్స్ క్లబ్ పార్కింగ్ స్థలంలో జనాన్ని నియంత్రించేందుకు ఎలాంటి పెప్పర్ స్ప్రే ఉపయోగించలేదు. లిటిల్ విలేజ్‌లో వరుస హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుంటున్నారు. తుపాకీ కాల్పులు, దాడులకు పాల్పడుతున్నారు. వీటిని నియంత్రించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతా చర్యలు చేపట్టారు’ అని మెక్ లాఫ్లిక్ పేర్కొన్నారు.
డీహెచ్ఎస్ సరిహద్దు గస్తీ సిబ్బంది ఇమ్మిగ్రేషన్ తనిఖీ చేస్తున్నప్పుడు కొందరు తుపాకీలతో కాల్పులకు తెగబడ్డారు. అలాగే పోలీస్ సిబ్బంది వాహనాలపై రాళ్లతో దాడి చేశారు. పోలీసుల కాన్వాయ్ సామ్స్ క్లబ్ పార్కింగ్ స్థలంలోకి దూసుకెళ్లిందని, వాహనాలపై దాడికి సంబంధించిన ఫొటోలను డీహెచ్ఎస్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. అయితే వెరాజా, అతని కుటుంబం పోలీసుల ఎదురుకాల్పుల్లో ఎందుకు చిక్కుకున్నారో డీహెచ్ఎస్ వివరించలేదు.
Also Read: Philippines: ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న ఫంగ్-వాంగ్ తుపాను.. స్పాట్‌లో 20 మంది
యూఎస్ లో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అమలుపై ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో స్థానిక కోర్టులు ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల చర్యలపై పరిమితులను విధించారు. ఈ నిబంధనలు వెలువడిన కొద్ది రోజులకే ఈ సంఘటన చోటుచేసుకుంది. బోర్డర్ పెట్రోల్ సిబ్బంది దాడులపై స్థానికులు మండిపడుతున్నారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనల పేరిట ప్రజలను వేధిస్తున్నారని ఆగ్రహ జ్వాలలు వెళ్లువెత్తున్నాయి. చికాగో ఘర్షణలు డీహెచ్ఎస్ అల్లర్లుగా పేర్కొంటూ..ఇప్పటి వరకూ తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. వీరిలో ఎనిమిది మంది యూఎస్ పౌరులు ఉన్నారు.