Supreme Court: ఇటీవల దేశంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, తెలంగాణలోని చేవెళ్ల, రాజస్థాన్‌లోని జైపూర్/ఫలోది ప్రాంతాలలో జరిగిన ఈ దుర్ఘటనల్లో మొత్తం దాదాపుగా 60 మంది ప్రయాణీకులు మృత్యువాత పడ్డారు. తాజాగా ఈ ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పందించింది. రాజస్థాన్, తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదాలను సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది.
తెలంగాణ, రాజస్థాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 40మంది మృతి చెందగా, జస్టిస్ జె.కె. మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు రాజస్థాన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. రోడ్డు ప్రమాదాలపై వివరణాత్మక నివేదికలను సమర్పించాలని ఆదేశించింది.
రాజస్థాన్‌లో నవంబర్ 2, 2025న జైపూర్‌లో ఘోర విషాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ట్రక్కు డ్రైవర్ దాదాపు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలను ఢీకొడుతూ వెళ్లిన ఘటనలో 19 మంది మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.
Read Also: Viral Video: వర్షంలో కుప్పకూలిన అమెరికా అమ్మాయికి ఇండియన్ కుర్రాడు సాయం.. నెటిజన్స్ ఫిదా!
నవంబర్ 3, 2025న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో, తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సును ఎదురుగా అతివేగంగా వచ్చిన కంకర లోడుతో కూడిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ బస్సుపై బోల్తా పడి, కంకర లోడు ప్రయాణికులపై పడటంతో ఊపిరాడక, తీవ్ర గాయాలతో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, ఓ చిన్నారి కూడా ఉన్నారు.
గతనెల 24న కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదం నింపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టి, అనంతరం మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్నిప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది సజీవ దహనమయ్యారు