Poll Management: తెలంగాణలో జూబ్లీహిల్స్ బైపోల్‌పైనే అందరి ఫోకస్ ఉంది. ప్రచారం పర్వం ముగిసింది…ఇక పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీలు ఫోకస్ చేశాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ముఖ్యనేతలతో ఈ అంశంపైనే సమాలోచనలు చేస్తున్నారట. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రలోభాల పర్వానికి తెరలేచిందనే టాక్ నడుస్తోంది. బూత్‌స్థాయిలోని ఓటర్లను ఆకట్టు కోవడానికి అన్ని పార్టీలు యథాశక్తి పంపకాలు షురూ చేస్తున్నాయంట.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రస్తుతం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రచారపర్వం ముగిసి పోలింగ్ గడువు దగ్గరపడటంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తెరవెనుక రాజకీయం మొదలుపెట్టాయంట. ఎన్నికలంటే ఎదురు పార్టీ పోల్ మేనేజ్మెంట్‌లో ఎంత ఖర్చు చేస్తోందని ప్రత్యర్థులు గమనించడం. తాము దానికంటే ఎక్కువ ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం సాధారణంగా జరిగే తంతే. జూబ్లీహిల్స్‌లో ఉన్న నెక్ టు నెక్ సిచ్యుయేషన్ కారణంగా… ఈసారి పోల్ మేనేజ్‌మెంట్‌కు గట్టిగానే ఖర్చుపెడతారన్న టాక్ నడుస్తోంది.
ప్రధార పక్షాల అభ్యర్ధులతో పాటు పార్టీలు ఈ బైపోల్‌ను ప్రెస్టేజియస్‌గా తీసుకోవడంతో.. ఎవరూ ఖర్చుకు వెనకాడటం లేదన్న టాక్ నడుస్తోంది. ఎవరికి వారు ప్రత్యర్ధుల వ్యూహాలు గమనిస్తూ ఇంకొంచెం ఎక్కువ ఖర్చుచేద్దామని భావిస్తున్నారంట. బస్తీలే టార్గెట్‌గా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నట్టు సమాచారం. ఎన్నికల ప్రచారం చేసిందంతా ఒక ఎత్తయితే… ఫైనల్‌గా ఓటరు పోలింగ్ బూత్ దాకా రావడానికి చేసే ప్రయత్నాలు వేరే లెవెల్. అన్ని పార్టీలు ఇప్పుడా ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నాయట.
ప్రజలు ఏమనుకుంటున్నారు… మన పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. ఓటుకు ప్రజలు ఎంత ఆశిస్తున్నారు.. అవతలి పార్టీ ఎంత ఇద్దామనుకుంటోంది… మన పార్టీ గెలుపుపై ఏమైనా సందేహాలు ఉన్నాయా… ప్రత్యర్థి ఎత్తులను ఎప్పటికప్పుడు గమనించాలి.. బూత్‌స్థాయిలో నిఘా పెంచండి.. కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరును కలవండి.. ఇదీ ప్రస్తుతం జూబ్లీహిల్స్ బైపోల్‌పై రాజకీయ పార్టీల్లో జరుగుతున్న చర్చ. పోలింగ్‌కు ఒకరోజే సమయం ఉండడంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట. ప్రధానంగా పార్టీలు పోల్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్ పెట్టాయి. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ప్రజలను తమ వైపునకు తిప్పుకోవడానికి వ్యూహాలు పన్నుతున్నాయి.
ఓటరు నాడి పట్టడం అంత సులువు కానప్పటికీ… బూత్‌స్థాయిలో ఉన్న నాయకుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించడం…ప్రత్యర్ధులకు దీటుగా ఏం చేస్తే బెటర్ అవుతామనే విధంగా పార్టీలు వ్యూహారచన చేస్తున్నాయట. ఓటర్‌ను అకట్టుకునేందుకు నియోజకవర్గంలో తాయిలాల పర్వం నడుస్తుందట. ఓటర్‌కు డబ్బులు పంపిణీ కూడా జరుగుతుందోనే ప్రచారం జోరుగా నడుస్తుందట. ఓటుకు 2వేల నుంచి 4వేల వరకూ డబ్బులు పంపిణి జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. తమకు పక్కాగా పడే ఓట్లకు పార్టీలు ఎంతైనా ఇచ్చేందుకు వెనుకాడడం లేదట. కొంత అసంతృప్తితో ఉన్నా, ఇతర పార్టీ నాయకులతో మచ్చికగా ఉండే ఓటర్లకు తక్కువగా డబ్బులు ఇస్తున్నారట. వీరితో పాటుగా వన్‌సైడ్ ఓటర్లకు రూ.2వేలు వరకు ఇస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయా పార్టీలు బూత్‌ల వారీగా ఇప్పటికే డబ్బులను పంపించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి
11న జరిగే పోలింగ్ సరళిపైనే పార్టీ నేతలు దృష్టి సారిస్తున్నారు. ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తరలించేందుకు ఇప్పటి నుంచి ప్రణాళికలు వేసుకుంటున్నారట. బూత్‌ల వారీగా ఓటర్లకు తాయిలాలు, నజరాలను ఇవ్వడమే కాకుండా…పోలింగ్ బూత్‌లకు తీసుకువెళ్లే బాధ్యతను కూడా తీసుకుంటున్నాయట. ఓటర్లను తరలించే బాధ్యతలను కూడా కిందిస్థాయి నాయకులకు అప్పగించారనే టాక్ నడుస్తుందట. ముఖ్యంగా మహిళా ఓటర్లను బూత్‌లకు తరలించి…తిరిగి ఇంటికి చేర్చే విధంగా వ్యూహారచన చేస్తున్నాయట. ఇప్పటికే నియోజకవర్గంలోని ఆటోలు, వ్యాన్లలను ప్రధాన పార్టీలు బుక్ చేసుకున్నాయంట. అలాగే బస్తీల్లో ఉండే తటస్థ ఓటర్లను కూడా ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయట.
ఓటర్ల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ పార్టీలు మాత్రం పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరలేపే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. దాంతో…ఇప్పుడు మాటలన్నీ పోల్ మేనేజ్‌మెంట్ గురించే నడుస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓటర్‌ని పోలింగ్ కేంద్రం దాకా తీసుకువచ్చే ప్రయత్నాల్లో సీరియస్‌గా ఉన్నాయట. ఓటర్లను ప్రలోభల పెట్టే కార్యక్రమాలకు చెక్ పెట్టేందుకు అధికారులు సిద్దమయ్యారు. డివిజన్‌ల వారీగా క్షేత్రస్థాయిలో నిఘాను పటిష్టం చేయడంతో గస్తీని పెంచారు పోలీసులు. నిరంతరం నేతల అడుగులను పసిగట్టే విధంగా చర్యలు చేపడుతున్నారట.
మొత్తంగా ఓవైపు పార్టీలు పోల్ మేనేజ్‌మెంట్‌పై నిమగ్నమై ఉంటే…ప్రలోబాల పర్వాన్ని అడ్డుకునేందుకు అధికారులు సన్నద్దమయ్యారు. ఐతే పార్టీలకు వ్యూహాలకు పోల్ మేనేజ్‌మెంట్‌లో ఎవరు పైచేయి సాధిస్తారోనని ఉత్కంఠగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.
Story by Apparao, Big Tv