Vidadala Rajini: పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడదల రజిని పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండు రోజులుగా తనను, తన అనుచరులను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా అన్యాయమని, ఇది చట్ట వ్యవస్థను అవమానించే పని అని ఆమె మండిపడ్డారు. చట్టానికి, వ్యవస్థలకు తమకు సంపూర్ణ గౌరవం ఉన్నప్పటికీ, పోలీసుల ప్రవర్తన మాత్రం రౌడీలు, గూండాలను తలపిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని తనపై, తన అనుచరులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడుతున్నారు. తనపై నమోదవుతున్న కేసుల నేపథ్యాన్ని వివరించిన రజిని, శ్రీ గణేష్ చౌదరి పేరుతో జరుగుతున్న ఫిర్యాదులు పూర్తిగా రాజకీయ నాటకమని అన్నారు. గణేష్ చౌదరి గత ఎన్నికల్లో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రచారంలో పాల్గొన్నాడని, ఈ విషయాన్ని ఫిర్యాదు చేసినవాళ్లే ముందే పేర్కొన్నారని ఆమె చెప్పారు. ఈ ఏడాది మార్చిలో దర్శిలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కూడా గణేష్ టీడీపీ అనుచరుడని స్పష్టమైన పత్రాలలో ఉందని రజిని వెల్లడించారు. పదేళ్ల క్రితం తీసుకున్నట్లు చెప్పిన 35 లక్షల రూపాయల వ్యవహారాన్ని ఇప్పుడు తనపై తప్పుడు కేసులుగా మలచడానికి ప్రయత్నించడం ఎంతో విచారకరమని ఆమె అన్నారు.
మాబు సుభాని అనే వ్యక్తి పల్నాడు ఎస్పీ కార్యాలయంలో తమపై ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించిన ఆమె, అతను టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడని, అంతకుముందు చిలకలూరిపేట టౌన్ స్టేషన్‌లో గణేష్‌తో రాజీకి వచ్చిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ అంశాలను పట్టించుకోకుండా, ఒకవైపు ఫిర్యాదు పెట్టేలా, మరోవైపు కేసులు నమోదు చేసేలా పోలీసులు పనిచేస్తున్నారని రాజినిలు విమర్శించారు. పల్నాడు జిల్లాలో ఒక ఉన్నతాధికారి ఓ ప్రత్యేక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితులు వస్తున్నాయంటూ ఆమె ఆరోపించారు. తప్పుడు ఫిర్యాదులు చేస్తే వెంటనే కేసులు పెట్టడం, యూనిఫామ్ వేసుకున్న పోలీసులు మూడు పార్టీలకీ అనుకూలంగా పని చేయడం వంటి వ్యవహారాలు చట్టపరమైన విధ్వంసానికే నిదర్శనమని ఆమె అన్నారు.
తన వ్యక్తిత్వ హననానికి డీఎస్పీ నేరుగా పాల్పడ్డారని, దీనిపై పరువు నష్టం దావా వేయడమే కాక హ్యూమన్ రైట్స్ కమిషన్, మహిళా కమిషన్‌లను ఆశ్రయిస్తానని రజిని ప్రకటించారు. రాజకీయంగా ఒక మహిళ ఎదగడం కొందరికి నచ్చడం లేదని, అందుకే తమ మీద తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.. టీడీపీ వాళ్లే ఫిర్యాదు చేసి, వాళ్ల ప్రభుత్వమే కేసులు పెట్టేలా చూస్తోందని ఆమె మండిపడ్డారు. తనపై ఎస్సీ, ఎస్టీతో సహా ఏడు కేసులు నమోదు చేసినా, వాటిని ఎదుర్కొనే ధైర్యం, న్యాయం తనవైపునే ఉందని ఆమె తెలిపారు. ఈ ఘటనలపై నిష్పక్షపాత విచారణ జరగాలని ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు రజిని వెల్లడించారు.
Story by Apparao, Big Tv