Guntur Mayor vs Commissioner: అప్పుడెలాగైనా ఉండనివ్వండి. ఇప్పుడు మనమేంటి? మన పొజిషనేంటి? అని ముందు వెనక చూసుకుని. ఆపై ఏదైనా మాట తూలినా. మరేదైనా కామెంట్ చేసినా.. ఇంకేదైనా ఆర్డరేసినా చెల్లుతుంది. ఇలాంటి ఆలోచనేదీ లేక పోవడంతో.. ఆ కార్పొరేషన్ మేయర్ వర్గానికి.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతోందట. ఇంతకీ ఏంటా ఫ్రస్టేటెడ్ పొలిటికల్ స్టోరీ.. లెట్స్ వాచ్.
మనం తీసుకున్న గోతిలో మనమే పడ్డామని ఓపెన్ కామెంట్స్F2, F3 కాదు.. ఫ్రస్టేషన్ ఫ్రస్టేషన్ ఫ్రస్టేషన్ ఫ్రస్టేషన్.. అంటూ ఏకంగా F4 నడుస్తోంది.. గుంటూరు కార్పొరేషన్ వైసీపీ మేయర్ వర్గంలో. అసలు వాళ్లు పడుతున్న బాధ వర్ణనా తీతం. కార్పొరేషన్ అధికారం తమదే కానీ. ఎలాంటి అధికారాలు చెల్లుబాటు కావడం లేదే.. అనే బాధ వాళ్లను నిలవనివ్వడం లేదట. ఒక చోట కూర్చోనివ్వడం లేదన్న మాట ఒకింత ఎక్కువగానే కని\ వినీపిస్తోందట.
గుంటూరు వైసీపీకి గత ఎన్నికలు గట్టిషాకిచ్చాయనే చెప్పాలి. 2024 ఎన్నికల ముందు.. ఇక్కడ ఫ్యాను పార్టీ గీసిందే గీత- తిప్పిందే చక్రం. నగరంలో ఎవరే ప్రోగ్రాం పెట్టాలన్నీ.. అధికార గణం అడుగు దీసి అడుగు వేయాలన్నా.. YSRCP టాప్ లీడర్స్ ఎస్ ఆర్ నో అనడం మీదే ఎక్కువ ఆధారపడేవారు. అంతగా ఇటు కమీషన్లు అటు పర్మిషన్ల YCP జమానా నడిచినట్టు వాపోతారిక్కడి ప్రత్యర్ధి పార్టీ లీడర్లు.
గుంటూరులో మరో పార్టీకి ఛాన్సే లేకుండా మెజార్టీ స్థానాలు వైసీపీకే దక్కడంతో వారు ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. ఇదంతా ఎన్నికల ముందరి సీన్. అప్పట్లో ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు ఏదైనా అడిగినపుడు అవును- కాదు అన్న ముక్తసరి సమాధానాలతో సరి. అంతే తప్ప వివరణ ఉండేది కాదని టీడీపీ, జనసేన కార్పొరేటర్లు బాధ పడ్డ సందర్భాలు అనేకం.
అధికారులెవరైనా టీడీపీ, జనసేన కార్పొరేటర్ల మాట వింటే.. వారిపై వేటు తప్పేది కాదు. అంతగా ఖరాకండీ గా ఉండేవారనీ.. ఆ యా అధికారులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేవారన్నది గతకాలపు విషాదకర వాతావరణంగా వాపోతారు కార్పొరేషన్ సిబ్బంది.
ఈ సోకాల్డ్ YES ఆర్ NO. అవును కాదు ముక్తసరి సమాధానాల ట్రెండ్ సెట్ చేసిందే వారు. కానీ ప్రెజంట్ సిట్యువేషన్ చూస్తే తాము సెట్ చేసిన ట్రెండ్ తామే ఫాలో కాలేక పోతున్నారన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుత కౌన్సిల్ సమావేశంలో అధికారులు సరిగ్గా ఇలాంటి సమాధానాలను చెప్పడం వల్లే డిప్యూటీ మేయర్ డైమాండ్ బాబుకు ఆగ్రహావేశాలు తన్నుకొచ్చేశాయనీ. అది ఎంతలా అంటే తనకొచ్చిన కోపాన్ని ఆపుకోలేక.. ఏం తమాషాలు చేస్తున్నారా అంటూ.. మాట్లాడేంత. వారు గతంలో ఎలాంటి సమాధానాలు చెప్పారో తాము కూడా.. అలాగే చెప్పాం తప్ప ఇందులో మరెలాంటి తప్పుడు ఉద్దేశం లేదంటారు.. మున్సిపల్ అధికార గణం. వారి రూట్ ఫాలో అవుతున్నా వారికి కోపం రావడం విడ్డూరంగా ఉందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు.
రాజకీయ నాయకులు ఈ రోజు పదవుల్లో ఉండి రేపు ఉండొచ్చు ఉండక పోవచ్చు. అదే తాము జీవితాంతం ఇక్కడే ఉంటామనీ. అలాంటి మమ్మల్ని తమాషాగా ఉందా? వంటి అనుచిత పదాలతో విరుచుకుపడ్డం తీవ్ర అభ్యంతరకరమనీ.. అందుకే తాము క్షమాపణలు కోరామనీ అంటారు అధికారులు. ఇదే డిప్యూటీ మేయర్ తో పాటు మేయర్ కి కూడా నచ్చడం లేదట. వాళ్ల సమాధానాలు నచ్చకే తాము తమాషాగా ఉందని మాములుగా అంటే అది కూడా తప్పేనా? అంటూ తమ సభ్యులందర్నీ వెంటపెట్టుకొచ్చి కౌన్సిల్ సమావేశాలను నిర్వహించాలని.. డిమాండ్ చేశారు మేయర్ కావటి మనోహర్ నాయుడు. ఆ సమయంలో అక్కడ కమిషనర్ లేక పోవడంతో.. ఏం చేయాలో తోచక మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు.
Also Read: రాష్ట్రం మార్చేసిన పొన్నాడ.. గురువుపైనే పోటీ
తాము అధికారంలో ఉండగా కరెక్టుగా అనిపించిన ఈ ముక్తసరి సమాధాన విధాన సరళి.. పవర్ పోయాక.. సరికాదనడంలో అర్ధమేంటని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. మేం చెప్పడం కాదు.. వాళ్లే మా కమిషనర్ కి సారీ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు మున్సిపల్ అధికారులు. అయితే ఇదంతా వైసీపీ డిప్యూటీ మేయర్ వల్లే వచ్చిందనీ. ఛాన్సు దొరికితే ఏదో ఒక రకంగా అధికార గణాన్ని ఇరుకున పెట్టాలన్న ధ్యేయమే ఇందులో ఎక్కువగా ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ తమాషా కామెంట్ల వ్యవహారంలో.. అధికార పార్టీ నేతలు.. మౌనంగా ఉంటూ పరిస్థితులను సునిశితంగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఇష్యూలో ఇటు మేయర్ వర్గం అటు ఉద్యోగ వర్గం ఎవరి వైపునా నిలవక.. బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నారట. ఎవరైనా ఈ తమాషా విషయంలో మీ కామెంట్ ఏంటని అంటే అంతా కమిషనరే చూసుకుంటారని.. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారట.
ఇదిలా ఉంటే కౌన్సిల్ మీటింగ్ పెట్టేది లేదంటూ.. కమిషనర్ తెగేసి చెప్పడంతో.. ఏం చేయాలో పాలుపోని దుస్థితిలో పడ్డారట మేయర్ అండ్ కో. ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్టు.. మేయర్ గా అధికారంలో ఉండి కూడా.. అదెందుకూ పనికి రాకపోవడంతో.. మింగలేక కక్కలేక అవస్థ పడుతున్నట్టు సమాచారం. అనవసరంగా మాట తూలడం. ఆపై మీటింగ్ పెట్టాలని హుకుం జారీ చేయడం.. ఆపై కమిషనర్ నథింగ్ డూయింగ్ అంటూ తేల్చి చెప్పడంతో.. అనవసరంగా రెచ్చిపోయామా.. మనం తీసుకున్న గోతిలో మనమే పడ్డామా అని వారికి వారే కుమిలిపోవడం మాత్రమే కాదు.. కొందరు ఇదంతా మనం చేసుకున్న తప్పిదమేనని బాహటంగా అనేస్తున్నారట. దీంతో.. తెగ ఫీలై పోతున్నారట మేయర్, డిప్యూటీ మేయర్.