RK Roja: మాజీ మంత్రి రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సినిమాటిక్ పంచులతో విమర్శలపర్వం సాగించారు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా రోజా సంచలన కామెంట్స్ చేశారు. దావోస్ పర్యటన కేవలం చుట్టపు చూపుగా సాగిందని, రాష్ట్రానికి పెట్టుబడులు శూన్యమంటూ రోజా అన్నారు. అబద్ధపు హామీలను గుప్పించే అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు, దావోస్ కు వెళ్లి ఫోటోలకు ఫోజులు ఇచ్చారని విమర్శించారు. రోజా చేసిన ఈ విమర్శలపై నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఘాట్ రిప్లై ఇచ్చారని చెప్పవచ్చు.
నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రోజా ఓ పిచ్చిదంటూ.. పిచ్చివారికి పిచ్చికూతలు తప్ప మరొకటి రావని విమర్శించారు. ఏమి మాట్లాడుతున్నామో తెలియకుండానే రోజా కామెంట్స్ చేస్తున్నారని, మీడియాలో హైలెట్ కావడమే రోజా ప్రధాన ఉద్దేశం అన్నారు. ఆవుకు గంగిరెద్దుకు తేడా తెలియని వ్యక్తిగా ఇప్పటికే సమాజంలో రోజాకు గుర్తింపు ఉందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి దావోస్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు తన బృందంతో వెళితే, రోజా అవాకులు చవాకులు పేలుస్తున్నారంటూ సీరియస్ అయ్యారు.
Also Read: CM Chandrababu: దావోస్ వెళ్లాలనే బ్రాండ్ సెట్ చేశా: సీఎం చంద్రబాబు
పెళ్లిళ్లకు పేరంటాలకు ఓట్ల కోసం దావోస్ కు వెళ్లలేదని, ఏపీ అభివృద్ధికి పెట్టుబడుల సాధనకై ప్రముఖ కంపెనీలతో సీఎం చర్చించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమిష్టిగా కృషి చేస్తుందని, ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక రోజా హిస్టరీ ఇచ్చిన మాట్లాడుతున్నారన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో ఓ చిన్నారి పట్ల స్థానిక వైసీపీ నాయకుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇప్పటికే ఫోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. బాధిత కుటుంబాలకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని, అఘాయిత్యానికి పాల్పడిన వైసీపీ నాయకుడి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఎమ్మెల్యే భాను ప్రకాష్ తెలిపారు. మాజీ మంత్రి రోజాపై ఎమ్మెల్యే భాను ప్రకాష్ చేసిన కామెంట్స్ పట్ల రోజా ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.