Tamil Nadu Voter List Issue: ఒక పక్క బీహార్ ఓటర్ల సవరణ వివాదం నడుస్తుంటే.. తాజాగా తమిళనాట కూడా సరిగ్గా ఇలాంటి వివాదమే చెలరేగుతోందా? ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఏంటీ ఓటర్ల తారు మారు తకరారు? తమిళనాట వలస వచ్చిన వారిని కూడా ఓటర్లుగా చేర్చేస్తున్నారని ఎంపీ చిదంబరం అంటున్న వేళ.. ఏంటీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజ్? SIR గా పిలిచే ఇది ఎవరికి ఫర్?
తమిళనాడులో 6.5 లక్షల మంది కొత్త ఓటర్లు
బీహార్ ఓటర్ల సవరణ వివాదం మధ్య తమిళనాట మరో వివాదం రాజుకుంది. ఒకటీ రెండు కాదు ఏకంగా ఆరున్నర లక్షల మంది వలసదారులు ఓటర్లుగా చేరారని తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ చిదంబరం. ఇది రాష్ట్రాల ఎన్నికల స్వరూప స్వభావాలనే మార్చేస్తుందని, ఇది చట్ట విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారాయన. చిదంబరం వాదనకు బలం చేకూర్చేలా.. బీహార్ లో 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. సరిగ్గా ఇందుకు ప్రతిగా తమిళనాడులో ఆరున్నర లక్షల మందిని ఓటర్లుగా చేర్చాలనే వార్త వెలుగులోకి రావడంతో.. చిదంబరం తమిళనాడు సీఎంఓను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తమిళనాడు ఓటర్ల జాబితాలో చేరనున్న వారు శాస్వత వలసదారులుగా చెబుతున్నారు అధికారులు. అయితే ఇది వలస కార్మికులను అవమానించడంతో సమానమని.. సరిగ్గా అదే సమయంలో ఓటర్లను తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకునే హక్కును ప్రభావితం చేయడమేనంటారు చిదంబరం.
ఓటుండాలంటే శాశ్వత నివాసముండాలి చిదంబరం
ఈ సందర్భంగా కామెంట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ చిదంబరం, పోల్ బాడి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఒక వలస కార్మికుడు సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారాయన. ఓటరుగా నమోదు కావడానికి ఒక వ్యక్తికి స్థిరమైన శాశ్వతమైన చట్టబద్ధమైన నివాసం ఉండాలి. వలస కార్మికులకు బీహార్ వంటి రాష్ట్రాల్లో సొంత ఇల్లు అంటూ ఒకటి ఉంటుంది. అలాంటి వారిని తమిళనాడులో ఓటరుగా ఎలా నమోదు చేస్తారని నిలదీస్తున్నారు ఈ మాజీ హోంమంత్రి. ఎన్నికల సంఘం.. సాగిస్తోన్న ఈ అధికార దుర్వినియోగ కాండను రాజకీయంగా మాత్రమే కాదు చట్టబద్ధంగానూ ఎదుర్కోవల్సి ఉందన్నారు పి. చిదంబరం. అలాగని ఈ వ్యవహారం కేవలం చిదంబరం మాత్రమే కాదు.. తమిళనాడులోని అధికార డీఎంకేతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు సైతం స్వరం కలిపాయి. తమిళనాడులో ఇదొక సమస్యగా తయారైందని.. వారు ఇక్కడికి పని చేసుకోడానికి వచ్చారు. వారి ఆలోచనలు వేరు. వారి సామాజిక అవసరాలు వేరు. వారికీ మనకూ ఉన్న సైద్ధాంతిక స్వరూపస్వభావాలు వేరు- వేరు. అలాంటి వారికి ఇక్కడి నేతలను ఎన్నిక చేసుకునే అధికారం ఎక్కడిది? ఇది భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాలనే మార్చేస్తుందని ఆరోపించారు డీఎంకే కార్యదర్శి దురై మురుగన్.
చాలా మంది బీహారీలు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం
ఇక బీహార్ లో జరుగుతోన్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ లోని ప్రధాన సమస్య ఏంటంటే ఇది బీహార్ లోని సుమారు 8 కోట్ల మంది ఓటర్లలో చాలా వరకూ తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. అయితే గత ఇరవై ఏళ్లుగా ఓటర్ల జాబితాలో భారీ మార్పులు- చేర్పులు- తొలగింపుల ద్వారా నకిలీ ఓటర్లు ప్రవేశించారని అంటోంది ఎన్నికల సంఘం. అందువల్ల ఓటర్ల జాబితాను పెద్ద ఎత్తున సవరించాల్సి వస్తోందని అంటారు ఎన్నికల సంఘం అధికారులు. ఇంతకీ బీహార్ ఓటర్ల జాబితాను ఎందుకు సవరిస్తున్నారని చూస్తే.. మరణించిన వ్యక్తుల పేర్లు, ఎక్కడి నుంచో ఇక్కడికొచ్చి సెటిలైన వారు.. ఓటర్లుగా చెలామణీ అవుతున్నారు. ఇలాంటి నకిలీ ఓటర్లను తొలగించేలా.. ఇంటెన్సివ్ సవరణ కార్యక్రమాన్ని చేపట్టామని అంటోంది ఈసీ. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారు మోస పూరితంగా ఇక్కడి ఓటర్ల జాబితాలో చేరారని.. గత కొంత కాలంగా బీజేపీ ఆరోపిస్తోంది. జనాభా పరంగా బీహార్ అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటి. ఇక్కడి ఓటరు నాడి జాతీయ స్థాయిలో ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ రివిజన్ గా చెబుతున్నారు ఈసీ అధికారులు. బీహార్ లో చివరిగా ఓటరు జాబితాపరిశీలన జరిగింది 2003లో. అలాంటి వారు తమ ఐడీలను చూపించి తమ ఓటు హక్కును తిరిగి పొందవచ్చు. కానీ మిగిలిన వారు తమకున్న పౌరసత్వ రుజువును చూపించి ఓటు హక్కు పొందాల్సి ఉంటుంది. ఇందుకంటూ 11 పత్రాలను సూచించింది ఎన్నికల సంఘం.
సుప్రీంలో ఈసీని సవాల్ చేసిన RJD తదితర పార్టీలు
బేసిగ్గా బీహార్ గ్రామీణ జనాభాలో ఎక్కువ మందికి అవసరమైన డాక్యుమెంటేషన్ లేదు. వారి నివాసం, కుల ధృవీకరణ వంటి వాటిని పొందడం కష్టతరంగా తెలుస్తోంది. దీంతో బీహార్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ తో సహా పలు పార్టీలు.. సుప్రీంకోర్టులో ఈసీనీ సవాల్ చేస్తూ పిటిషన్ వేశాయి. దళిత, ముస్లిం మైనార్టీ వర్గాలను టార్గెట్ చేసుకుని.. ఈ సవరణలు చేస్తున్నారని.. తమ పిటిషన్ లో ఆరోపించాయి ఈ పార్టీలు. బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను కొనసాగించడానికైతే సుప్రీం కోర్టు అనుమతించింది. అయితే ఈ ప్రక్రియ న్యాయబద్ధతపై ఆందోళన వ్యక్తం చేసింది. డాక్యుమెంటేషన్ లో సరైన విధానం అవలంభించాలని ఈసీని సూచించింది. గత కొన్నేళ్ల ఎన్నికల చరిత్రలో ఇలాంటి రోజు వస్తుందనుకోలేదని అన్నారు.. పౌర ప్రచార సమిష్టి భారత్ జోడో అభియాన్ కన్వీనర్ యోగేంద్ర యాదవ్. ఓటరు జాబితాలో తమ పేర్లను చేర్చుకునే బాధ్యత ఓటర్లపైనే ఉంచడం, వారి పౌరసత్వాన్ని నిరూపించుకునేలా పత్రాలు సమర్పించమనడం.. ఇదే తొలిసారని అంటారాయన.
దేశ పౌరుల ఉనికి ప్రశ్నార్ధకం పౌర సంఘాలు
ఇలాగే అస్సాం పౌర జాబితా నుంచి సుమారు 20 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ఇదెలా ఉందంటే భారత దేశంలోని పౌరుల ఉనికినే ప్రశ్నిస్తోందని అన్నారు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మస్ కన్వీనర్ జగదీప్ చోకర్. ఇంటెన్సివ్ సవరణ కాదది.. ఓటర్ల కత్తిరింపు ప్రక్రియగా చెబుతారాయన. మరీ ముఖ్యంగా బీహార్ ఓటర్ల జాబితా సవరణ పూర్తి రాజ్యాంగ విరుద్ధం, ఏకపక్షమని అంటారు చోకర్. లక్షలాది మంది ఓటర్లు మరీ ముఖ్యంగా పేద అణగారిన వర్గాల వారు వచ్చే రోజుల్లో పర్మినెంట్ గా తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారీ ఎన్జీవో. దీన్ని ఇప్పుడు ఆపకుంటే అది ఎన్నికల ప్రక్రియనే పూర్తి తారు మారు చేసేస్తుందని ఆవేదనగా చెబుతున్నారు చోకర్. ఒక్కమాటలో చెప్పాలంటే ఎవరైనా పొరబాటున తాను పౌరుడ్నని నిరూపించకుంటే వారిని దేశ బహిష్కరణ చేయొచ్చు కాబట్టి ఈ ఓటర్ల సవరణ ఆట అత్యంత ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు పలువురు సామాజికవేత్తలు.
ఇదిలా ఉంటే లోక్ సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. గత లోక్ సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, లేకపోతే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేవారే కాదని సంచలన కామెంట్లు చేశారు రాహుల్ గాంధీ. గత సార్వత్రిక ఎన్నికల్లో 70 నుంచి 100 సీట్లలో రిగ్గింగ్ జరిగిందని.. వీటిలో కనీసం 15 సీట్లు తగ్గినా మోదీ ప్రధాని అయ్యేవారే కాదన్నారు రాహుల్. దేశంలో ఎన్నికల సంఘం డెడ్ అయిందని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో రిగ్గింగ్ ఎలా జరిగిందన్నది వివరించేందుకు తమ వద్ద 100 శాతం ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతామన్నారు. ఇది అణుబాంబుతో సమానమనీ.. దేశమంతా షాకై పోతుందని హెచ్చరించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
వారణాశిలో మోడీ స్వల్ప మెజార్టీతో గెలవడం డౌట్
వారణాశిలో స్వల్ప మెజారిటీతోనే మోదీ గెలవడం అనుమానాస్పదంగా ఉందన్నారు. 70 నుంచి 100 సీట్లలో బీజేపీ గెలవడం సైతం డౌట్ ఫుల్ గానే ఉందన్నారు. మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య కేవలం 4 నెలల్లోనే కోటి మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని చెప్పారు. అందులో ఎక్కువ మంది బీజేపీ వాళ్లే ఉన్నారన్నారు. రిగ్గింగ్ జరుగుతోందని 2014 నుంచే తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. రిగ్గింగ్ జరగకపోతే.. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఒక్క సీటూ రాకపోవడమేంటని ప్రశ్నించారు.
రైతులకు మద్దతు ఇవ్వొద్దని జైట్లీ బెదిరించారన్న రాహూల్
కేంద్రంలోని బీజేపీతో పోరాడిన వారు ఎవరినైనా సరే ఆ పార్టీ టార్గెట్ చేస్తుందని అన్నారు రాహుల్. ఇందులో భాగంగానే తనపై 30 కేసులు నమోదు చేశారని అన్నారాయన. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతులకు మద్దతు ఇవ్వొద్దని తనను అప్పటి బీజేపీ అగ్ర నేత అరుణ్ జైట్లీ బెదిరించారని సంచలన కామెంట్లు చేశారు రాహుల్ గాంధీ. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రోజుల్లో జరిగిన ఒక సంఘటన తనకు గుర్తున్నట్టు చెప్పుకొచ్చారు. తన్ను బెదిరించేందుకు అరుణ్ జైట్లీని పంపారనీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అగ్రి చట్టాలపై పోరాటం చేస్తే.. తనపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారనీ అన్నారు రాహుల్. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలియదనుకుంటా. ఎందుకంటే మేం కాంగ్రెస్ వాళ్లం. పిరికోళ్లం కాదు. మేం తలవంచం. బ్రిటిష్ సామ్రాజ్యానికే భయపడలేదు. మీకు భయపడతామా? అని తాను అన్నట్టు చెప్పుకొచ్చారు రాహుల్.
రాఫెల్ డాక్యుమెంట్ ఎక్కడికెళ్లిందని రాహూల్ ప్రశ్న
రాఫెల్ ఒప్పందంలో ప్రధాని కార్యాలయం, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జోక్యం చేసుకున్నారని స్పష్టంగా పేర్కొన్న డాక్యుమెంట్ పైనా స్పందించారు రాహుల్ గాంధీ. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఇలా జోక్యం చేసుకుని ఉంటే ప్రభుత్వాలు కూలిపోయేవన్నారు. కానీ, ఇండియాలో మాత్రం అలా జరగలేదన్నారు. ఆ డాక్యుమెంట్ ఎక్కడికి వెళ్లింది? ఎలా కనుమరుగైందో దేశ ప్రజలకు తెలుసన్నారు. తన చేతిలోని రాజ్యాంగం 5 వేల ఏండ్లకు పైగా దేశ చరిత్ర, సంస్కృతికి చిహ్నమని అన్నారు. ఈ రాజ్యాంగాన్ని రక్షించడం ద్వారా ప్రజల జీవన విధానాన్ని కాపాడుకుంటామని చెప్పారు. మతంపేరుతో ఇతరులపై దాడి చేస్తున్న వారిని గాంధీజీ తీవ్రంగా విమర్శించారని అన్నారు.
ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్టు ఆధారాలున్నాయ్ రాహూల్
ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తేల్చి చెప్పారు రాహుల్. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బీజేపీ ఎలా తారుమారు చేసిందో చెప్పడానికి ఆరు నెలలు తీవ్రంగా కష్టపడి ఆధారాలు, సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు. ఉదాహరణకు కర్నాటకలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో 6.5 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో 1.5 లక్షల ఫేక్ ఓట్లు ఉన్నట్టు తేలిందన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేయబోయే డేటాతో ఎన్నికల వ్యవస్థలోని తతంగం మొత్తం చూసి దేశ ప్రజలంతా షాకవడం ఖాయమని అన్నారు. ఎన్నికల్లో అక్రమాలపై తన దగ్గర వందకు 100 శాతం ఆధారాలు ఉన్నాయని, వాటిని బయటపెట్టగానే ఆటం బాంబుల్లా పేలుతాయన్నారు. వాస్తవానికి దేశ ఎన్నికల వ్యవస్థ ఇప్పటికే డెడ్ అయిందని, ఇప్పుడది ఉనికిలోనే లేదన్నారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. తాను రాజును కాదని, ఆ విధానానికే పూర్తి వ్యతిరేకమని అన్నారు రాహుల్. సదస్సులో స్పీచ్ ప్రారంభిస్తుండగా హాల్ లోని చాలా మంది ఈ దేశానికి రాజు ఎలా ఉండాలంటే.. రాహుల్ గాంధీ లెక్క ఉండాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో రాహుల్ స్పందిస్తూ.. నో బాస్. నేను రాజును కాదు. రాజు కావాలనీ అనుకోవడం లేదు. అసలు రాజు అనే కాన్సెప్ట్ కే నేను పూర్తి వ్యతిరేకం అంటూ తన స్పీచ్ ప్రారంభించారాయన.
త్యాగం, దార్శినికతతో రూపుదిద్దుకున్నదే కాంగ్రెస్
బీజేపీ పాలనలో రాజ్యాంగం బందీ అయిందని, ఆ పార్టీ అధికార బలంతో రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఫైర్ అయ్యారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసి, మత రాజ్యం తెచ్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. సోనియా గాంధీ పంపిన సందేశాన్ని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ సదస్సులో చదివి వినిపించారు. లీగల్ చార్టర్ కంటే రాజ్యాంగం గొప్పది. ఇది న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వమే మూలస్తంభాలుగా నిర్మితమైంది. త్యాగం, దార్శనికత ద్వారా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రూపుదిద్దుకున్నది. 1928లో నెహ్రూ రిపోర్ట్ నుంచి 1934లో కాన్ స్టిట్యూయెంట్ అసెంబ్లీ కోసం డిమాండ్ వరకూ మహాత్మా గాంధీ, నెహ్రూ రాజ్యాంగానికి పునాది వేశారు. ముసాయిదా కమిటీ చైర్మన్ గా డా. బీఆర్ అంబేద్కర్ ఈ ఆదర్శాలకు రూపం ఇచ్చారు. సామాజిక, ఆర్థిక న్యాయం లేకుండా.. రాజకీయ ప్రజాస్వామ్యం కేవలం ఒక అలంకరణ మాత్రమే అవుతుంది. దీన్ని గుర్తించి హక్కుల విస్తరణ, సంస్థల బలోపేతానికి పని చేశాం. కానీ నేడు రాజ్యాంగం ముట్టడిలో ఉందని సోనియా తన సందేశం ద్వారా తెలియ చేశారు. ఎన్నడూ స్వేచ్చ, సమానత్వం కోసం పోరాడని బీజేపీ, ఆర్ఎస్ఎస్.. ఇప్పుడు వాటిని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.
అవసరమైన చోట ఓట్లు చేర్చడం లేని చోట తీసేయటం
మరి కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీల నేతలు, ప్రజాస్వామిక వాదులు లేవనెత్తుతున్న ఈ ఆరోపణలకు అధికార బీజేపీ స్పందన ఏంటి? అవసరమైన చోట తమకు అనుకూలమైన ఓటర్లను చేర్చడం. అవసరం లేని చోట వారిని ఏదో ఒక పేరు చెప్పి తొలగించడం అనే ఈ ప్రక్రియకు ముగింపు ఎప్పుడు. బీహార్ నుంచి తమిళనాడు, ఆ మాటకొస్తే ఢిల్లీ నుంచి గల్లీ గల్లీ వరకూ జరుగుతోన్న ఈ ఓటర్లాటలో సమిథలెవ్వరు. శాస్వతంగా తమ పౌరసత్వాన్నే కోల్పోయేవారెవరు? వీరికి న్యాయం జరిగే మార్గమేదన్న చర్చ నడుస్తోంది.
Story By Adinarayana, Bigtv