Secret Camera In Washroom: తమిళనాడులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళల వాష్ రూమ్ లో స్పై కెమెరాలు పెట్టి రికార్డు చేసింది ఓ మహిళ. ఆ వీడియోలను తన బాయ్ ఫ్రెండ్ కు పంపింది. ఈ వీడియోలను అతడు పోర్న్ సైట్స్ కు అమ్మినట్లు తెలుస్తోంది.
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థకు చెందిన హాస్టల్‌లో వాష్ రూమ్ లో ఓ మహిళ సీక్రెట్ కెమెరాలు ఉంచింది. వీడియోలు చిత్రీకరించి తన బాయ్ ఫ్రెండ్ కు పంపిందని ఆరోపణలు వస్తున్నాయి. విషయం తెలుసుకున్న యువతులు హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. రహస్య కెమెరాలతో వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణలతో ఆ సంస్థకు చెందిన మహిళా ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు.
ఒడిశాకు చెందిన నిందితురాలు నీలుకుమారి గుప్తా స్పై కెమెరాలు ఉపయోగించి మహిళల వీడియోలను రహస్యంగా రికార్డ్ చేసిందని పోలీసులు గుర్తించారు. వాష్ రూమ్ లో కెమెరాలున్నట్లు మహారాష్ట్రకు చెందిన ఓ యువతి గుర్తించి హాస్టల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తనిఖీలు చేయగా వాష్‌రూమ్‌లో ఒక చిన్న కెమెరా దొరికింది.
“మహిళల వాష్ రూమ్ లో ఒక చిన్న కెమెరా దొరికింది. ఈ కెమెరాతో రికార్డు చేసిన వీడియోలను మహిళ తన ప్రియుడికి పంపేందుకు ప్లాన్ చేసింది. దీనికి గల కారణాలను తాము పరిశీలిస్తున్నాము” అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఏదైనా రికార్డింగ్‌లు తన బాయ్ ఫ్రెండ్ కు షేర్ చేసిందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ వీడియో రికార్డ్ చేసింది, కానీ వాటిని ఇంకా షేర్ చేయడానికి ముందే పట్టుకున్నామని దర్యాప్తులో అధికారులు తెలిపారు. అయితే ఆ మహిళ వీడియోలు షేర్ చేసిందని యువతులు ఆందోళనకు దిగారు.
Also Read: Jagtial Snake Bite: నెల రోజుల్లో ఏడుసార్లు పాము కాటు.. పగబట్టిందేమోనని కుటుంబ సభ్యుల భయాందోళన
విషయం బయటకు రావడంతో నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సాయంత్రం వందలాది మంది మహిళా ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి టాటా ఎలక్ట్రానిక్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కెమెరాలు పెట్టిన మహిళలను అరెస్టు చేశారు.