BigTV English

Homi Jehangir Bhabha : భారత్ ‘అణు’శక్తి పితామహుడు.. హోమీ జహంగీర్ బాబా

Homi Jehangir Bhabha : భారత్ ‘అణు’శక్తి పితామహుడు.. హోమీ జహంగీర్ బాబా
Homi Jehangir Bhabha

Homi Jehangir Bhabha : భారతదేశం అణుశక్తిని అందిపుచ్చుకోగలిగితే.. అభివృద్ధిలో అంచెలంచెలుగా ఎదుగుతుందని స్వాతంత్ర్యానికి ముందే ఊహించిన గొప్ప శాస్త్రవేత్త.. డా. హోమీ జహంగీర్ బాబా. ఆధునిక భారతదేశపు అణుశక్తి పితామహుడు విజ్ఞానానికి ఆద్యుడిగా, గొప్ప చిత్రకారుడిగా, ఎందరో యువకులను సైంటిస్టులుగా తీర్చిదిద్దిన మార్గదర్శిగా హోమీ బాబా పేరుగాంచారు.


హోమీ జహంగీర్ బాబా 1909, అక్టోబర్ 30న ముంబైలోని ఒక సంపన్న పార్సీ కుటుంబంలో జన్మించారు. తండ్రి గొప్ప న్యాయవాది, తల్లి గృహిణి. ప్రాథమిక విద్యను ముంబైలో పూర్తిచేసిన హోమీబాబా.. మిగిలిన చదువంతా కేంబ్రిడ్జి వర్సిటీలోనే సాగింది. కేవలం 15 ఏళ్ల వయసులో సీనియర్ కేంబ్రిడ్జ్ పరీక్షలో ఉత్తీర్ణుడై, ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీలో చేరాడు. మేథ్స్, ఫిజిక్స్ పట్ల మక్కువతో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ప్రథమశ్రేణిలో పాసయ్యాడు. అక్కడే పాల్‌డ్రిక్ మార్గదర్శకత్వంలో మేథ్స్‌లో ట్రిపోస్ పూర్తి చేశారు. అప్పడే ఆయనకు న్యూక్లియర్ ఫిజిక్స్ మీద మక్కువ పెరిగింది. దీంతో రేడియేషన్‌ను విడుదల చేసే కణాలమీద పరిశోధన మొదలు పెట్టారు.

థియరిటికల్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ కోసం కావెండిష్ ల్యాబొరేటరీలో పనిచేశారు బాబా. ఆ సమయంలో ఆయన పబ్లిష్ చేసిన ‘ది అబ్సార్‌ప్షన్ ఆఫ్ కాస్మిక్ రేడియేషన్’ అనే సిద్ధాంత పత్రానికి ఐజాక్ న్యూటన్ స్టూడెంట్ షిప్ పొందారు. ఈ పత్రంలో బాబా.. కాస్మిక్ కిరణాల లక్షణాలను వివరించారు. అనంతరం.. రాల్ఫ్ హెచ్ ఫౌలర్ అనే గైడ్ సాయంతో థియరిటికల్ ఫిజిక్స్‌లో పరిశోధనా పత్రాన్ని సమర్పించి.. పీహెచ్‌డీ పొందారు.


అదే సమయంలో ఎలక్ట్రాన్ – పాజిట్రాన్ పరిక్షేపణం గురించి పరిశోధన చేశారు. ఈ అంశంలో ఆయన సేవలకు తరువాత ఎలక్ట్రాన్ – పాజిట్రాన్ పరిక్షేపణను ‘బాబా స్కాటరింగ్’ అని పిలిచారు. ఇలా కేంబ్రిడ్జ్‌లో పరిశోధనల్లో బిజీగా ఉన్న సమయంలోనే (1939) రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. దీంతో ఆయన భారత్ తిరిగి రావాల్సి వచ్చింది.

యుద్ధం ఆరేళ్లకు పైగా సాగటంతో ఆయన తిరిగి బ్రిటిన్ వెళ్లలేదు. డా. సీవీ రామన్ ఆధ్వర్యంలో ఉన్న బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఫిజిక్స్ రీడర్‌గా చేరారు. అక్కడ పనిచేస్తూనే.. మనదేశం అణు రంగంలో వెనకబడి ఉన్న అంశాన్ని గుర్తించి, నాటి ప్రధాని నెహ్రూను ఒప్పించి పలు కళాశాలలు, ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాలని కోరారు. తర్వాత 1944లో తానే స్వయంగా కాస్మిక్ కిరణాల పరిశోధనాశాలను ప్రారంభించి, స్వతంత్రంగా అణు పరిశోధనకు దిగారు. 1945లో ముంబైలో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌, 1948లో అటామిక్ ఎనర్జీ కమిషన్‌ సంస్థలను స్థాపించాడు.

పై సంస్థలకు డైరక్టర్‌గా నియమితుడైన బాబా భౌతిక శాస్త్ర అధ్యాపకునిగానూ పనిచేస్తూ వచ్చారు. మన దేశంలో యురేనియం నిల్వలు లేకపోవటంతో దానికి బదులు అలాంటి లక్షణాలున్న, మనదేశంలో విరివిగా లభించే థోరియం నుంచి అణు శక్తిని వెలికి తీసే వ్యూహాంతో మూడు దశల్లో అణుకార్యక్రమానికి నాంది పలికారు. అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఫోరమ్‌లలో భారత ప్రతినిధిగా, 1955 లో జెనీవాలో అణుశక్తి యొక్క శాంతియుత ఉపయోగాలపై ఐక్యరాజ్యసమితి సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1958లో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌కు విదేశీ గౌరవ సభ్యునిగా ఎన్నికయ్యారు.

1966 జనవరి 24న, అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నిర్వహిస్తున్న సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం కోసం ఆస్ట్రియాలోని వియన్నాకు వెళ్తుండగా మోంట్ బ్లాంక్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో భాభా మరణించారు. భారత అణు కార్యక్రమాన్ని ఆపేందుకు అమెరికా గూఢచారి సంస్థ(సీఐఏ) విమాన ప్రమాదానికి పూనుకుందనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. గ్రెగోరి డగ్లోస్‌ అనే జర్నలిస్ట్‌ తాను ప్రచురించిన ‘కాన్వర్‌సేషన్ విత్ ద క్రో’ అనే పుస్తకంలో హోమిభాభాను హత్య చేయడానికి సిఐఎ కారణమని రాశారు.

కష్టించి పనిచేసేవారిని బాబా ఇష్టపడేవారు. వారు పనిలో ఏదైనా పనిలో పొరపాటు చేసినా క్షమించేవారు. కానీ.. నిర్లక్ష్యంగా, సోమరిలా ఉండేవారిని భరించేవారు కాదు. బాబా జీవితాంతం బ్రహ్మచారి గా ఉన్నారు. ‘ మనిషి జీవితంలో చావును తప్ప దేనినైనా నిర్దేశించగలడు’ అనేవారు. ఎవరైనా చనిపోయినప్పుడు పని ఆపి, సెలవు ప్రకటించటాన్ని బాబా వ్యతిరేకించారు. ఆ రోజు మరింత ఎక్కువ పని చేయడమే చనిపోయిన వారికి మనమిచ్చే నివాళి అనేవారు. అందుకే బాబా మరణ వార్త విన్నప్పుడు ఆయన సహోద్యోగులు, ఆయన కింద పనిచేసే వారు అందరూ పనిలో లీనమై ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

1942లో ఆడమ్స్ ప్రైజ్‌ను గెలుచుకున్న బాబా, 1954లో పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. 1951, 1953, 1956లలో ఆయన భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. ఆయన మరణానంతరం ముంబైలోని అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్‌మెంటును భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌గా మార్చారు. అంతేగాదు అయన పేరు మీదుగా ముంబెలో డీమ్డ్ విశ్వవిద్యాలయం, సెన్సు ఎడ్యుకేషన్‌ సెంటర్‌ తదితరాలను ఏర్పాటు చేసి దేశం ఆయనను గౌరవించుకుంది. బాబా వంటి కొందరు అసామాన్య వ్యక్తుల శ్రమ, సాధనల మూలంగానే ఆరు దశాబ్దాల కాలంలో మన దేశం ఎన్నో రకాలుగా ముందంజ వేయగలిగింది. నేటి ఆయన వర్థంతి సందర్భంగా జాతి గర్వించే ఆ శాస్త్రవేత్తకు ఘన నివాళి.

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×