Cheepurupalli Constituency: ఓడామని ఒకరు. గెలిచి కూడా లాభం లేక పోయిందని మరొకరు. ఫలితం.. పట్టించుకునే నాథుడే లేక అనాథగా మారిన నియోజవర్గం. ఇంతకీ ఏంటా నియోజకవర్గ ప్రజల బాధ? ఎవరా ఇద్దరు లీడర్లు?
చీపురుపల్లిని తాజా మాజీలిద్దరూ గాలికి వదిలేశారా?
కిమిడి నాగార్జున ఎమ్మెల్యే అయి ఉంటే బావుండేదని మరో చర్చచీపురుపల్లి నియోజవర్గాన్ని.. తాజా మాజాలిద్దరూ గాలికి వదిలేశారా? అంటే అవుననే తెలుస్తోంది. ఒక దశలో ఉత్తరాంధ్ర నుంచి రాజకీయంగా పెద్ద ఎత్తున చక్రం తిప్పిన ఆ ఇద్దరు సీనియర్ లీడర్లు.. ప్రస్తుతం ఆ సెగ్మెంట్ అంటేనే అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారట.. ఈ ప్రాంతవాసులు.
గెలవలేదు కాబట్టి.. ఒకరు, గెలిచినా మంత్రి పదవి దక్కలేదని మరొకరు
ఎలాగూ గెలవలేదు కాబట్టి.. ఒకరు, గెలిచినా తనకు మంత్రి పదవి దక్కలేదని మరొకరు.. ఇలా నియోజక వర్గాన్ని బొత్తిగా వదిలిపెట్టేశారట. ఇంతకీ ఎవరా లీడర్లంటే.. వారు మరెవరో కాదు ప్రస్తుత ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.
ఆ ఇద్దరు సీనియర్లే.. కిమిడి, బొత్స
ఇద్దరికిద్దరే. హేమాహేమీలు. ఈ ప్రాంతం నుంచి ఏపీ వ్యాప్తంగా ఒక వెలుగు వెలిగిన వారే. కాంగ్రెస్ లో ఉన్నపుడు బొత్స, గతంలో టీడీపీ అధికారంలో ఉండగా కిమిడి.. తామేంటో చూపించారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు చీపురుపల్లి సీనియర్ లీడర్ల పరిస్థితేంటని చూస్తే.. కనిపించుట లేదన్న వాల్ పోస్టర్లు వేసే పరిస్థితి గా తయారైందట.
2004 నుంచి కీలకంగా మారిన నియోజకవర్గం
రాష్ట్రంలో చీపురుపల్లి నియోజకవర్గ చరిత్ర చాలా పెద్దదే. ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన వారి ప్రత్యేకతలు అంతకన్నా మించినది. చీపురుపల్లి గురించి బొత్స వర్గీయులు ఎంత గొప్పగా చెబుతారంటే… ఒక కుప్పం, మరో పులివెందుల తర్వాత ఆ స్థాయి వీవీఐపీ సెగ్మెంట్ చీపురుపల్లి అంటూ ఢంకా బజాయిస్తారు. అందుకు తగినట్టుగానే 2004 నుంచీ ఈ నియోజకవర్గం అంత కీలకంగా తయారైంది. మరీ ముఖ్యంగా బొత్స రాజకీయ దశ, దిశ మారింది మారింది కూడా అప్పటి నుంచే.
1951 నాటి నుంచి మూడు సార్లు గెలిచింది ఒక్క బొత్స ఒక్కరే..
1951లో ఈ నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుంచి ఇక్కడ మూడు సార్లు గెలిచింది బొత్స ఒక్కరే. గెలిచిన మూడు సార్లూ మంత్రిగా పని చేసిన ఘనత కూడా ఆయనదే. కాంగ్రెస్ హయాంలో రెండు సార్లు, వైసీపీ జమానాలో ఒకసారి ఇక్కడి నుంచి గెలిచిన బొత్స.. వివిధ మంత్రిత్వాలు సైతం సొంతం చేసుకున్నారు. చీపురుపల్లిని ఏక చెక్కగా ఏలారు. ఇక్కడ బొత్స అంటే అదో బ్రాండ్. అన్నట్టుగానే ఈ సెగ్మెంట్ వ్యాప్తంగా ఆయన పేరు మారు మోగేది.
గతంలో ఉణుగూరు, ఎచ్చెర్లకు ప్రాతినిథ్యం కళా వెంకటరావు
ఇక కమిడి కళా వెంకట్రావ్.. గతంలో ఉణుగూరు, ఎచ్చెర్లకు ప్రాతినిథ్యం వహించారు. రాజకీయ సమీకరణాలు మారి.. కూటమి పొత్తుల కారణంగా తొలిసారి కళా చీపురుపల్లి నుంచి పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన తొలిసారే గెలిచిన పేరు సాధించారు.
బొత్స హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటోన్న స్థానికులు
నిజానికి వైసీపీ హయాంలో బొత్స మంత్రిగా ఉన్నప్పటికీ చీపురుపల్లిలో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదని అంటారు స్థానికులు. అందుకే కళా ఇక్కడ తొలిసారి అడుగు పెట్టిన వెంటనే ఆయనకు జనం నీరాజనాలు పట్టారనీ చెబుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. సీనియర్ గా కళా మంత్రి పదవి పొందడం ఖాయమనీ భావించారట. దీంతో తమ సెగ్మెంట్ కున్న వీఐపీ స్టేటస్ ఎటూ పోదనీ ఫీలయ్యారట ఇటు కళా- అటు నియోజకవర్గ ప్రజలు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. కూటమి కోటాల్లో పడి.. కొన్ని పదవులు అటు వైపు ఎమ్మెల్యేలు తన్నుకు పోవడంతో.. కళకళలాడాల్సిన కళా కాస్తా వెల వెల పోయారట. దక్కుతుందన్న మంత్రిత్వం దక్కక డీలా పడిపోయారట.
2004 నుంచి ఈ సెగ్మెంట్ కి మంత్రి పదవి దక్కక పోవడం కూడా ఇదే..
2004 తర్వాత నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కక పోవడం కూడా ఇదే మొదటి సారి. దీంతో ఇటు కళా అటు స్థానిక ప్రజలు ఇరువురు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారట. సీనియర్ కాబట్టి ఆయనకు మంత్రి పదవి దక్కడం ఖాయమని భావించారట. ఒక మంత్రిగా బొత్స ద్వారా సాధ్యం కానిది.. కళా ద్వారా.. సాధ్యమవుతుందనే అనుకున్నారట.. స్థానిక కూటమి నేతలు. కానీ ఇటు గోడ దెబ్బ- అటు చెంప దెబ్బ అన్నట్టు.. అటు బొత్సను కోల్పోయి.. ఇటు వెంకట్రావుకు మంత్రిత్వం దక్కక.. రెంటికీ చెడ్డ రేవడిగా తమ బతుకు మారిందని వాపోవడం ఇక్కడి వారి వంతుగా మారిందట.
కళా కనీసం పార్టీ కార్యకలాపాల్లోనూ పాల్గొనడం లేదంటూ ఆవేదన
మంత్రి పదవి రాకుంటే పోయింది.. కనీసం నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయిలో చేయాల్సిన పనులైనా వెంకటరావు చేస్తారని భావిస్తే.. అక్కడా ఆశ అడియాశగా మారిందని సమాచారం. నమ్మి గెలిపిస్తే నియోజవర్గానికి మొహం చాటేయటం ఏమిటి? కనీసం ఇటు వైపే రాకుండా తమను దూరం పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారట స్థానికులు. కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదని వాపోతున్నారట కూటమి కార్యకర్తలు.
వెంకట్రావును కలవాలంటే రాజాం నివాసానికి వెళ్లాల్సిందే..
ఈ మాట ఆ నోటా ఈ నోటా పాకి.. కళా వెంకటరావుకు చేరడంతో.. ఆయనో మధ్యే మార్గం కనుగొన్నారట. తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడ్ని పార్టీ కార్యక్రమాలకు పంపి మమ అనిపించేస్తున్నారట. ఒక వేళ కార్యకర్తలు, అధికారులు MLAని కలవాల్సి ఉంటే.. రాజాంలోని ఆయన నివాసానికి వెళ్లాల్సి వస్తోందట.
ఇంటిల్ల పాదీ ఓడిన వైరాగ్యంలో పడ్డ బొత్స సత్యనారాయణ
కళా పరిస్థితి ఇలాగుంటే.. మాజీ మంత్రి బొత్స విషయంలోనూ పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నారట. చీపురుపల్లే కాదు కనీసం ఆయన విజయనగరం కూడా రావడం మానేశారనీ.. ఇంటిల్ల పాదీ ఓడిపోవడంతో ఆయన నియోజకవర్గంపై ఒక రకమైన వైరాగ్యం పెంచుకున్నారనీ మాట్లాడుకుంటున్నారట. దీంతో తమ గోడు వెళ్లక్కాలంటే.. దిక్కేది దేవుడా! అంటూ వీరు విలవిలలాడిపోతున్నారట.
కిమిడి నాగార్జున ఎమ్మెల్యే అయి ఉంటే బావుండేదని మరో చర్చ
గతంలో బొత్స మేనల్లుడు చిన్ని శీను అయినా వచ్చేవారనీ..ఆయన భీమిలి ఇంచార్జ్ అయ్యాక.. ఆయన రాక పోకలు కూడా తగ్గాయనీ.. దీంతో ఈ ఇద్దరు నేతల్ని నమ్మి తాము నట్టేట మునిగామని ఫీలవుతున్నారట స్థానికులు. ఓడిన బొత్స ఎంచక్కా ఎమ్మెల్సీ అయ్యి మండలిలో ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తున్నారనీ.. అదే కళా వెంకట్రావ్.. గెలిచి కూడా తమకిలా హ్యాండ్ ఇవ్వడం ఏమీ బాగోలేదనీ.. నాన్ లోకల్స్ ని గెలిపించడం వల్ల నష్టం మనకేనని స్థానికులు గుసగుసలాడుతున్నారట. కనీసం కిమిడి నాగార్జున ఎమ్మెల్యే అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారట ఇక్కడివారు.