Special Protection Group : పరాక్రమానికి ప్రతిరూపం.. ఎస్పీజీ..!

Special Protection Group : పరాక్రమానికి ప్రతిరూపం.. ఎస్పీజీ..!

Special Protection Group
Share this post with your friends

Special Protection Group

Special Protection Group : మన దేశంలో అత్యంత ప్రముఖ వ్యక్తులు, ప్రముఖుల భద్రతా బాధ్యతలను ఎస్పీజీ(స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) సిబ్బంది నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆరున్నర అడుగుల ఎత్తు, నల్లని యూనిఫామ్‌లు ధరించిన ఈ అంతర్జాతీయ స్థాయి భద్రతా నైపుణ్యాలు గల ఈ ఎస్పీజీ కమాండోలు తమ భద్రతలో ఉన్నవారి మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటూ ఉంటారు. అయితే.. మనదేశంలో రాను రానూ వీఐపీల భద్రత ఒక సామాజిక హోదాగా మారిపోయిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఎస్పీజీ భద్రత తొలగించడం రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టించిన ఉదంతాలూ మనదేశంలో కనిపిస్తాయి. ఇంతకీ.. ఈ ఎస్పీజీ పుట్టుకు ఎలా జరిగింది? ఇందులోని సిబ్బందికి ఉండే ప్రత్యేకతలు ఏమిటి? వంటి విషయాల మీద ఓ లుక్కేద్దాం.

ఎస్పీజీ చరిత్ర, వివరాలు

శౌర్యం, సమర్పణం, సురక్ష.. ఈ 3 సూత్రాలే ప్రాతిపదికగా మనదేశంలో ఎస్పీజీ పనిచేస్తుంది. అత్యంత కఠిన శిక్షణ పొందిన సుమారు 3 వేల మంది భద్రతా అధికారులు ఈ బృందంలో సేవలందిస్తూ ఉన్నారు. సీఆర్‌పీఎఫ్‌(సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్) నుంచి మెరికల్లాంటి అధికారుల్ని ఏరి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. శారీరక దారుఢ్యం, నాయకత్వ లక్షణాలు, వృత్తి పట్ల నిబద్ధత, భద్రతా వ్యవహారాలపై సంపూర్ణ పట్టు, కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఎక్కడ ఎలా మెలగాలన్న అవగాహన మెండుగా ఉన్నవారికే ఇందులో అవకాశం వస్తుంది.

ప్రధాని, విపక్ష నేత మొదలు ఎస్పీజీ భద్రతలో ఉన్న వీవీఐపీలకు పగలు, రాత్రి అనే తేడా లేకుండా నీడలా ఉంటూ వీరు భద్రత కల్పిస్తారు. వీవీఐపీలు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినా.. ఒకరోజు ముందే ఆ ప్రాంతం అంతా ఎస్పీజీ అధీనంలోకి వెళ్లిపోతుంది. వీరిలో బాంబుల్ని నిర్వీర్యం చేసే స్క్వాడ్, జాగిలాలు, అత్యాధునిక ఆయుధాలు, వాహనాలు, జామర్స్, చిమ్మ చీకట్లో కూడా స్పష్టంగా చూడగలిగే గాగుల్స్, ఉన్నచోటి నుంచే దేశంలో ఎక్కడికైనా సమాచారం అందించగలిగే కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంటాయి.

ఎస్పీజీ ర‌క్షణ‌లో ఉండే ప్రముఖులు వెళ్లే ఆయా ప్రదేశాల వివరాలు, ఎవరిని కలవాలనుకుంటున్నారు? వీవీఐపీని కలవటానికి వచ్చే వ్యక్తుల సమాచారం.. ఇలా ప్రతి వివరాన్నీ ఈ సిబ్బంది ఒక ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేస్తుంటారు. వీవీఐపీలు విదేశాలకు వెళ్లినా.. కనీసం కొన్నాళ్ల ముందైనా ఎస్పీజీకి సమాచారం అందిస్తే వారు అక్కడికి కూడా వెళ్లి భద్రత కల్పిస్తారు. వీవీఐపీ విదేశం చేరక ముందే వారి బుల్లెట్ ప్రూఫ్ కార్లు వారిక‌న్నా ముందే విమానంలో గ‌మ్యం చేర‌తాయి. విమానాశ్రయాల్లో త‌నిఖీలు ఉండ‌వు. నేరుగా విమానం వ‌ర‌కూ ద‌ర్జాగా కారులో వెళ్లొచ్చు. వీరి వాహ‌నానికి ముందూ వెనుకా 15 బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాలుంటాయి.

1981కి ముందు ప్రధాని భ‌ద్రత‌ను ఢిల్లీ పోలీస్ విభాగంలోని డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం ప‌ర్యవేక్షించేది. ఆ త‌ర్వాత‌ దీనికోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. 1984లో ప్రధాని ఇందిరా గాంధీని సొంత అంగరక్షకులే హత్య చేసిన నేపథ్యంలో తర్వాత ఏర్పాటైన రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1985లో బీర్బల్‌నాథ్ క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అదే ఏడాది ఎస్పీజీ చట్టాన్ని తీసుకొచ్చింది.

అయితే మ‌రో మూడేళ్లకు ఇది అమల్లోకి వచ్చింది. అయితే.. రాజీవ్‌గాంధీ 1989లో ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నాక ఎస్పీజీ ర‌క్షణ అవ‌స‌ర‌మ‌ని అనుకోలేదు. 1989లో వీపీ సింగ్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్‌ గాంధీకి ఉన్న ఎస్పీజీ భద్రతను తొలగించారు. 1991లో రాజీవ్‌ హత్య తర్వాత ఎస్పీజీ చట్టానికి సవరణలు చేసి, మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు కనీసం పదేళ్ల పాటు ఎస్పీజీ భద్రత కల్పించేలా చట్టాన్ని సవరించారు.

2003లో వాజ్‌పేయి ప్రభుత్వం ఈ చట్టానికి మరోసారి సవరణలు చేసి మాజీ ప్రధానులు, వారి కుటుంబాలకు పదేళ్లకు బదులుగా పదవీ కాలం ముగిసిన తర్వాత ఏడాది వరకే ఈ భద్రతను అందిస్తున్నారు. ఆ తర్వాత వారి భద్రతకు ప్రమాదముందని హోం శాఖ భావిస్తే దానిని కొనసాగించేలా సవరణ చేశారు. ఈ క్రమంలోనే మాజీ ప్రధానులు హెచ్‌డీ దేవేగౌడ, ఐకే గుజ్రాల్, పీవీ నరసింహారావు, ప్రియాంకా గాంధీ తదితరులకు ఎస్పీజీ భద్రతను తొలగించారు.

ఎస్పీజీ భద్రత కోసం వెచ్చించాల్సిన మొత్తాలు ఏటికేడు పెరుగుతూ పోతున్నాయి. జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీతో పోల్చితే.. ఎస్పీజీ భద్రతకయ్యే వ్యయం 6 రెట్లు ఎక్కువ. దీన్ని ఖజానా నుంచే ఖర్చు చేస్తారు. 2004 -13 మధ్య కాలంలో గాంధీ కుటుంబం, మన్మోహన్‌ సింగ్, అటల్‌ బిహారీ వాజ్‌పేయి భద్రత కోసం రూ. 1,800 కోట్ల ఖర్చు అయింది. 2018-19లో దీనికోసం రూ. 411.68 కోట్లు కేటాయించగా, 2019-20లో ఈ కేటాయింపులు రూ. 535 కోట్లకు, 2020-21 నాటికి 592 కోట్లకు పెరిగాయి. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కంటే ఎస్పీజీ భద్రతకయ్యే వ్యయం ఆరు రెట్లు ఎక్కువ. ఈ ఖర్చంతా కేంద్ర ఖజానా నుంచే ఖర్చు చేస్తుంది.

ఎస్పీజీ డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు. ఒక్కోసారి సీఆర్పీఎఫ్ అధికారికీ అప్పగిస్తారు. డైరెక్టర్ కింద డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్లు చాలా మంది ఉంటారు. ఎస్పీజీని ముఖ్యంగా 4 కేటగిరీలుగా విభజించారు. ఒకటి.. ఆపరేషన్స్. రెండు.. ట్రైనింగ్. మూడు.. ఇంటెలిజెన్స్ అండ్ టూర్స్. నాలుగు.. అడ్మినిస్ట్రేషన్. ఆపరేషన్స్ బ్రాంచ్‌లో కమ్యూనికేషన్స్, టెక్నికల్, ట్రాన్స్‌పోర్ట్ అనే 3 విభాగాలు ఉంటాయి.

ప్రస్తుతం ఎస్పీజీ భద్రత కేవలం దేశ ప్రధానికి మాత్రమే ఉంది. ఆయన భద్రత కోసం ఎస్పీజీ 2020-21 సంవత్సరంలో రూ. 592 కోట్లు వెచ్చించింది. ఇప్పటివరకు ఎస్పీజీ భద్రత సంపూర్ణంగా అనుభవించింది కేవలం అటల్ బిహారీ వాజ్‌పేయి మాత్రమే. గత ఏడాది ఆయన కన్నుమూసే వరకు ఎస్పీజీ భద్రతను కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కొనసాగించింది.

ఇతర కీలక భద్రతా వ్యవస్థలు

జెడ్ ప్లస్ : ఇది రెండవ అత్యుత్తమ భద్రతా విభాగం. ఈ కేటగిరీలో 10 మంది ఎన్‌ఎస్‌జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్) కమాండోలు, 45 మంది ఇతర సిబ్బంది బాధ్యతల్లో ఉంటారు. 5 కంటే ఎక్కువ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుంటాయి. వీవీఐపీ నివాసం వద్ద రొటేషన్ పద్ధతిలో రక్షణ కల్పిస్తారు. ఫ్రస్తుతం దేశవ్యాప్తంగా 40 మందికి జెడ్ ప్లస్ భద్రత ఉంది. ఇక ఒక వీఐపీ కోసం జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీకి నెలకయ్యే ఖర్చు సుమారు రూ. 33 లక్షలు. సోనియా గాంధీ, అమిత్ షా, సల్మాన్ ఖాన్, రాహుల్ గాంధీ, యోగి ఆదిత్య నాథ్, ప్రియాంకా గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, చంద్రబాబు నాయుడు, శరద్ పవార్, ఉమాభారతి ఉండగా, సొంత ఖర్చుతో ముకేష్ అంబానీ దీనిని పొందారు.

జెడ్ : ఇది మూడో అత్యుత్తమ భద్రతా విభాగం. ఈ కేటగిరీ కింద వీఐపీకి 22 మంది భద్రతా అధికారులు రక్షణగా ఉంటారు. వీరిలో నలుగురైదుగురు ఎన్‌ఎస్‌జీ కమాండోలుంటారు. ఇతర సెక్యూరిటీ అధికారుల్ని ఢిల్లీ పోలీసులు లేదంటే సీఆర్‌పీఎఫ్ పోలీసులు కేటాయిస్తారు. ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం, మరియు 5 ఇతర వాహనాలుంటాయి. ప్రస్తుతం 60 మందికి ఈ స్థాయి భద్రత ఉంది. కాగా ఒక వీఐపీ కోసం జెడ్‌ సెక్యూరిటీకి నెలకయ్యే ఖర్చు సుమారు రూ. 22 లక్షలు.

వై ప్లస్ : ఇది నాలుగో భద్రతా విభాగం. ఈ కేటగిరీ కింద భద్రత పొందే వీఐపీలకు 11 మంది సిబ్బంది కాపలాగా ఉంటారు. ఒకరిద్దరు అధికారులు వీఐపీలు ఎక్కడికి వెళ్లినా కాపలాగా వెళతారు. ప్రస్తుతం ఐదుగురికి ఈ స్థాయి భద్రత ఉంది. ఒకరికి ఈ రక్షణ ఇవ్వాలంటే అయ్యే ఖర్చు రూ. 15 లక్షలు. లభించే వాహనాలు.. మూడు.

వై: ఇది అయిదవ భద్రతా విభాగం. ఇందులో 8 మంది సిబ్బంది రక్షణగా ఉంటారు. రెండు వాహనాలుంటాయి. ఒక వీఐపీకి ఈ భద్రత ఇచ్చేందుకు నెలకు రూ. 12 లక్షలు ఖర్చు అవుతుంది.

ఎక్స్ : ఇది అయిదవ భద్రతా విభాగం. ఇది సాధారణ భద్రత. కేవలం ఇద్దరు గన్‌మ్యాన్‌లు వీఐపీలకు రక్షణగా ఉంటారు. ఫ్రస్తుతం ఈ కేటగిరి కింద 70 మందికి పైగా వీఐపీలకు భద్రత లభిస్తోంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Pooja Hegde : అమ్మా.. బుట్ట‌బొమ్మ ఎంత ప‌ని చేశావ‌మ్మా!

BigTv Desk

Iran: ఇరాన్‌లో భారీ భూకంపం.. ఏడుగురి దుర్మరణం

Bigtv Digital

Foxconn apologizes: తిరగబడ్డ ఉద్యోగులు.. ఫాక్స్‌కాన్ క్షమాపణ..

BigTv Desk

Lokesh: లోకేశ్ ను నడవనిస్తారా? ఏపీలో రచ్చ రాజుకుంటుందా?

Bigtv Digital

Kadem Project: మళ్లీ మొరాయించిన కడెం.. ప్రస్తుతానికి గేట్లు పదిలం..

Bigtv Digital

Rahul Gandhi: మోదీ మెయిన్ టార్గెట్ అదేనా?.. రాహుల్, వాట్ నెక్ట్స్?

Bigtv Digital

Leave a Comment