AP Politics: ఏపీ లిక్కర్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి జగనే సూత్రధారి అని సిట్ అధికారుల విచారణలో వెల్లడైంది. లిక్కర్ పాలసీలో మార్పు, అక్రమార్కుల నియామకవాలు వంటి కీలక నిర్ణయాలన్నీ ఆయన్న కనుసన్నల్లోనే జరిగాయని సిట్ అనుబంధ చార్జ్‌షీట్లో వెల్లడించింది. ఈ కేసులో జగన్ సన్నిహితులు పలువురు అరెస్ట్ అయినా మద్యం కుంభకోణంపై టీడీపీ, జనసేన ముఖ్యలెవరూ మాట్లాడటం లేదు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నట్లు వ్యవహరిస్తున్నారు. మిత్రపక్షాలు సైలెంట్ అయినా బీజేపీ నేతలు మాత్రం వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సహా కాషాయ నేతలు బిగ్ బాస్ జగన్ అంటూ ముప్పేట దాడి చేస్తున్నారు. అసలు బీజేపీ అంత దూకుడు ప్రదర్శించడానికి కారణమేంటి?
లిక్కర్ స్కాంలో జగన్ పాత్రపై సిట్ చార్జ్‌షీట్
ఆంధ్రప్రదేశ్‌లో అయిదేళ్లపాటు సాగిన మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉందని సిట్ అధికారులు తమ అనుబంధ చార్జ్‌షీట్లో స్పష్టంగా పేర్కొంది. మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాజమార్గంగగా మార్చుకోవడానికి మాజీ సీఎం జగన్ ఎలాంటి అనుచిత నిర్ణయాలు తీసుకున్నారో వెల్లడించింది. ఉన్నతాధికారుల సిఫార్సులను పట్టించుకోకుండా నియామకాలు చేపట్టారని స్పష్టం చేసింది. సీఎంఓ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీల ప్రమేయానికి సంబంధించి సిట్ అభియోగాలు మోపింది.
తాజాగా అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్
తాజాగా విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేశారు. గతంలో వేసిన చార్జ్‌షీట్లో ఏడుగురు వ్యక్తులు, 9 సంస్థలపై అభియోగాలు మోపగా.. అధనంగా ముగ్గురు నిందితులపై అభియోగాలు మోపింది. తాజా ఛార్జ్ షీట్లో హవాలా లావాదేవీలు, డొల్ల కంపెనీలకు సంబంధించిన నకిలీ డైరెక్టర్ల వివరాలు పొందుపరించింది. మొత్తానికి లిక్కర్ స్కాంలో జగన్ నిర్ణయాలే కీలకమని స్పష్టం చేసింది. అయినా టీడీపీ, జనసేన నేతలు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లు వ్యవహరిస్తున్నారే కాని.. వైసీపీ మందిమగాదుల్ని కాని, జగన్‌ని కాని టార్గెట్ చేయడం లేదు. అయితే మిత్రపక్షమైన బీజేపీ మాత్రం అదే పనిగా పెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది.
బీజేపీ, వైసీపీ ఒక్కటే అని ఎప్పటి నుంచో ప్రచారం
బీజేపీ.. వైసీపీ ఒక్కటే.. అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఎలాగైనా పోగొట్టాలని బిజెపి అష్టకష్టాలు పడుతోందట. తాజాగా లిక్కర్ స్కాంపై పదే పదే విమర్శలకు దిగుతోంది బిజెపి. ఒకవైపు టిడిపి మంత్రులకు చంద్రబాబు లిక్కర్ స్కాం పై మాట్లాడొద్దని ఆదేశాలిచ్చినా బిజెపి మాత్రం బిగ్ బాస్ జగనే అంటూ ముప్పేట దాడి చేస్తుంది. 2019 నుంచి 2024 వరకు ఎపిలో వైసిపి అధికారంలో ఉన్న సమయంలో కేంద్రం ఏ బిల్లు ప్రవేశపెట్టినా వైసిపి మద్ధతిచ్చింది. ప్రస్తుతం కూడా బీజేపీ అధిష్టానం తో మంచి రేపో నడుపుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో ఈ ప్రచారమే కూటమి ద్వితీయ శ్రేణి నేతల్లో కొంత ఆందోళన కలిగిస్తుంది. బీజేపీ ఏపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మాధవ్ కు కూడా అది తలనొప్పిగా మారిందంట. దీంతో కూటమి శ్రేణులకు ఎలాగైనా దగ్గరవ్వాలనే యోచనలో వైసిపి అధినేత జగన్ పై మాటల దాడి పెంచాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో నాణ్యత లేని మద్యాన్ని ఎండగట్టిన పురంధేశ్వరి
గత వైసిపి పాలనలో జరిగిన అవినీతి ని ఎండగడుతూనే లిక్కర్ స్కాం ను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో పురంధేశ్వరి ఏపి బిజెపి అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో మద్యం తాగి చనిపోయి, మంచాన పడ్డవారి లెక్కలతో సహా ప్రభుత్వాన్ని ఎండగట్టారు. తాజాగా మాధవ్ కూడా ఆమె లైన్ లోనే వెళ్తూ లిక్కర్ స్కాం లో త్వరలో బిగ్ బాస్ జగన్ జైలుకు వెళతారంటూ మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బిజెపి మంత్రి సత్యకుమార్ తో పాటు ఆపార్టీ ఎమ్మెల్యేలు వైపిపి లిక్కర్ స్కాం పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. లిక్కర్ స్కాంలో ఉన్న ఏ ఒక్కరు తప్పించుకోలేరంటూ మీడియా ముందు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. కాని లిక్కర్ స్కాం పై టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం ఆ పార్టీ మంత్రులను మాట్లాడవద్దని క్యాబినెట్‌లో చెప్పడం కొసమెరుపు.
బీజేపీ విమర్శలపై స్పందించని వైసీపీ నేతలు
మరోవైపు లిక్కర్ స్కాం పై బిజెపి పదే పదే ఆరోపణలు చేస్తున్నా వైసిపి మాత్రం స్పందించడం లేదు. వరుస ఆరెస్టులు జరుగుతుంటే టిడిపి ని మాత్రం విమర్శిస్తున్నా బిజెపి జోలికి మాత్రం వెళ్లడం లేదు. దీంతో కమలనాధుల ఆరోపణలకు ప్రతిస్పందన లేకపోవడంతో బిజెపి, వైసిపి ఒక్కటే నంటూ గుసగుసలు వినబడుతూనే ఉన్నాయి. ఏదేమైనా ఆ ప్రచారానికి చెక్ పెట్టడానికి లిక్కర్ స్కాం తో పాటు ఇతర స్కాంలు, గతంలో జరిగిన పాలనపై వరుస పోరాటాలు చేయాలని, మాధవ్ తో సహా బిజెపి శ్రేణులు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా బిగ్ బాస్ ను టార్గెట్ చేస్తూ అక్కడి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారిపై విమర్శలు గుప్పించాలని నిర్ణయించారట. ఈ నేపధ్యంలోనే వైసిపిపై బీజేపీ వర్గాలు ముప్పేట దాడి చేస్తున్నాయంట. చూడాలి మరి వైసిపి ని విమర్శించి ఏపీలో బలపడాలన్న బిజెపి ప్లాన్ సక్సెస్ అవుతుందా లేక బెడిసికొడుతుందా?
Story By Vamshi Krishna, Bigtv