Pakistan Army: పాకిస్తాన్ భయపడింది.. భయపడాల్సిందే. అటు అమెరికా.. ఇటు చైనా, ఇంకోవైపు టర్కీ.. ఇలా ఎవరి అండ చూసుకుని రెచ్చిపోయినా సరే.. భారత్ అంటే భయపడాల్సిందే. అదే లెక్క. ఎందుకంటే ఆపరేషన్ సిందూర్ తో పాక్ ఆర్మీ అంతా చేతులెత్తేసింది. ఘోర పరాభవం అది. అందుకే రెడీగా ఉండాలంటూ రాకెట్ ఫోర్స్ అంటూ కొత్త కమాండ్ ను పాకిస్తాన్ ఏర్పాటు చేసుకుంటోంది. ఇంతకీ అది ఎలా పని చేస్తుంది.. వర్కవుట్ అవుతుందా?
పాక్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ ఏర్పాటు
ఆపరేషన్ సిందూర్ ను పాకిస్తాన్ కలలో కూడా మర్చిపోలేకపోతోంది. ఎందుకంటే మనం కొట్టిన దెబ్బ అలా ఉంది మరి. ఏకంగా పాక్ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేశాం. మన మిసైళ్లను పాక్ పాలకులు చూస్తుండి పోయారుగానీ ఏమీ చేయలేకపోయారు. చైనా, టర్కీ వంటి దేశాలు ఎంత సపోర్ట్ ఇచ్చినా వర్కవుట్ కాలేదు. అదిగో బాంబు.. ఇదిగో బాంబు అని పాక్ జనాలు పరుగులు తీయడమే కనిపించింది. అయితే ఇలా ఉంటే పరిస్థితి మారదనుకున్నారో ఏమోగానీ.. ఉన్నట్లుండి రాకెట్ ఫోర్స్ అంటూ పాక్ ప్రధాని షాబాద్ షరీఫ్ ప్రకటించారు. పాక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ స్టేట్ మెంట్ వెలువడింది. ఇదేదో కొత్తగా కాదు.. చైనాలో పీపుల్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ ను కాపీ కొట్టి పాక్ రాకెట్ ఫోర్స్ ప్రకటించారంతే. మన మిసైళ్లను వారు అడ్డుకోలేదు. వారి మిసైల్లు సరిగా పేలలేదు. మన S 400 బాహుబలి సమర్థంగా అడ్డుకుంది. తిప్పికొట్టింది. పాక్ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ను పాక్ ఆర్మీకి సరిగా ఆపరేట్ చేయడం కూడా రాలేదు. అందుకే ఈ మిసైళ్లను, డ్రోన్లను ఆపరేట్ చేయడానికి రాకెట్ ఫోర్స్ అంటూ తెరపైకి తెచ్చారు.
బలహీనతలతో తేలిపోయిన పాకిస్థాన్
మే 7 నుంచి 10 వరకు భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ నాలుగు రోజులూ పాకిస్తాన్ కు క్షణమొక యుగంగా మారింది. చివరికి చేతులెత్తేసి కాళ్లబేరానికి వచ్చింది పాక్. 1999 తర్వాత రెండు అణ్వాయుధ శక్తుల మధ్య జరిగిన అత్యంత తీవ్రమైన ఘర్షణ ఇదే. ఈ దాడుల్లో భారత్ చాలా తెలివిగా వ్యవహారం నడిపింది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లోని లోటుపాట్లను తెలుసుకుని చాలా కచ్చితమైన దాడులు చేసింది. ఈ ఎటాక్స్ లో భారత్.. బ్రహ్మోస్ మిసైళ్లు, రాఫేల్ ఫైటర్ జెట్‌లు, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను విజయవంతంగా వాడింది.
ఆపరేషన్ బున్యాన్ అల్ మర్సూస్ ఫెయిల్
మనం ఆపరేషన్ సిందూర్ చేపడితే.. దానికి ప్రతిగా పాకిస్తాన్ ఆపరేషన్ బున్యాన్ అల్ మర్సూస్ పేరుతో యాక్షన్ ప్లాన్ చేపట్టింది. అయితే అదంతా పెద్ద తుస్సుగా మారిపోయింది. పాకిస్తాన్ చేతులేత్తేసి చూస్తూ కూర్చుంది. ఈ ఘర్షణలో పాక్ తన F-16 జెట్‌లు, JF-17 థండర్, J-10C డ్రాగన్ జెట్‌లను వాడింది. కానీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని అడ్డుకుంది. భారత్ పాక్ మధ్య జరిగిన ఉద్రిక్తత పాకిస్తాన్ సైనిక బలహీనతలను బహిర్గతం చేసింది. ముఖ్యంగా దాని వైమానిక రక్షణ మిసైల్ కెపాసిటీ లోటుపాట్లేంటో తెలిసి వచ్చాయి. పాకిస్తాన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ ARFC, చైనా PLARF ఆధారంగా రూపొందించారు. ఇది బాలిస్టిక్, క్రూయిజ్, హైపర్‌సోనిక్ మిసైళ్లను నిర్వహించే ఒక జాయింట్ కమాండ్‌గా ఉంటుంది. ఈ ఫోర్స్ ను సాంప్రదాయ మిసైల్ రాకెట్ వ్యవస్థలపై ఫోకస్ పెట్టించి కచ్చితమైన దాడులు చేయడం, గ్రౌండ్ సపోర్ట్‌ను అందించేలా చూసుకోవాలనుకుంటున్నారు. అంతే కాదు భారత్ కు చెందిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను అధిగమించడం, భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవాలనుకుంటోంది పాకిస్తాన్.
మిసైళ్లను డీల్ చేయడానికి రాకెట్ ఫోర్స్
పాక్ దగ్గర ఫతాహ్-4 , ఫతాహ్-I, 2 బాబర్ క్రూయిజ్ మిసైల్, షాహీన్ బాలిస్టిక్ సిరీస్, A-100 మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్‌లు ఉన్నాయి. ఈ మిసైళ్లన్నీ చైనీస్ డిజైన్‌ల ఆధారంగానే రూపొందించుకున్నారు. అంటే పూర్తి సహాయ సహకారాలు డ్రాగన్ వే. పాక్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కు పాకిస్తాన్ ఆర్మీ కింద ఒక కొత్త కార్ప్స్ మాదిరి అన్న మాట. దీన్ని ఒక లెఫ్టినెంట్ జనరల్ లీడ్ చేయబోతున్నాడు. డైరెక్ట్ గా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లేదా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌కు రిపోర్ట్ చేస్తారు. ఇది ఆర్మీ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ నుండి వేరుగా ఉంటుంది. స్ట్రాటజిక్ ఫోర్స్ అణ్వాయుధాలను మెయింటేన్ చేస్తుందన్న మాట. సో పాకిస్తాన్ ఈ ఫోర్స్‌ను గేమ్ చేంజర్ అనుకుంటోంది. ఇది భారత్ కు చెందిన ఆర్మీ స్ట్రాటజిక్ ఆపరేషన్ కోల్డ్ స్టార్ట్ కు పోటీగా అనుకుంటున్నారు. ఏదైనా అనుకోని యుద్ధం వస్తే అప్పటికప్పుడు రియాక్ట్ అవడం, వ్యూహాలు రచించడం, దాడులు చేయడం అన్న మాట. ఇప్పుడు పాకిస్తాన్ ఏదో చేయాలనుకుంటోంది. కానీ అవన్నీ జరిగే పనేనా?
మిసైల్ సిస్టమ్ సరిగా వాడని పాక్
ఆపరేషన్ సిందూర్ పరాభవంతో పాకిస్తాన్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ ఏర్పాటు చేసుకుంది. అయితే ప్రకటన చేయగానే పనిమంతులు అవుతారా.. మనల్ని కొట్టాలంటే పాక్ కు ఈ జన్మలో అసాధ్యం. అయితే మనం పాక్ తో చేసే యుద్ధం వారితో కాదు.. వారి చాటున ఉండే చైనా, టర్కీ లాంటి దేశాలతోనే. అందుకే భారత్ మరింత అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితిని సూచిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ ప్రకటన వెనుక చాలా వ్యూహాలే కనిపిస్తున్నాయి. తెరచాటుగా చాలా దేశాలు సపోర్ట్ ఇస్తున్నా మొన్నటి ఆపరేషన్ సిందూర్ లో ఏమీ చేయలేకపోయారు. అందుకే అలర్ట్ నెస్ గా ఉండడం, మిసైళ్లను మోహరించడం, ప్రయోగించడం, కోఆర్డినేట్ చేసుకోవడం వీటన్నిటి కోసమే ARFC ఏర్పాటుపై పాక్ ప్రధాని ప్రకటన చేశారు. ఆపరేషన్ సిందూర్ టైంలో పాక్ తన మిస్సైల్ సిస్టమ్స్‌ను సరిగా వాడలేదని గుర్తించారు. పైగా అవి వేర్వేరు యూనిట్లలో విడివిడిగా ఉన్నాయి. అన్నిటినీ ఒక దగ్గరకు చేర్చడం, మోహరించడం సవాల్ గా మారాయి. అందుకే వీటిన్నిటినీ ఒకే కమాండ్ కిందకు చేర్చి రాకెట్ ఫోర్స్ కమాండ్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు.
పాక్ వెపన్స్ కొనేలా చేస్తున్న US, చైనా
పాక్ ప్రధాని షాహబాజ్ షరీఫ్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో చైనా, సౌదీ అరేబియా, టర్కీ, అజర్ బైజాన్, యూఏఈ, ఇరాన్‌లతో సహా ఫ్రెండ్లీ కంట్రీస్ నుంచి అందిన సపోర్ట్ పై ప్రశంసలు గుప్పించుకున్నారు. ఈ దేశాలు పాకిస్తాన్ సైనికంగా, ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో కీ రోల్ పోషిస్తున్నాయి. అందుకే ఈ జపం. ఈ ఫోర్స్ ఏర్పాటు పాక్ చైనా బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. చెప్పాలంటే ఇది పాకిస్తాన్ కంటే చైనా స్ట్రాటజీ కోసమే. అటు ఆపరేషన్ సిందూర్ తర్వాత చైనా ఓ గేమ్ నడుపుతోంది. పాకిస్తాన్ ఇలా ఉండొద్దు.. అలా ఉండాలి అని చెబుతూ.. ఆయుధ కొనుగోళ్లు చేసేలా చూస్తోంది. అటు అమెరికా కూడా మైండ్ గేమ్ షురూ చేసింది. పాకిస్తాన్ తో యుద్ధాలు చేయించి.. అప్పులు ఇచ్చి మరీ రక్షణ ఉత్పత్తులు కొనేలా చేయడం ఆ రెండు దేశాల స్ట్రాటజీ. అయితే పాకిస్తాన్ కు ఇది ఎప్పటికీ అర్థం కాదు. పైగా పాక్ ఎన్ని ఆయుధాలు కొన్నా.. వాటిని సరిగా వాడడమే రాదు. అందుకే ఆయుధాలను సరిగా వాడేందుకు ఈ రాకెట్ ఫోర్స్ ను ఏర్పాటు చేయిస్తోంది చైనా. ఇది షాబాజ్ షరీఫ్ నోటి నుంచి వచ్చిన మాటే అయినా తెరవెనుక చేయించిన అమెరికా, చైనాలే.
50% డిస్కౌంట్‌తో అమ్ముతున్న చైనా
ప్రస్తుతం పాకిస్తాన్ కు చైనా 40 J-35A ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్‌లను అమ్ముతోంది. డెలివరీ షురూ కాబోతోంది. పాక్ ఎయిర్ ఫోర్స్ పైలెట్లకు చైనాలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. HQ-19 యాంటీ-బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్ ను భారత్ బాలిస్టిక్ మిసైళ్లను అడ్డుకోవడానికి రూపొందించారు. రాఫెల్ కు సవాళ్లు విసిరేందుకు PL-15 ఎయిర్-టు-ఎయిర్ మిసైళ్లు కూడా అమ్ముతోంది. ఈ డీల్స్ వాల్యూ 5 బిలియన్ డాలర్లు. ఇందులో 50% డిస్కౌంట్ కూడా ఇస్తోంది చైనా. అలాగే 3.7 బిలియన్ డాలర్లను వాయిదాల పద్ధతిలో ఇస్తోంది. ఇది చాలదా.. పాకిస్తాన్ వద్దంటే ఆయుధాలు అమ్ముతున్న వారిని చూస్తే మన చుట్టూ పరిస్థితులు ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అటు టర్కీతో కలిసి పాకిస్తాన్ ఐదవ తరం కాన్ ఫైటర్ జెట్ అలాగే బియాండ్విజువల్ రేంజ్ – BVR మిసైళ్లను అభివృద్ధి చేస్తోంది.
OP సిందూర్ తర్వాత 20% డిఫెన్స్ బడ్జెట్ పెంచిన పాక్
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ తన డిఫెన్స్ ఖర్చులను 20 శాతం పెంచింది. ఈ ఖర్చు పెంపు ద్వారా పాకిస్తాన్ కొన్ని ముఖ్యమైన ఆయుధ కొనుగోళ్లను ప్లాన్ చేస్తోంది. భారత్ కు కీలకంగా మారిన S-400 యాంటీ డిఫెన్స్ సిస్టమ్‌లను ఎదుర్కోవడానికి చైనా తయారీ HQ-9/P సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్ సిస్టమ్‌లను అలాగే ఇతర ఆధునిక రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేస్తోంది పాక్. ఆపరేషన్ సిందూర్ లో పాక్ కు చాలా నష్టాలు జరిగాయి. ఆ దాడుల్లో F-16 ఫైటర్ జెట్లను కోల్పోయింది. దీంతో పాకిస్తాన్ సైనిక బలహీనత అంతా బయటపడింది. అందుకే రక్షణ వ్యవస్థ మోడ్రనైజేషన్, ఆపరేషనల్ ఫోర్సెస్ పై ఫోకస్ పెట్టాయి.
భారత్ కూడా వ్యూహాత్మక మార్పులు చేస్తుందా?
సో పాకిస్తాన్ రాకెట్ ఫోర్స్ కమాండ్ ను ఏర్పాటు చేసుకుంటోంది. మరి భారత్ కూడా అందుకు తగ్గట్లు వ్యూహాత్మక మార్పులకు రెడీ అవ్వాలన్నది డిఫెన్స్ ఎక్స్ పర్ట్స్ మాట. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను మరింత బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. S-400, ఆకాశ్, స్వదేశీ అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను మరింత బలోపేతం చేయాలి. హైపర్‌సోనిక్ ఇంటర్‌సెప్టర్‌లు ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌లలో పెట్టుబడులు అవసరమంటున్నారు నిపుణులు. అయితే S-500 డీల్ కోసం భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవలే రష్యాలో పర్యటించి వచ్చారు. అటు బ్రహ్మోస్, నిర్భయ్ క్రూయిజ్ మిసైళ్లను, ప్రళయ్ బాలిస్టిక్ మిసైల్స్ ను మరింతగా డెవలప్ చేసి, స్ట్రాటజిక్ లొకేషన్లలో మోహరించాల్సి ఉంటుంది.
Also Read: భయపెడుతున్నాడా! పార్టీ మారుతాడా! రాజగోపాల్ లెక్కేంటి?
పాకిస్తాన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ ఏం చేస్తుందో ఓ కన్నేసి ఉంచడం ఖాయమే. వీళ్లు మిసైల్స్ ను ఎక్కడెక్కడ మోహరిస్తున్నారో.. పర్యవేక్షించడానికి శాటిలైట్‌లు, డ్రోన్‌ల ద్వారా ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, కెపాసిటీస్ ను బలోపేతం చేసుకోవాలి. సైబర్ ఆపరేషన్‌ల ద్వారా ఈ రాకెట్ ఫోర్స్ వ్యవహారాలను గుర్తించి అడ్డుకట్ట వేయొచ్చు. మరోవైపు భారత్ కూడా ఇంటిగ్రేటెడ్ రాకెట్ ఫోర్స్ – IRF ను ఏర్పాటు చేసే విషయంపై కార్యాచరణ రెడీ చేసింది. ఇది అగ్ని, పృథ్వీ, ప్రళయ్, BM-04 వంటి మిసైళ్లను బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు అలాగే మల్టీ-బారెల్ రాకెట్ లాంచర్లను ఒకే కమాండ్ కిందకు తీసుకొస్తుంది. టెక్నాలజీ డెవలప్ మెంట్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, శిక్షణ ఇవన్నీ ఇస్తారు. అటు పాకిస్తాన్, ఇటు చైనాను ధీటుగా ఎదుర్కోవాలంటే మన సన్నద్ధత కూడా చాలా అవసరమే.
Story By Vidya Sagar, Bigtv