AP Politics: అనంతపురం టీడీపీ ఎంపీగా అనూహ్యంగా టికెట్ దక్కించుకుని విజయం సాధించారు అంబికా లక్ష్మీనారాయణ.. నియోజకవర్గానికి పూర్తిగా కొత్త ముఖం అయిన అంబికా ఇప్పుడు సొంత వర్గాన్ని పెంచి పోషించుకునే పనిలో పడ్డారంట. అందుకే గుంతకల్లు నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి అక్కడే ఎక్కువ పర్యటనలు చేస్తున్నారంట. ఆ ఎంపీ నివాసం , కార్యాలయం అన్ని అనంతపురంలో ఉండగా అక్కడ సడన్‌గా ఫోకస్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఫస్ట్ టైమ్ ఎంపీగా గెలిచిన అంబికా లక్ష్మీనారాయణ ఎందుకు సడన్ గా గుంతకల్లుపైనే ఎందుకు దృష్టి సారించారు?
బాలయ్య ఆశీస్సులతో ఎంపీగా గెలిచిన అంబికా లక్ష్మీనారాయణ
అనంతపురం టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతో చివరి నిమిషంలో సీటు సాదించుకున్నారు అంబికా లక్ష్మీనారాయణ. అనంతపురం పార్లమెంట్ ప్రజానీకానికి పెద్దగా పరిచయం లేనప్పటికీ టిడిపి సింబల్, బాలకృష్ణ ప్రధాన అనుచరుడు అన్న ట్యాగ్ లైన్, కూటమి వేవ్, అలాగే తన సామాజిక వర్గం అండతో ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు. కానీ అంబికా లక్ష్మీనారాయణకు ఎంపీగా గెలిచినప్పటికీ ఒక విధమైన అసంతృప్తి ఉందట.. అదేంటంటే జిల్లాలో కీలక నాయకులు అందరికీ తమకంటూ ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం ఉంది. దాన్ని కేంద్రంగా చేసుకొని ఒకవేళ ఇది లేకపోతే అది అన్నట్టు వారు చక్రం తిప్పుతున్నారు.
ప్రత్యేకంగా అసెంబ్లీ సెగ్మెంట్ లేని అంబికా లక్ష్మీనారాయణ
కానీ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు మాత్రం ఇంతవరకు ప్రత్యేకమైన నియోజకవర్గ లేకపోవడంతో ఇప్పుడు తన దృష్టి ఎంత పక్కనే ఉన్న గుంతకల్ నియోజకవర్గం పై పెట్టారట. గుంతకల్ నియోజకవర్గంపై దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం అక్కడ తన సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉండటమే అంటున్నారు. గుంతకల్లు నియోజకవర్గంలో అంబికా బంధువర్గం కూడా ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఎలాగైనా సరే గుంతకల్ నియోజకవర్గలో పట్టు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఒకప్పుడు అనంతపురం ఎంపీగా ఉన్న కాల్వ శ్రీనివాసులకు రాయదుర్గం నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. హిందూపురం ఎంపీ పార్థసారథి పెనుగొండ నియోజకవర్గంలో పట్టు పెంచుకున్నారు. అందుకే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు హిందూపురంలో పట్టు ఉన్నప్పటికీ అక్కడ నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉండడంతో తనకంటూ ప్రత్యేక నియోజకవర్గం ఉండాలని గుంతకల్లుపై ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తున్నారు
వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న గుమ్మనూరు జయరాం
మొదట్లో ఈ విషయంపై పెద్దగా ఆసక్తి చూపని అంబికా లక్ష్మీనారాయణ సంవత్సరం తిరిగేలోపు తన ఆలోచన విధానాన్ని మార్చుకొని గుంతకల్ నియోజకవర్గంలో ఎక్కువగా దృష్టి పెట్టారట… అందుకు కారణం కూడా లేకపోలేదు.. గుంతకల్లు ప్రస్తుత ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై వరుస వివాదాలు రావడం , అటు టీడీపీ అధిష్టానం కూడా ఒకింత జయరాంపై ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదీకాక మాజీ గుమ్మనూరు జయరాం వైసీపీ నుంచి కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చారు. ఆ క్రమంలో ఎప్పటికైనా గుమ్మనూరు ఫ్యామిలీ ఆలూరు పైనే ఎక్కువగా దృష్టి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్‌ను ప్రమోట్ చేసుకునే పనిలో జయరాం
ఆ గ్యాప్‌ని ఫిల్ చేసేందుకు అంబికా లక్ష్మీనారాయణ గుంతకల్లుపై దృష్టి పెట్టారట. అందులో భాగంగా వరుస వ్యక్తిగత పర్యటనలు చేస్తూ, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కువగా గుంతకల్ నియోజకవర్గంలో జరుపుతూ గుంతకల్లు ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారట.. అటు గుమ్మనూరు జయరాం కూడా గుంతకల్ నియోజకవర్గం లో అంటే ఎక్కువగా ఆలూరు పైనే ఫోకస్ పెట్టారట.. ఎక్కువగా పర్యటనలు ఆలూరులోనే చేస్తూ అక్కడే నిమగ్నం అయ్యారట.. గుంతకల్ నియోజకవర్గంలో ఎక్కువగా తన కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్‌ను తిప్పుతూ వారసుడి ప్రమోషన్ కోసం పావులు కదుపుతున్నారంట. కుమారుడి పొలిటికల్ ఫూచర్ కోసం అలెర్ట్ అయిన అంబికా లక్ష్మినారాయణ ఎక్కువగా గుంతకల్లు , గుత్తి మున్సిపాలిటీ, పామిడి మండలంలో ఎక్కువగా తన పర్యటనలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారంట. అంబికా ఒక్కరే కాకుండా తనతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడి యాదవ్‌నీ కూడా వెంట తీసుకెళ్తూ సొంత సామాజికవర్గంతో పాటు అందర్నీ ఆకట్టుకునే పనిలో పడ్డారంట. ఒక్క జులై నెలలోనే ఐదు రోజులపాటు గుంతకల్ నియోజకవర్గంలో పర్యటించడం ద్వారా తన ఉద్దేశాన్ని చాటి చెప్పారని గుంతకల్ పొలిటికల్ సర్కిల్లో బాగా టాక్ వినిపిస్తోంది.
Also Read: యనమలను పక్కన పెట్టేశారా? అసలేం జరిగింది..!
ఎంపీ వరుస పర్యటనలతో తేరుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎంపీ అంబికా ప్రతి పర్యటనలో ను తన కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్ వెంట ఉండేలా జాగ్రత్తపడుతున్నారట. గుంతకల్లు నియోజకవర్గంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎక్కడ పర్యటించినా కూడా పక్కనే గుమ్మనూరు ఈశ్వర్ ప్రత్యక్షమవుతుండటం ఆసక్తి రేపుతోంది. ఆ క్రమంలో అప్పుడే కుర్చీలాట మొదలయింది అని అనుకుంటున్నారు గుంతకల్ ప్రజలు.. ఏప్పుడో 2029లో జరిగే ఎన్నికల కోసం అంబికా ఇప్పటి నుంచే ప్లాన్ వేస్తుండడంతో గుమ్మనూరు కూడా అంతే స్థాయిలో రివర్స్ ప్లాన్ వేస్తున్నారన్న టాక్ నడుస్తోది.. చూడాలి మరి ఈ ఇద్దరి కుర్చీలాటలో ఎవరు గెలుస్తారో? ఎవరి తేలిపోతారో?
Story By Ajay Kumar, Bigtv