BigTV English

Giddalur Politics: గిద్దలూరు వైసీపీలో అయోమయం.. నాగార్జున ఫ్యూచర్ ఏంటి?

Giddalur Politics: గిద్దలూరు వైసీపీలో అయోమయం.. నాగార్జున ఫ్యూచర్ ఏంటి?

Giddalur Politics:గిద్దలూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిలకి సొంత పార్టీలోనే గడ్డు పరిస్థితి ఏర్పడిందట. గత ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాగార్జునరెడ్డి తిరిగి తనకు పట్టున్న మార్కాపురం వెళ్తానంటే జగన్ ఒప్పుకోవడం లేదంట. ఆయన చెప్పిన నియోజకవర్గానికి వెళ్లడానికి ఈయన ఇష్టపడటం లేదంట. అలాఅని తన మనసులోని మాటను అధిష్టానానికి గట్టిగా చెప్పలేక వారు చెప్పింది వినలేక మల్ల గుల్లాలు పడుతున్నారట. రెండువైపుల పట్టున్న రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన తన రాజకీయ భవిష్యత్తు అంధకారం కాబోతుందని ఆందోళన చెందుతున్నారంట. ఇంతకీ కుందులకు వచ్చి ఇబ్బంది ఏంటి? ఆ పరిస్థితి ఎందుకు తలెత్తింది?


2019లో గిద్దలూరు సెగ్మెంట్ కైవసం చేసుకున్న వైసీపీ

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం వైసీపీకి పట్టు ఉన్న నియోజకవర్గం. కాంగ్రెస్ తర్వాత వైసీపీ అక్కడ సత్తా చాటుకుంటూ వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన మెజార్టీని చూస్తే ఆ పార్టీ ఎంత బలంగా ఉండేదో అర్థమవుతుంది. పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి జగన్ తర్వాత గిద్దలూరులో అన్నా రాంబాబు రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజార్టీ సాధించిన నేతగా రికార్డులకు ఎక్కారు. కానీ 2024 ఎన్నికలలో సీను రివర్స్ అయింది. అభ్యర్థుల మార్పులు చేర్పులు ఫలితాలను తలకిందులు చేశాయి.


జగన్ తర్వాత అత్యధిక మెజార్టీ సాధించిన అన్నా రాంబాబు

2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయం సాధించిన అన్నా రాంబాబు 2014 ఎన్నికలలో టిడిపి నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికలలో వైసిపి నుంచి బరిలో దిగి జగన్ తర్వాత 81,000 కి పైగా అత్యధిక మెజారిటీ తో విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికలలో అన్నా రాంబాబును మార్కాపురం నియోజకవర్గానికి పంపిన వైసీపీ అధ్యక్షుడు జగన్ మార్కాపురంలో ఎమ్మెల్యేగా ఉన్న కుందూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరు నుంచి పోటీలో నిలిపారు.. అయితే వైసీపీకి పటున్న ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన నేత కొత్త కావడంతో ఓటమి పాలైంది.

గిద్దలూరుకు మార్చడంతో కుందుల భవితవ్యంపై నీలి నీడలు

తండ్రి కెపి కొండారెడ్డి, మామ ఉడుముల శ్రీనివాసరెడ్డిల రాజకీయ వారసుడిగారాజకీయాల్లోకి వచ్చిన కుందూరు నాగార్జున రెడ్డి తొలిసారి పోటీ చేసిన 2019 ఎన్నికలలో ధీటైన అభ్యర్థిపై విజయం సాధించి తన ఆగమనాన్ని ఘనంగా చాటారు. అయితే 2024 ఎన్నికలు వచ్చే సమయానికి కుటుంబపరంగా రెండు వైపులా పట్టున్న మార్కాపురం నియోజకవర్గాన్ని కాదని ఆయన్ని గిద్దలూరు నియోజకవర్గానికి పంపడంతో అతని రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు అలుముకున్నాయి. మార్కాపురంలో తన రాజకీయ వారసత్వం పరంగా మంచి పట్టు కలిగినప్పటికీ స్థానాన్ని మార్చడంతో తన విజయం దూరమైందనే ఆవేదన వ్యక్తమవుతోందంట .

ఇష్టం లేని పని కష్టంగా మారిందంటున్న నాగార్జునరెడ్డి వర్గం

తనకు పట్టులేని గిద్దలూరుకు మార్చడంతో ఆయన పరిస్థితి అయోమయంగా మారిందట.. ఇష్టం లేని పనిచేయడం ఎంత కష్టమో నాగార్జున రెడ్డి పరిస్థితి కూడా అలాగే తయారైందంట. కనీసం మండలాల వారీగా ముఖ్య నాయకులను కూడా కలవడం, లేదా వారు కలిస్తే కలివిడిగా మాట్లాడటం కూడా కష్టంగానే ఉందట… కనీసం క్యాడర్ అవసరమైనప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోను లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారనే ప్రచారం జోరు అందుకుంటోంది. తనకు పట్టులేని చోట కష్టపడే కంటే పట్టున్నచోట పాటుపడడమే మేలని ఆలోచనలో నాగార్జున రెడ్డి ఉన్నారట.. ఇప్పటికైనా అధినేత ఆలోచించి తనకు మార్కాపురం కేటాయిస్తే విజయాన్ని అధ్యక్షుడికి కానుకగా ఇస్తానని తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారంట. కానీ ఆ విషయాన్ని జగన్‌కు చెప్పే ధైర్యం మాత్రం ఎవరికీ చాలటం లేదట… ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ గిద్దలూరు నియోజకవర్గం కూడా అతనికి దక్కదనే ప్రచారం జరుగుతుండటం గమనించాల్సిన విషయం

గిద్దలూరు పేరు చెప్తే గుర్తుకు వచ్చే పిడతల కుటుంబం

గిద్దలూరు నియోజకవర్గం పేరు చెప్పగానే రాజకీయ నేతలకు గుర్తొచ్చే పేరు పిడతల రంగారెడ్డి ఆయన వారసులు. మూడుసార్లు మంత్రిగా పనిచేసిన పిడతల రంగారెడ్డి తరువాత ఆయన కుటుంబ సభ్యులు కూడా అదే స్థాయిలో రాజకీయాలలో నిలదొక్కుకున్నారు. పిడతల కుటుంబం.. గిద్దలూరు నియోజకవర్గంలో బలమైన రాజకీయ కుటుంబం. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి 2009 వరకు పిడతల కుటుంబం పోటీలో లేకుండా ఎన్నికలు జరగలేదంటే వారికి స్థానికంగా ఉన్నపలుకుబడి అర్ధమవుతుంది. పార్టీ ఏదైనా పిడతల కుటుంబం పోటీ చేయటం పరిపాటిగా ఉండేది.

జగన్ సన్నిహితుడైన పిడతల ప్రవీణ్‌కుమార్ రెడ్డి

గిద్దలూరు నియోజకవర్గంలో అత్యధిక సార్లు విజయం సాధించి, మంత్రిగా చేసిన ఘనత కూడా ఆ కుటుంబానికే దక్కింది.. అయితే 2009 తర్వాత వారి రాజకీయ ప్రభ మసకబారింది.. నేరుగా పోటీలో నిలబడే నేతలు లేక కొంత వెనకంజ వేశారు. అయితే నేడు మాత్రం వైసీపీలో ఆ కుటుంబం నుంచి వచ్చిన, జగన్ సన్నిహితుడైన పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో కొత్త రాజకీయానికి తెర తీశారంట. వైసీపీ నేతలను కలుపుకుపోవటంలోనూ, స్వయంగా వెళ్లి కలవడంలోనూ తనదైన చాతుర్యాన్ని వాడుతూ నలుగురిలో గుర్తింపును తెచ్చుకుంటున్నారట.. నియోజకవర్గంలో తన పట్టు చాటుకోవటానికి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారట.. నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఎటువంటి ఇబ్బంది వచ్చిన నేనున్నానంటూ ముందుకు సాగుతూ కేడర్ కు అందుబాటులో ఉంటున్నారంటున్నారు.

మొక్కుబడిగా గిద్దలూరు కార్యకర్తలను కలుస్తున్న నాగార్జునరెడ్డి

దీంతో ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడవు అన్నట్లు అటు ఇష్టం లేని నాగార్జున రెడ్డి.. ఇటు పాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కలుపుకుపోతున్న ప్రవీణ్ కుమార్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయిందట.. దీంతో రానున్న రోజుల్లో గిద్దలూరు నియోజకవర్గం ఎవరి చేతుల్లో ఉండబోతుందని వైసీపీ శ్రేణులు ఇప్పటి నుంచే తెగ చర్చించుకుంటున్నాయి. వైసీపీ ఇన్చార్జిగా కొనసాగుతున్న నాగార్జున రెడ్డి మొక్కుబడిగా కార్యకర్తలతో కలుస్తుండగా, బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి అందరికీ తలలో నాలుకగా ముందుకు సాగుతుండటం ఆ పార్టీలో చర్చకు తెరలేపుతుందట..

Also Read: పాక్ పరేషాన్ ఫోర్స్..! చైనా సపోర్ట్‌‌తో మునీర్ కొత్త ప్లాన్..?

రానున్న ఎన్నికల నాటికి ఎవరు ప్రజాక్షేత్రంలో నిలబడతారు అనే చర్చ ఇప్పటి నుండే ఆ నియోజకవర్గంలో జోరందుకుందట.. ఇష్టం లేని నియోజకవర్గ కంటే పట్టున్న నియోజకవర్గమే మేలని ఆలోచనలో నాగార్జున రెడ్డి ఉన్నప్పటికీ మార్కాపురం అతనికి దక్కేనా లేక గిద్దలూరు అయినా మిగిలేనా? అని ఆయన అనుచరులే గుబులు చెందుతున్నారు. మొత్తానికి రెండువైపులా పట్టున్న రాజకీయ కుటుంబాల నుండి వచ్చిన నాగార్జున రెడ్డి రాజకీయ భవితవ్యం అటు మార్కాపురం, ఇటు గిద్దలూరుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Story By Ajay Kumar, Bigtv

Related News

Pakistan Army: పాక్ పరేషాన్ ఫోర్స్..! చైనా సపోర్ట్‌‌తో మునీర్ కొత్త ప్లాన్..?

Congress: భయపెడుతున్నాడా! పార్టీ మారుతాడా! రాజగోపాల్ లెక్కేంటి?

AP Politics: బిగ్‌బాస్ జగనే! బీజేపీ దూకుడుకు రీజనేంటి?

AP Politics: గుంతకల్లు టీడీపీలో కుర్చీలాట..

TDP Politics: యనమలను పక్కన పెట్టేశారా? అసలేం జరిగింది..!

Big Stories

×