YCP Leaders: ఆ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం ఎవరికీ అంతుపట్టడం లేదంట. మాకే ఎందుకు ఈ తలనొప్పులు అంటూ క్యాడర్ గగ్గోలు పెడుతుందట. ముక్కు మొహం తెలియని వారిని ఎన్నికల ముందు తీసుకొచ్చి పోటీలో నిలబెట్టడం వారికోసం తాము అష్ట కష్టాలు పడటం కామన్‌గా మారిందని పార్టీ శ్రేణులు వాపోతున్నాయంట. ఆ క్రమంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి అసలు పార్టీలో ఉన్నాడో లేడో అని డౌట్ క్యాడర్ లోనే వ్యక్తమవుతుంది. తాము ఇబ్బందులు పడుతున్నా ఆయన పట్టించుకోవడంలేదని.. అసలీ పరిస్థితికి కారణం పెద్దిరెడ్డి కుటుంబమే అని పార్టీ వర్గాలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గమేది?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గం ఓటర్ల తీర్పు ఎప్పుడూ విలక్షణంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్‌తో పాటు కమ్యునిస్టులను కూడా ఆదరించారు అక్కడి ఓటర్లు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983 నుంచి 2024 వరకు మదనపల్లిలో పది సార్లు ఎన్నికలు జరిగితే ఆరుసార్లు టీడీపీ. రెండు సార్లు కాంగ్రెస్ , రెండు సార్లు వైసీపీకి పట్టకట్టారు. వైసీపీ స్థాపన తర్వాత 2014, 19 ఎన్నికల్లో వైసీపీ వరుస విజయాలు సాధించి మదనపల్లిని కంచుకోటగా మార్చుకుంది.
అయితే గత ఎన్నికల్లో 5 వేల 500 ఓట్ల నామమాత్రపు తేడాతో వైసీపీ పరాజయం పాలైంది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి గాలి వీచినప్పటికీ అక్కడ వైసీపీ అంత గట్టి పోటీ ఇచ్చిందంటే కేడర్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. మైనార్టీ ఓటర్లతో పాటు పార్టీ క్యాడర్ సైతం విస్తారంగా ఉండడమే అందుకు కారణమన్న అభిప్రాయం ఉంది. ఆ క్రమంలో అభ్యర్ధి విషయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ తీసుకున్న నిర్ణయమే ఓటమికి కారణమన్న అసంతృప్తిని వైసీపీ కార్యకర్తలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు.
ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం.. మదనపల్లిలో వైసీపీ అంత బలంగా ఉన్నప్పటికీ కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ పెద్దలు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని వైసీపీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.. ప్రతిసారి ఎన్నికల ముందు ముక్కు మొహం తెలియనటు వంటి వారిని నియోజకవర్గంలో దించడం.. అభ్యర్థులుగా నిలబెట్టడమే అందుకు కారణమంట. 2014లో జరిగిన ఎన్నికలలో మదనపల్లి నుంచి టిడిపి పోటీ చేయలేదు. అప్పుడు పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీటు కేటాయించింది. వైసీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి విజయం సాధించారు.
2019 ఎన్నికలలో నవాజ్ భాషా వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక మొన్నటి ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్‌బాషాకి చెక్ పెట్టి అయన స్థానంలో రిటైర్ పంచాయతీ రాజ్ ఉద్యోగి అయిన నిస్సార్ అహ్మద్‌ను పోటిలో దింపారు పార్టీ పెద్దలు. అయితే నవాజ్‌భాషా , నిస్సార్అహ్మద్‌లు ఇద్దరు ఎన్నికల ముందు వరకు పార్టీకి కొత్త ముఖాలే. ఎప్పుడూ వైసీపీ కార్యక్రమాలలో పాల్గొనలేదు. పార్టీకి పనిచేయలేదు. ప్రైవేట్ బస్ ట్రావెల్స్ యజమాని అయిన నవాజ్‌బాషా ఓవర్‌నైట్ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యే అయ్యారు.
Also Read: సార్ల గురువు.. సాములోరు.. హిమాలయాలకు జంప్
గత ఎన్నికల్లో ఆర్థికంగా స్థితిమంతుడైన నిస్సార్ అహ్మద్ టికెట్ దక్కించుకున్న ఓటమి చవిచూశారు. అయితే ప్రతి ఎన్నికల్లో అభ్యర్థిని మార్చడం వెనుక పెద్దిరెడ్డి కుటుంబమే ఉందని వారి నిర్ణయాలు వల్లే తాము రోడ్డున పడుతున్నామటూ మదనపల్లి క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెలుపోటముల సంగతి అటు ఉంచితే ప్రస్తుతం మదనపల్లి వైసీపీ కేడర్ తీవ్ర అసహనంతో కనిపిస్తుంది. 2019లో నవాజ్ భాషను గెలిపించినప్పటికీ.. ఆయన తన విజయానికి కృషి చేసిన పార్టీ క్యాడర్‌ను పట్టించుకోకుండా సొంత వర్గానికే పెద్ద పీట వేశారన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చాయి… నవాజ్ బాషా తీరు వల్ల చాలామంది పార్టీకి దూరంగా వెళ్లిపోయినప్పటికీ పార్టీ పెద్దలుమాత్రం పట్టించుకోలేదు.
తీరా ఎన్నికల ముందు మరో కొత్త మొహామైన నిసార్ అహ్మద్‌ను తెరపైకి తీసుకొని వచ్చే ఆయనే అభ్యర్థి కష్టపడి పని చేసి గెలిపించండి అంటూ చెప్పుకొచ్చారు. అసంతృప్తి ఉన్నప్పటికీ పార్టీ చెప్పింది కదా అని పనిచేశామని తీరా ఎన్నికల్లో ఓటమి చెందాక అసలు నిస్సార్ అహ్మద్ అనే వ్యక్తి ఒక్కరోజు కూడా బయటకు రాలేదని కార్యకర్తలు నిప్పులు చెరుగుతున్నారు. అసలు ఆయన పార్టీలో ఉన్నాడా లేదో తెలియని పరిస్థితి ఏర్పడిందని.. ఓవైపు అధికార పార్టీ నేతలు వైసీపీ వారి మీద కేసులు పెడుతున్నా, బెదిరింపులు దిగుతున్నా నిసార్ అహ్మద్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దానికంతటికీ కారణం రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డే అని మరి కొందరు మదనపల్లి వైసీపీ సీనియర్ నేతలు చెప్పకొస్తున్నారు. ప్రతిసారి ఎన్నికల ముందు ముక్కు మొహం తెలియని వారికి సీటు ఇవ్వడం వారిని గెలిపించమని చెప్పడం పెద్దిరెడ్డి కుటుంబానికి అలవాటుగా మారిందని.. జగన్ కూడా వారి చెప్పినట్లే నిర్ణయాలు తీసుకుని తమను ముంచారని పార్టీ వర్గాలు వాపోతున్నాయి. ఓటమి తర్వాత అటు నిసార్ అహ్మద్ మాయమైపోతే.. పెద్దిరెడ్డి ఫ్యామిలీ కూడా తమను పట్టించుకోవడంలేదని తెగ ఫైర్ అవుతున్నారు. 2019లో గెలిచిన నవాజ్ భాషా కూడా పెద్దిరెడ్డి అనుచరులకు మాత్రమే పనులు చేసిపెట్టారని.. మిగిలిన పార్టీ క్యాడర్‌ను ఎవరూ లెక్కచేయడం లేదని మండిపడుతున్నారు.
పార్టీ జెండా మోసిన వాడిని కాదని ఆఖరి నిమిషంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ తమ వారిని అభ్యర్థిగా పెట్టడం వాళ్ళు ఎన్నికల తర్వాత అడ్రస్ లేకుండా పోవడం పరిపాటిగా మారిందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమకు పెద్దిరెడ్డితో సంబంధం లేని కొత్త ఇన్చార్జ్ కావాలనే డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారు. ఆ క్రమంలో అలా మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి పేరు గట్టిగానే స్థానిక నేతలు ప్రతిపాదిస్తున్నారంట. ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి కూడా కొందరు నేతలు తీసుకువెళ్లినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో సైతం తిప్పారెడ్డి పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని.. ముక్కు మొహం తెలియని వ్యక్తిని అభ్యర్థిగా పెట్టడం వల్లే ఐదు వేల ఓట్లతో ఓడిపోవలసి వచ్చిందని కార్యకర్తలు అంటున్నారుఇప్పటికైనా మదనపల్లె విషయంలో ఇన్చార్జి విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే రానున్న రోజుల్లో పార్టీ మనుగడే కష్టమని హెచ్చరిస్తున్నారు.