Tekkali Politics: టెక్కలి నియోజకవర్గం టిడిపి కంచుకోట. ఈ కంచుకోట ను బద్దలు కొట్టడమే వైసిపి అధ్యక్షుడు జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. టెక్కలిలో అచ్చెన్నాయుడిని ఓడించడానికి మాజీ సీఎం అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ పార్టీలో కుమ్ములాటలు జగన్ ఆశలను అడియాశలు చేస్తూ వస్తున్నాయి. అయితే మూడుముక్కలాటలా ఉండే టెక్కలి వైసీపీ వర్గాలు ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇకనైనా జగన్ వ్యూహం ఫలిస్తుందా? వచ్చే ఎన్నికల నాటికి టెక్కలి వైసీపీలో అదే ఐక్యత కొనసాగుతుందా?
వైసీపీకి కొరుకుడు పడకుండా తయారైన అచ్చెన్నాయుడు
తెలుగుదేశం పార్టీలో అత్యధిక ప్రాధాన్యం ఉన్న నేతల్లో మంత్రి అచ్చెన్నాయుడు ఒకరు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భావం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు ఆ పార్టీకి కొరకరాని కొయ్యలా తయ్యారయ్యారు. వైసీపీలో కుమ్ములాటలతో కింజరాపు కుటుంబానికి టెక్కలి కంచుకోటలా మారింది. వైసీపీ అధినేత జగన్ ఎన్ని వ్యూహాలు రచించినా ఆ కంచుకోటను కదిలించలేకపోతున్నారు. అయితే ఇప్పుడు కొద్దిగా పరిస్థితి మారుతున్నట్టు కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అచ్చెన్నాయుడు మాస్ ఫాలోయింగ్‌తో ఓడిపోయిన వైసీపీ
2024 ఎన్నికలకు ముందు టెక్కలి వైసీపీలో మూడు వర్గాల మధ్య పోరుతో మూడు ముక్కలాట నడిచింది. ఓ వైపు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మరోవైపు దువ్వాడ శ్రీనివాస్, ఇంకోవైపు పేరాడ తిలక్… ఇలా ఎవరి దారి వాళ్లది అన్నట్టు ఉండేవారు. దీంతో పార్టీ క్యాడర్ ఎవరితో నడవాలో అర్థమయ్యేది కాదు. వైసీపీలోని ఈ వర్గ విభేదాలే అచ్చెన్నాయుడుకి శ్రీరామరక్షలా మారాయి. అయితే ఎన్నికలకు ముందు కిల్లి కృపారాణి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వైసిపి బలం కొంతమేర తగ్గినట్టు అనిపించినా.. చాలావరకు వర్గ పోరు తగ్గిందని భావించారు ఆ పార్టీ శ్రేణులు. కానీ అచ్చెన్నాయుడు మాస్ ఫాలోయింగ్ ముందు వైసిపి మరోసారి ఓడిపోయింది. దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ మధ్య వర్గ పోరు కూడా వైసిపి ఓటమికి మరో కారణమని చెప్పాలి.
వైసీపీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్
కొన్ని నెలల క్రితమే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. కారణం ఏదైనాప్పటికీ అధిష్టానం మంచి నిర్ణయమే తీసుకుందని చాలామంది భావించారు. ఈ నిర్ణయంతో పార్టీలో ఉన్న వర్గపోరుకు చెక్ పడుతుందని క్యాడర్ భావించింది. దువ్వాడను సస్పెండ్ చేసిన తర్వాత పేరాడ తిలక్ కు జగన్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. కానీ తిలక్ వెంట నడవడానికి సెకండ్ కేడర్ ఎవరు అంగీకరించలేదనే టాక్ ఉందట. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు వ్యవహరిస్తున్నారట. సంతబొమ్మాలి మండలంలో ఆర్థికంగా బలంగా ఉన్న ఓ నేత తానే ఇంచార్జ్ అన్నట్టు తన కార్యక్రమాలు తను చేసుకుంటూ పోయేవారు. తిలక్‌తో కలిసి ఏ కార్యక్రమానికి హాజరయ్యేవారు కాదు. ఇలాంటి వాళ్లు నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. కానీ వాళ్లందరికీ మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఒక్క మాటతో చెక్ పెట్టారంట
పార్టీలో ఉండాలంటే తిలక్‌తో కలిసి నడవాలని ఆదేశం
అధిష్టాన నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని వైసీపీ అధిష్టానం స్పష్టం చేసిన పరిస్ధితి. పార్టీలో ఉండాలనుకునేవాళ్లు తిలక్ తో కలిసి నడవాలని బొత్స స్పష్టం చేశారంట. ఇష్టం లేని వాళ్ళు పార్టీని వదిలేయవచ్చని గట్టిగానే చెప్పారనే చర్చ నడుస్తోంది. పార్టీ ఇచ్చిన వార్నింగ్ తో టెక్కలిలో సెకండ్ క్యాడర్ నాయకత్వం అంత అలర్ట్ అయిందట. ఆ తరువాతే జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి దాదాపు వైసిపి శ్రేణులంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి దువ్వాడ వాణి కూడా వెళ్లారు.
Also Read: జగన్ కార్ యాక్సిడెంట్.. పోలీసుల అనుమానాలు ఇవే
తిలక్‌పై అసంతృప్తితో ఉన్న టెక్కలి వైసీపీ శ్రేణులు
ప్రస్తుతానికైతే టెక్కలి వైసిపి క్యాడర్ మొత్తం పేరాడ తిలక్ వెంటే నడుస్తోంది. కానీ.. చాలామందిలో అసంతృప్తి ఉందన్నమాట మాత్రం వాస్తవమంటున్నారు. అయితే ఇంకా ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉంది. అందరూ ఒకే మాట మీద ఉండాలని అధిష్టానం నుంచి బలమైన ఆదేశాలు వచ్చాయి. కాబట్టి కలిసే ఉన్నామని సంకేతాలు ఇవ్వడంలో తప్పు లేదని సెకండ్ కేడర్ భావిస్తుంది. కానీ ఎన్నికల దగ్గర పడితే మాత్రం వర్గ పోరు మరోసారి బయటపడే అవకాశం ఉందంటున్నారు. ఏది ఏమైనా టెక్కలిలో జెండా పాతాలన్న జగన్ కల సాకారం కావడం అంత సులభం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Story By Apparao, Bigtv