అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ కుటుంబంపై చేసిన భూదోపిడీ ఆరోపణలపై హరీశ్ రావు స్పందించారు. అసలు కేసీఆర్‌కు సొంత ఇల్లే లేదన్నారాయన. ఆయనపై ఇలా విమర్శలు, ఆరోపణలు చేయడం తగునా? అని సీఎంపై ధ్వజమెత్తారు.
ఫామ్‌హౌజ్ ఆయన సొంతంగా తీసుకున్నారని, హైదరాబాద్‌లో చిన్న ఇల్లు మాత్రమే ఉందని, అది కూడా ఉద్యమ సమయంలో కట్టుకున్నదేనన్నారు. కానీ అందులో పార్కింగ్ కూడా లేదని, స్టాఫ్‌కు కూడా సరిపోదని హరీశ్ అన్నారు.కేసీఆర్ పుట్టడమే వందల ఎకరాలు కలిగిన ఉన్నత కుటుంబంలో పుట్టారని హరీశ్ అన్నారు.
కేసీఆర్‌పై చేసిన భూ కుంభకోణం, భూ దోపిడీ పచ్చి అబద్దమని చెప్పిన హరీశ్ రావు.. ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసేందుకు సిద్దమైన కేసీఆర్. ఇలా కక్కుర్తి పడి భూములను దోచుకునే స్థాయి ఆయనది కాదన్నారాయన. ఎమ్మెల్సీ నవీన్‌రావుకు కేసీఆర్‌కు అసలు రక్త సంబంధమే లేదని, వెలమ కులం అయితే చాలు.. కేసీఆర్‌కు సంబంధం అంటగట్టి.. భూ దోపిడీ చేశారని అనడం సిగ్గుచేటన్నారు.
అసెంబ్లీలో తమపై సీఎం ఆరోపణలు చేస్తున్న సమయంలోనే ఆయన సొంత ఊరు కల్వకుర్తి నుంచి చాలా మంది ఫోన్లు చేసి రేవంత్, అతని సోదరులు దోచుకున్న భూముల వివరాలను పంపారని అన్నారు. ఒక్క గంటలోనే 308 ఎకరాల భూమిని కొల్లగొట్టారని డాక్యుమెంట్లు కూడా తనకు పంపారని, ఇంకా లోతుగా పరిశీలిస్తే ఎన్ని వందల ఎకరాల భూముల వివరాలు బయటపడతాయోనని అన్నారు హరీశ్ రావు.
ఫ్యూచర్ సిటీ పేరుతో మొత్తం అక్కడి భూములను కబ్జా చేసుకున్నది మీరేనని అంతా కోడై కూస్తున్నారని, ఇక దీనిపై తాము దృష్టి పెడతామని, ఇక నిత్యం ఇదే పనిలో ఉండి.. మీ సోదరుల భూదోపిడీని బయటపెడతామని అన్నారు హరీశ్ రావు.
ఫామ్‌హౌజ్‌ను కేసీఆర్ వెయ్యి ఎకరాల్లో కట్టుకున్నారని గతంలో ఆరోపించిన సీఎం.. ఇప్పుడు వందల ఎకరాలకు దిగారని, అతని మాటలకు పొంతన లేదని, పచ్చి అబద్దాలు ఆడే సీఎంగా ప్రజలు ఏనాడో గమనించారని విమర్శించారు హరీశ్ రావు.
మా పదేళ్ల పాలనలో భూదోపిడీపై , మీ పాలనలో భూదోపిడీపై సుప్రీం కోర్టు సిట్టింగు జడ్జితో విచారణ చేపించే దమ్ము మీకుందా…? అని సీఎంకు సవాల్ విసిరారు హరీశ్. తనపై వచ్చిన భూ అక్రమాల ఆరోపణలపై మీడియాకు వివరణ ఇచ్చారు. 22 ఏ నిషేధ జాబితాను బయటపెట్టి బీఆర్‌ఎస్ సక్సెసయ్యిందని, స్వయానా సీఎం అసెంబ్లీ సాక్షిగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారని అన్నారు హరీశ్ రావు. తన సొంత ఇంటిని ఈ జాబితా నుంచి తొలగింపజేసుకున్న సీఎం.. ప్రజల ఆస్తులను ఎందుకు తొలగించడం లేదని ఆయన ప్రశ్నించారు. మా పోరాటం దాని కోసమేనని, దీనిపై ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని అన్నారు.