Congress Working: స్వేచ్ఛ బ్యూరో: అధికార కాంగ్రెస్ పార్టీలోని వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు పుల్ డిమాండ్ ఉన్నది. భవిష్యత్తులో పీసీసీ అధ్యక్ష పదవికి మార్గం సుగమం చేసుకోవచ్చనే వ్యూహంతో సీనియర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ పదవుల కోసం తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. ఇప్పటికే న్యూఢిల్లీ వేదికగా హైకమాండ్ వద్ద ఏఐసీసీ నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ స్క్రీనింగ్ ప్రక్రియ ఆఖరి దశకు చేరుకుంది. ఈ నెలాఖరు నాటికి వర్కింగ్ ప్రెసిడెంట్ల పేర్లను అధిష్టానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
వాస్తవానికి పార్టీ పవర్ లో ఉన్న తరుణంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ దక్కించుకోని, భవిష్యత్ తో పీసీసీ చీఫ్ కు ప్లాన్ చేయొచ్చని కొందరు లీడర్లు భావిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించే నాయకుడికి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నెట్‌వర్క్‌ను, సంస్థాగత వ్యవహారాలను నేరుగా పరిశీలించే అవకాశం లభిస్తుంది. అధిష్టానంతో నేరుగా సంబంధాలు నెలకొల్పు కోవడంతో పాటు, రాబోయే రోజుల్లో పీసీసీ పీఠాన్ని అధిరోహించేందుకు ఇది సరైన వేదికగా మారుతుందనే ది ఆశావహుల ప్రధాన అంచనా.. ఈ నేపథ్యంలోనే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పార్టీలోని ఈ కీలక పదవి కోసం ట్రై చేయడం గమనార్హం. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీకి ఆరు వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రకటించాలని ఏఐసీసీ ఆలోచిస్తున్నది.
తెలంగాణ కాంగ్రెస్ చరిత్రను పరిశీలిస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన వారే ఆ తర్వాతి కాలంలో పీసీసీ అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టడం గమనార్హం. 2014–2015 సమయంలో పొన్నాల లక్ష్మయ్య పీసీసీ చీఫ్ గా వ్యవహరించగా, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేశారు. ఆ తర్వాత 2015లో ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఎంపికై, 2021 వరకు పనిచేశారు. ఈ సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మల్లు భట్టి విక్రమార్క, రాఘువీర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, అజారుద్దీన్,గీతారెడ్డి, మహేష్ కుమార్ లు పనిచేశారు. ఇక 2021లో రేవంత్ రెడ్డి టీపీసీసీచీఫ్ గా బాధ్యతలు తీసుకోగా, మహేష్ కుమార్ గౌడ్ , జగ్గారెడ్డి, అజారుద్దీన్ గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ లు వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా ఉన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోగానే టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఎంపికై దాదాపు రెండేళ్ల పాటు పనిచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేసిన వారి నుంచే హైకమాండ్ టీపీసీసీ చీఫ్ ను ఎంపిక చేస్తున్నది. ఈక్రమంలోనే ఈ పోస్టుకు భారీగా డిమాండ్ ఏర్పడింది.
Also read: ఇదేందయ్యా ఇది.. 21 వేల పానీపూరీలతో 13 అడుగుల గణపతి.. వీడియో వైరల్
కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తమ పనితనాన్ని నిరూపించుకున్న నాయకులకే తదుపరి పీసీసీ పీఠం దక్కిందనడానికి గత మూడేళ్ల పరిణామాలు స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంతేగాక పనితీరును నిరూపించుకునేందుకు కూడా ఈ పోస్టు క్రియాశీలకంగా ఉపయోగపడుతుంది. పొన్నాల లక్ష్మయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సమర్థవంతంగా పనిచేసి,ఆ తర్వాత ఏకంగా ఆరేళ్ల పాటు పీసీసీ అధ్యక్షుడిగా సేవలు అందించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఛాన్స్ లభించింది.
ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి టీమ్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేరి, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడై.. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉంటూ మహేష్ కుమార్ గౌడ్ సంస్థాగత నిర్మాణంలో కీలక ప పోషించారు. ఆ అనుభవంతోనే రేవంత్ రెడ్డి తర్వాత పీసీసీ అధ్యక్ష బాధ్యతలను మహేష్ కుమార్ గౌడ్ స్వీకరించారు.ఈ సక్సెస్ ఫార్ములానే ఇప్పుడు ఎమ్మెల్యేలు,ఎంపీలలో తీవ్ర ఆశలు రేకెత్తిస్తోంది.సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత (తెలంగాణ దక్షిణ, ఉత్తర ప్రాంతాలు),రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో నేతలు పోటీ పడుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలు వారీగా ప్రయత్నించడం గమనార్హం.
వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల కోసం ఎంపీ బలరామ్ నాయక్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పద్మావతి రెడ్డి లతో పాటు మరి కొంత మంది ప్రయత్నిస్తునట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఇక మొన్నటి వరకు ఈ పోస్టుల కోసం ప్రయత్నించిన ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డిలకు ఆలెడ్రీ ఇతర పార్టీ పదవులు ఉన్న నేపథ్యంలో హైకమాండ్ ఈ పోస్టులకు ఎంపిక చేస్తుందా? లేదా? అనేది సస్పెన్స్ గా ఉన్నది. అంతేగాక మైనార్టీ కోటాలో ఫయిమ్ ఖురేషీ ప్రయత్నిస్తున్నారు. అంతేగాక అంజన్ కుమార్ యాదవ్, సునీతరావు, రోహిన్ రెడ్డి, బెల్లయ్య నాయక్, రామచంద్రనాయక్ లుకూడా తమ ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు.
Also read: మహిళలకు గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ కుట్టు మిషన్ దరఖాస్తు గడువు పొడిగింపు!