KCR Scams: అప్పు లిమిట్ అయిపోయింది. అప్పుడు లూప్ హోల్స్ వెతికి ఇంకింత అప్పులు చేస్తుంటారు. సరిగ్గా గత కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇదే చేసింది. FRBM ప్రకారం లిమిట్ అయిపోతే.. కొత్తగా కేవలం అప్పుల కోసమే కార్పొరేషన్లు సృష్టించి ఎడా పెడా బాకీలు తెచ్చింది గత కేసీఆర్ సర్కార్. ఇప్పుడు అవి గుదిబండగా మారాయి. అప్పుల కుప్పగా అయ్యాయి. అందుకే వాటిలో ఏవి ఉండాలో ఏవి ఊడాలో డిసైడ్ చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
అప్పులు చేయడంలో గత ప్రభుత్వం తప్పులే తప్పులు
అప్పు చేయడం తప్పు కాదు.. అవసరం ఉన్నప్పుడు చేయాల్సిందే. అవసరాలు తీర్చుకోవాల్సిందే. అంతే బాధ్యతగా తిరిగి చెల్లించాల్సిందే. ఇదే చాణక్యనీతి చెబుతున్న మాట. కానీ తాహతుకు మించి చేసే అప్పులు పెను నష్టాన్ని కలిగిస్తాయి. గత కేసీఆర్ ప్రభుత్వం ఇదే చేసింది. దొరికిన చోటల్లా అప్పులు చేసింది. అభివృద్ధి చేయడానికే అప్పులు చేశామన్న మాట ఆనాడు వినిపించారు. కానీ మార్కెట్లో ఉన్న వడ్డీల కంటే అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావడం ఒక తప్పు.
కేవలం అప్పుల కోసమే కార్పొరేషన్లు సృష్టించి ఎడా పెడా బాకీలు చేయడం మరో తప్పు. అసలు తీర్చగలిగే రెవెన్యూ జెనరేషన్ కూడా లేని వాటితో భారీగా అప్పులు చేయించడం మరో తప్పు. తమ పాలనా కాలంలో తీర్చలేక తర్వాతి ప్రభుత్వంపై నెట్టేయడం ఇంకా పెద్ద తప్పు.
గత ప్రభుత్వం చేసిన నష్టాలకు పుల్ స్టాప్ పెట్టే యత్నం
అప్పులు తప్పులు చేస్తూ వెళ్లిన గత సర్కార్ చర్యలకు ఎక్కడో ఓ చోట పుల్ స్టాప్ వేయాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే చేస్తోంది. అప్పుల కుప్పగా మారిన కార్పొరేషన్ల లిస్టు రెడీ చేసింది. ఏవి సొంతంగా రెవెన్యూ జెనరేట్ చేసుకుని లాభాల్లో ఉన్నాయి.. ఏవి నిండా మునిగాయో లిస్టు రెడీ చేసింది. ఆ ప్రకారంగా వాటిని మూసేసేందుకు సిద్ధమవుతోంది. నిజానికి ప్రభుత్వ ఖజానాను ఫుట్ బాల్ మాదిరి ఆడుకోవడం కరెక్ట్ కాదు.
ఇది మన సొమ్ము కాదు ఏదైనా చేసేద్దాం.. ఎంతైనా అప్పులు తెచ్చేద్దాం అన్న ధోరణులు పెరగడమే ఈ అప్పుల కుప్పకు కారణం. సో వీటిని సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేసే బాధ్యతను రేవంత్ ప్రభుత్వం భుజానికెత్తుకుంది. అనవసర ఖర్చులు తగ్గిస్తోంది. దుబారా జరగకుండా చూసుకుంటున్నారు. అందులో భాగంగా గుదిబండగా ఉన్న కార్పొరేషన్ల ఖేల్ ఖతం చేయబోతున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల బలోపేతంపై ఫోకస్
రాష్ట్రంలో చాలా కార్పొరేషన్ల పరిస్థితి దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లుగా తయారైంది. సో వాటికి చెక్ పెట్టేలా లిస్ట్ రెడీ చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ నిధులు వృధా అవుతూ ఎలాంటి ఉపయోగం లేని వాటికి గుడ్ బై చెప్పబోతోంది. అందులోని ఉద్యోగులను ఇతర సంస్థల్లో విలీనం చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. అటు ఎస్సీఎస్టీబీసీ కార్పొరేషన్లను మరింత బలోపేతం చేయడం, రెవెన్యూ ఎక్కువ జెనరేట్ చేస్తున్న వాటికి మరింతగా బూస్టప్ ఇచ్చేలా రేవంత్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది.
తెలంగాణలో 90కి పైగా కార్పొరేషన్లు
తెలంగాణలో ప్రస్తుతం 90కి పైగా కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో ఐదారు తప్ప మిగతా కార్పొరేషన్లకు ఎలాంటి ఇన్ కమ్ లేదు. కేవలం నామ్ కే వాస్తేగా నడుస్తున్నాయి. ఇందులోనూ ఎక్కువ కార్పొరేషన్లు రాజకీయ నిరుద్యోగుల పదవుల భర్తీ కోసం, ప్రభుత్వానికి అప్పులు తెచ్చి పెట్టేందుకు మాత్రమే ఉపయోగపడ్డాయి. సో ఓవరాల్ గా చూస్తే కార్పొరేషన్ల ద్వారా గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పులు 2 లక్షల 82వేల 84 కోట్లుగా ఉంది. ఇది మొత్తం తెలంగాణ రాష్ట్ర అప్పులో 42 శాతంగా ఉందంటే ఏ స్థాయి కుప్ప జమైందో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ హామీ ఇచ్చి తీర్చాల్సినవి 1,27,208 కోట్లు
ఇందులో ప్రభుత్వం హామీ ఇచ్చి, తీర్చాల్సిన అప్పులు ఒక లక్షా 27 వేల 208 కోట్లుగా ఉంది. అలాగే గత ప్రభుత్వ షూరిటీలతో అప్పులు తీసుకుని, వాటిని తీర్చే బాధ్యత కార్పొరేషన్ల మీద ఉన్నవి 95 వేల 462 కోట్ల రూపాయలు. అంతే కాదు ఇవన్నీ చాలవన్నట్లుగా కార్పొరేషన్లు సొంతంగా బాకీలు చేసి, తామే తీర్చే అప్పులు 59వేల 414 కోట్లుగా ఉంది. అయితే ఈ కార్పొరేషన్లకు ఇన్ కమ్ లేక వీటి అప్పులను కూడా సర్కారీ ఖజానా నుంచే చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది.
ప్రభుత్వానికి అప్పులు తెచ్చి పెట్టేందుకే ఉపయోగం
ఉన్న కార్పొరేషన్లలో 90 శాతం కార్పొరేషన్లు అప్పుల ఊబిలోనే ఉన్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా అప్పుల విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రస్తుత ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారింది. అందుకే వాటిని సెట్ రైట్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ రెడీ చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది ప్రజల భారాన్ని తగ్గించడం కోసమే. ప్రజల సంక్షేమం బాగుండాలంటే ముందుకు అధిక మిత్తీలకు తెచ్చిన అప్పుల్ని క్లియర్ చేసేయాల్సిన పరిస్థితి ఉంది.
లోన్ల రీస్ట్రక్చరింగ్ పై ప్రభుత్వం ఫోకస్
ప్రజా ధనాన్ని పకడ్బందీగా వాడాలి. ఎక్కడా రూపాయి వేస్ట్ కావొద్దన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. వాటిని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలన్న కాన్సెప్ట్ తో రేవంత్ ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే గుదిబండగా ఉన్న లోన్ల రీస్ట్రక్చరింగ్ పై నజర్ పెట్టింది. అధిక వడ్డీలకు తెచ్చిన లోన్లపై టాప్ అప్ ల జోలికి వెళ్లడం లేదు. ఇంటి కోసం హోమ్ లోన్ తీసుకునే వారిలో కొందరు టైమ్ కంటే ముందుగానే తమ చేతికి డబ్బు అందినప్పుడల్లా ప్రిన్సిపుల్ అమౌంట్ కడుతుంటారు. లోన్ త్వరగా క్లియర్ చేసుకునే పనిలో ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే పని చేస్తోంది.
బేవరేజెస్ కార్పొరేషన్, జెన్‌కో, ట్రాన్స్‌కో
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ, టూరిజం డెవలమెంట్ కార్పొరేషన్, బేవరేజెస్ కార్పొరేషన్, జెన్‌కో, ట్రాన్స్‌కో, సివిల్ సప్లయ్స్, ఫారెస్ట్ డెవలప్ మెంట్, మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లు, సింగరేణి వంటివి తమంతట తాము సెట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాయి. అంటే వాటికి వివిధ మార్గాల ద్వారా వచ్చే నిధులను జీతాలు, నిర్వహణ ఖర్చుల కోసం వాడుకుంటున్నాయి. ప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితిలో లేవు.
ఫిల్మ్ అండ్ టీవీ, థియేటర్ డెవలప్ మెంట్
నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి చూపాల్సిన సెట్విన్ అనే కార్పొరేషన్ పూర్తిగా ఉనికి కోల్పోయింది. ఫిల్మ్ అండ్ టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో పాటు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు కొనుగోలు చేసి రైతులకు అందించే ఆగ్రోస్ వంటివి నిధుల్లేక ఖాళీగా చేతులెత్తేసి రెడీగా ఉన్నాయి. ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, హాకా వంటి సంస్థలకు ప్రభుత్వమే నిధులు సమకూరుస్తోంది. వీటితో పాటే స్టేట్ హ్యాండి క్రాఫ్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, స్టేట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, స్టేట్ మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, మేదర కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్,
ట్యాడీ టాపర్స్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్
ట్యాడీ టాపర్స్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్..మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, వుమెన్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, వికలాంగుల కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, స్టేట్ యోగాధ్యయన పరిషత్, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, లెదర్ ఇండస్ట్రీస్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్, ఆగ్రోస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు, టెక్స్‌టైల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ, అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్, సెట్విన్, ట్రైకార్, తెలంగాణ ఫుడ్స్ వంటివి ఉన్నాయి. ఇలాంటి సంస్థలపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటోంది. ఏం చేస్తే ఇవి ఉపయోగపడుతాయి? ఎలా చేయాలన్నది ఫైనల్ కాల్ తీసుకోబోతున్నారు.
5 కార్పొరేషన్ల అప్పులు ఏకంగా 95 శాతం
అసలు ఆదాయమే లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా వాటి నుంచి ఎక్కువ వడ్డీతో అప్పులు తీసుకుంది గత సర్కారు. మొత్తం కార్పొరేషన్ల అప్పులు ఒక ఎత్తు అయితే… ఐదు కార్పొరేషన్లవే ఏకంగా 95 శాతం బాకీలున్నాయి. అందులో నెంబర్ వన్ లాస్ కంపెనీ కాళేశ్వరం కార్పొరేషన్. ఆ తర్వాత డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్, వాటర్ రీసోర్స్ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్, రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, గొర్రెల కార్పొరేషన్ వంటివి ఉన్నాయి.
మార్కెట్ లో యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ 7.63 శాతం
ఇవే 95 శాతం అప్పులు తెచ్చుకున్నాయి. తెస్తే తెచ్చాయి.. కానీ మార్కెట్ లో ఒక వడ్డీ రేటు ఉంటే అంతకంటే ఎక్కువ పెట్టి తేవడంలో లాజిక్స్ ఏంటన్నది తేల్చే పనిలో ఉన్నారు. మార్కెట్ లో ఇంట్రెస్ట్ రేట్ యావరేజ్ గా 7.63 శాతంగా ఉంది. కానీ ఏకంగా 10.49% వడ్డీతో లోన్లు తెచ్చింది గత సర్కార్. ఇలా ఎవరైనా చేస్తారా? ఇది ఎంత గుదిబండో అర్థం చేసుకోలేకపోయారా? ఓన్లీ అడిగినంత అప్పులు ఇస్తే చాలు అనుకున్నారా?
కాళేశ్వరం కార్పొరేషన్ 9.69% వడ్డీతో రూ.74,599 కోట్లు అప్పు
కాళేశ్వరం కార్పొరేషన్ పై 9.69% ఇంట్రెస్ట్ రేటుతో 74 వేల 599 కోట్ల రూపాయలు అప్పు చేశారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ పై 9.48% వడ్డీ రేటుతో 20,200 కోట్లు అప్పులు చేశారు. వాటర్ రీసోర్స్ కార్పొరేషన్ పై అత్యధికంగా 10.49% ఇంట్రెస్ట్ తో 14 వేల 60 కోట్ల రూపాయలు బాకీలు తెచ్చారు. ఇది ప్రభుత్వ ఖజానాపై ఎంతలా భారం మోపుతోందో ప్రస్తుత ప్రభుత్వానికి అర్థమవుతోంది. ఇక హౌసింగ్ కార్పొరేషన్ పై 9 వేల కోట్లు, రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పై 2,951 కోట్ల రుణాలు ఉన్నాయి.
గొర్రెల కార్పొరేషన్ కు రూ. 4 వేల కోట్లు
గొర్రెల కార్పొరేషన్ కింద గత ప్రభుత్వం గొర్రెల స్కీం కోసం 4 వేల కోట్లు, చేపల కోసం మరో 600 కోట్ల అప్పు చేసింది. ఇక హాస్పిటల్స్ నిర్మాణాల కోసం కూడా 3,535 కోట్లు కార్పొరేషన్ల కిందనే బాకీలు తీసుకుంది. అయితే ఇందులో హౌసింగ్ వంటి వాటికి కచ్చితంగా రుణాలు తీసుకోవాల్సినవే. అయితే ఎక్కువ వడ్డీ రేట్లకు బాకీలు తేవడమే ఇప్పుడు ఖజానాను ఖతం చేస్తోంది.
అసలు, బాకీలు తీర్చేలా రేవంత్ ప్రభుత్వ చర్యలు
సో తెలంగాణలో కార్పొరేషన్లు ఎలా అప్పుల ఊబిలో ఉన్నాయో చూశాం కదా. వీటితో రోజులు గడిచేకొద్దీ నష్టాలే తప్ప లాభాలు ఉండవు. అందుకే కార్పొరేషన్లను సెట్ చేయడం, లోన్లను రీస్ట్రక్చర్ చేయడం, సాధ్యమైనంత వరకు అసలు, బాకీలు తీర్చుకుంటూ వెళ్లడమే రేవంత్ సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ అధిక వడ్డీలకు కేసీఆర్ తెచ్చిన ఈ లోన్ల రీ స్ట్రక్చరింగ్ పై రిక్వెస్టులు చేస్తూ వస్తున్నారు. కొంత వరకు సక్సెస్ అయ్యారు కూడా. ఓవైపు గత ప్రభుత్వం సృష్టించిన అప్పుల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తుంటే విపక్షం మాత్రం ఇప్పటి ప్రభుత్వమే అప్పుల మీద అప్పులు చేస్తోందని విమర్శలు చేయడమే విడ్డూరం.