E-Paper
Advertisement

Maoist Surrender: మావోయిస్టుల పని అయిపోయినట్టేనా..? లొంగిపోయిన కోటి రూపాయల రివార్డ్ నేతలు!

Maoist Surrender: మావోయిస్టుల పని అయిపోయినట్టేనా..? లొంగిపోయిన కోటి రూపాయల రివార్డ్ నేతలు!

Maoist Surrender: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది. ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బ. డిసెంబర్ 2025 నుంచి జరుగుతున్న లొంగుబాటు చర్చలు చివరకు కొలిక్కి వచ్చి సరెండర్ అయ్యారు. గత ఏడాది కాలంలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు వంటి కీలక నేతలను భద్రతా బలగాలు హతమార్చాయి. మల్లోజుల, దేవా లాంటి కీలక నేతలు లొంగిపోయారు. సో ఇలా మావోయిస్టు పొలిట్‌బ్యూరో, సెంట్రల్ కమిటీ దాదాపుగా తుడిచి పెట్టుకుపోయింది.

మావోయిస్టు ఉద్యమంలో మార్పుల గాలి

ఆపరేషన్ కగార్ తో గత ఏడాదిలోనే సుమారు 390 మంది మావోయిస్టులను బలగాలు హతమార్చాయి. అబూజ్‌మడ్, కర్రెగుట్టలు వంటి పటిష్టమైన మావో స్థావరాలను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయంపై మావోయిస్టు పార్టీలో తీవ్ర చీలికలు వచ్చాయి. మల్లోజుల వేణుగోపాల్ రావు లాంటి వారు సాయుధ పోరాటం విఫలమైందని అంగీకరిస్తూ 2025 అక్టోబర్‌లో భారీ ఎత్తున క్యాడర్‌తో కలిసి లొంగిపోయారు. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలతో గిరిజన యువతలో మార్పు వచ్చింది. కొత్త రిక్రూట్‌మెంట్లు ఆగిపోవడం, ఉన్న క్యాడర్ అనారోగ్య సమస్యలతో ఉండటం వల్ల పార్టీ బలహీనపడింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి నక్సల్ రహిత భారత్‌ లక్ష్యంగా కేంద్ర హోంశాఖ పెట్టుకుంది. ఆ ప్రకారమే కథ నడిపిస్తోంది.

మిగిలిన నేతల వ్యూహం ఏమిటి?

మావోయిస్టు ఉద్యమంలో మొదటి నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన లీడర్లే కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎన్ కౌంటర్లు, లొంగుబాట్ల తర్వాత ఇంకా రాష్ట్రానికి చెందిన 17 మంది మావోయిస్టు లీడర్లు పార్టీలో కొనసాగుతున్నట్లు పోలీసులు తేల్చారు. పార్టీ జనరల్​ సెక్రటరీ తిప్పిరి తిరుపతి అలియాస్​ దేవ్ ​జీ, కేంద్ర కమిటీ సభ్యుు మల్లా రాజి రెడ్డి అలియాస్​ సంగ్రామ్ కీలక నేతలు సరెండర్ అవడంతో అజ్ఞాతంలో ఉన్న వారి సంగతేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్

అజ్ఞాతంలో ఉన్న వారిలో మావోయిస్ట్​ పార్టీ మాజీ చీఫ్​, సీనియర్​ లీడర్​, సెంట్రల్​ పొలిట్​ బ్యూరో సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్​ గణపతి, సెంట్రల్​ కమిటీ మెంబర్​ పుసునూరి నరహరి అలియాస్​ సంతోష్, సైనిక వ్యవహారాల ఇన్​చార్జి బడే చొక్కారావు అలియాస్​ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు ముప్పిడి సాంబయ్య అలియాస్​ సుదర్శన్, కమ్యూనికేషన్ వింగ్ ఇన్‌‌‌‌చార్జి వార్తా శేఖర్ అలియాస్​ మంగ్తు, సెంట్రల్​ కమిటీ మెంబర్​ జోడే రత్నబాయి అలియాస్​ సుజాత, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి లోకేటి చందర్ రావు అలియాస్​ ప్రభాకర్, బెటాలియన్ ఇంఛార్జ్ కేసా సోది వంటి వారి నిర్ణయం ఏంటో తేలాల్సి ఉంది. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ కు ఇంకా కొన్ని రోజులే ఉండడంతో కథ ముగించే పనిలో కేంద్ర హోంశాఖ ఉంది.

ఉద్యమ ప్రస్థానంలో కీలక పాత్ర

దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతిది మావోయిస్టు ఉద్యమ ప్రస్థానంలో కీలక పాత్ర. దేవ్ జీ స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల. తిరుపతిది దళిత కుటుంబ నేపథ్యం. కోరుట్ల టౌన్ లోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన తిరుపతి ఇంటర్‌ వరకు చదివాక.. 1980ల్లో నాడు ఉద్యమ సంస్థగా ఉన్న పీపుల్స్‌వార్‌లో చేరారు. అప్పట్లో జగిత్యాల జైత్రయాత్రతో ఉత్తర తెలంగాణలో ఉవ్వెత్తున ఒక ఉద్యమం ఎగసి పడింది. ఆ ఉద్యమం చాలా మంది యువతపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆ ఎఫెక్ట్ తో దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత 1983లో డిగ్రీ చదువుతుండగానే.. మధ్యలోనే వదిలేసి రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌- RSU భావజాలానికి ఆకర్షితుడయ్యారు. తర్వాత ఉద్యమంలోకి డైరెక్ట్ గా వెళ్లిపోయాడు తిరుపతి.

దేవ్ జీపై కోటి రూపాయల రివార్డు

దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతికి తెలుగు, హిందీ, గోండి భాషలపై చాలా పట్టు ఉంది. రిక్రూట్ మెంట్ల కోసం గిరిజన యువతను ఆకర్షించారు. దేవ్ జీకి మావోయిస్టు పార్టీలో సంజీవ్, సుదర్శన్, కుమ్ముదాదా అనే మారు పేర్లు కూడా ఉన్నాయ్. కేంద్ర కమిటీ కార్యదర్శి కంటే ముందు దేవ్ జీ మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు ఇన్‌ఛార్జిగా ఉంటూ సెంట్రల్‌ రీజినల్‌ బ్యూరో డైరెక్షన్స్ ఇచ్చే పనులు చూసుకున్నారు. పొలిట్‌ బ్యూరోలో సభ్యుడిగానూ చాలా కాలం పని చేశారు. 2010లో దంతెవాడలో 74 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను హతమార్చిన ఘటనతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చంద్రబాబునాయుడిపై అలిపిరి దాడి ఘటనలో దేవ్‌జీ కీ రోల్ పోషించినట్లు పోలీస్‌ రికార్డులు చెబుతున్నాయ్. NIAకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న దేవ్‌జీపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌తోపాటు కోటి రూపాయల దాకా రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీ చరిత్రలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా జగిత్యాల జిల్లాకు చెందిన గణపతి తర్వాత ఇదే జిల్లాకు చెందిన తిరుపతికి మరోసారి అవకాశం ఇచ్చింది పార్టీ. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్ కౌంటర్ తర్వాత తిరుపతికి అవకాశం దొరికింది. అయితే మావోయిస్టు కీలక నేతలంతా లొంగుబాటు దిశగా అడుగులు వేయడం, ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ముగుస్తుండడం, అడవుల్లో ఉండే పరిస్థితులు లేకపోవడం, వేల సంఖ్యలో CRPF బలగాలతో గాలింపులు జరుగుతుండడంతో దేవ్ జీ లొంగిపోక తప్పలేదంటున్నారు.

రాజిరెడ్డిపై కోటి రూపాయల రివార్డు

అటు లొంగిపోయిన వారిలో మల్లా రాజిరెడ్డి కూడా ఉన్నారంటున్నారు. ఈయన మారుపేర్లు సాయన్న, మీసాల సత్తన్న, సంగ్రామ్, అలోక్, దేశ్‌పాండే. రాజిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని శాస్త్రులపల్లి గ్రామం. 1975లో ఉద్యమంలో చేరారు మల్లా రాజిరెడ్డి. ఈయనకు పలు కీలక హింసాత్మక ఘటనల్లో పాత్ర ఉంది. మాజీ స్పీకర్ శ్రీపాద రావు హత్యలో కీరోల్ పోషించారంటారు. రాజిరెడ్డిపై కోటి రూపాయల రివార్డు ఉంది.

రూ. 2.5 కోట్ల రివార్డు ఉన్న గణపతి

మావోయిస్టు పార్టీలో ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి కీలకంగా ఉన్నారు. ఈయన వయోభారంతో ప్రస్తుతం యాక్టివ్ గా లేకపోయినా ఇంకా అజ్ఞాతవాసం మాత్రం వీడడం లేదు. చాలా మంది ఇప్పటికే లొంగిపోతున్నా ముందుకు రావడం లేదు. దేవ్ జీ లొంగుబాటు నేపథ్యంలో గణపతి దారెటు అన్న ప్రశ్నలు వస్తున్నాయ్. భారత దేశ విప్లవ ఉద్యమ చరిత్రలో గణపతి చాలా కీలకంగా వ్యవహరించారు. ఈయన స్వస్థలం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బీర్పూర్. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన గణపతి.. అప్పట్లో కొండపల్లి సీతారామయ్య స్థాపించిన పీపుల్స్ వార్ లో చేరారు. 2004లో పీపుల్స్ వార్, MCCI విలీనంతో సీపీఐ మావోయిస్టు పార్టీ ఏర్పడింది. దానికి గణపతి వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. మావోయిస్టు పార్టీకి 14 ఏళ్ల పాటు చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. గణపతిపై 2.5 కోట్ల భారీ రివార్డు ఉంది. 2018లో జనరల్ సెక్రటరీ బాధ్యతలకు గణపతి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం ఈయన ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్ర దండకారణ్యంలో ఉన్నారని, చికిత్స కోసం విదేశాలకు వెళ్లారని, చనిపోయారని ఇలా రకరకాల ఊహాగానాలైతే ఈయన చుట్టూ తిరుగుతున్నాయ్. ఆపరేషన్ కగార్ తో గణపతి కూడా లొంగిపోతారా అన్న చర్చ జరుగుతోంది.

నాలుగంచెల వ్యూహంతో ఆపరేషన్ కగార్

2026 మార్చి31 నాటికి నక్సల్స్ రహిత భారత్ అని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ ప్రారంభమైంది. CRPF, కోబ్రా, గ్రేహౌండ్స్, DRG, పోలీసులు ఇలా సుమారు 1 లక్ష మంది బలగాలతో ఆపరేషన్ చేపట్టారు. నాలుగంచెల వ్యూహంతో ఆపరేషన్ కగార్ రన్ చేస్తున్నారు. మావోల కంచుకోటలైన అబూజ్ మడ్, కర్రెగుట్టలు వంటి చోట సెక్యూరిటీ క్యాంపుల ఏర్పాటు చేయడంలో ఇందులో కీలక పరిణామం. ఇక్కడ బలగాల క్యాంప్ ఉంటే మావోయిస్టులు ఉండేదెక్కడ. అందుకే అక్కడ తొలి దెబ్బ పడింది. ఇక మావోయిస్టులను గుర్తించేందుకు టెక్నాలజీ పెరిగింది. డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్, AI టెక్నాలజీ వాడడం కూడా బలగాలకు కలిసి వచ్చింది. అటు లొంగిపోతే ఇచ్చే ప్యాకేజీ భారీగా పెంచేశారు. ఇది కూడా చాలా మందిని ఆకర్షించింది. 2024లో 290 మంది మావోల హతమవగా, 2025లో 317 మంది మావోలు ఎన్ కౌంటర్ అయ్యారు.

వామ్మో 2024 నాటికి ఇంత మంది చనిపోయారా..

2014లో 126 జిల్లాల్లో రెడ్ కారిడార్ వ్యాపించి ఉంటే 2015లో 106 జిల్లాలకు తగ్గించగలిగారు. 2026 నాటికి కేవలం 6 జిల్లాలకు రెడ్ కారిడార్ పరిమితం అయింది. 1967 నక్సల్‌బరీ తిరుగుబాటుతో మొదలైన నక్సల్స్ ఉద్యమం 2000లలో తీవ్రస్థాయికి చేరింది. దేశాన్ని శాసిస్తారన్న పొజిషన్ కు చేరింది. 2009 నవంబర్‌లో ఆపరేషన్ గ్రీన్ హంట్ ను నాటి యూపీఏ ప్రభుత్వం ఆరంభించింది. 2017లో ఆపరేషన్ సమాధాన్ తో మరింత రౌండప్ చేశారు. చివరగా ఆపరేషన్ కగార్ అమలుతో ఎర్రసైన్యం ప్యాకప్ చేసే పనిలో పడ్డారు. ఆపరేషన్ కగార్ ఆరంభించిన తొలి 3 నెలల్లోనే 140 మంది మావోయిస్టులను హతమార్చారు. 2025 ఫిబ్రవరి 9న బీజాపూర్ లో 31 మంది ఎన్ కౌంటర్ అయ్యారు. గతేడాది ఏప్రిల్-మే కర్రెగుట్టల ఆపరేషన్ లో 31 మంది హతమయ్యారు. 2025 మే21న నారాయణపూర్ లో నంబాల ఎన్ కౌంటర్ జరిగింది. నాడు నంబాల సహా 27 మంది హతమయ్యారు. 2024 నుంచి ఇప్పటిదాకా 532 మంది మావోలు చనిపోయారు.

మావోయిస్టులపై చత్తీస్‌గఢ్ ప్రభుత్వ ఫోకస్

మావోయిస్టు పార్టీలో తెలుగు లీడర్ షిప్ చూస్తే మొత్తం 37 మంది లిస్టును గతంలో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో చాలా మంది లొంగిపోవడం, ఎన్ కౌంటర్ అవడం జరిగిపోయాయి. మరికొందరు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. 2024 మేలో అబూజ్ మడ్ లో ఎన్ కౌంటర్ జరిగితే అప్పుడు చనిపోయిన వారిలో ముగ్గురు తెలుగువారే ఉన్నారు. జోగన్న అలియాస్‌ చీమల నర్సయ్య, వినయ్‌ అలియాస్‌ రవి, వరంగల్‌కు చెందిన సుష్మిత అలియాస్‌ చైతె హతమయ్యారు. 2024 ఏప్రిల్ లో కాంకేర్‌ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగితే భూపాలపల్లి జిల్లాకు చెందిన శంకర్‌రావు, ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సుమన మృతి చెందారు.

తెలుగు మావోయిస్టు లీడర్స్ జాబితా

లిస్టులో గణేష్, రాజమోహన్ అలియాస్ యాదగిరి, హన్మకొండ , చిన్నన్న అలియాస్ నాగన్న, ఆత్మకూర్, ఏపీ , సుజాత అలియాస్ సుజాతక్క, మధు అలియాస్ కమలాకర్ గోపి అలియాస్ గోపన్న, ఏపీ , దీనా అలియాస్ నందే , సరిత అలియాస్ అరుణ, నల్గొండ, రుపీ, అనిత, తక్కళ్లపల్లి వాసుదేవరావు, వరంగల్ , విశాఖపట్నానికి చెందిన సత్యగంగాధర్ రావు పేర్లున్నాయి. అటు ప్రమోద్ అలియాస్ పాండూ, యాప్రాల్ రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి. అలాగే కమలేష్ అలియాస్ రామకృష్ణ, విజయవాడ , కేశవరావ్ అలియాస్ గంగన్న – శ్రీకాకుళం, గణపతి అలియాస్ లక్ష్మణ్ రావు- కరీంనగర్, మల్లోజుల వేణుగోపాల్, కరీంనగర్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ప్రస్తుతం లొంగిపోయిన టాప్ లీడర్ ఈయనే. లిస్టులో మోడెం బాలకృష్ణ అలియాస్ బాలన్న , ఉదయ్ అలియాస్ గణేష్ – నల్గొండ , రామచంద్రారెడ్డి – కరీంనగర్ , చందూ అలియాస్ చందర్ – వరంగల్, చలపతి, అలియాస్ రామచంద్రారెడ్డి – చిత్తూరు జిల్లా , విమల్ అలియాస్ వెంకటి – ఆదిలాబాద్ , గౌతమ్ అలియాస్ గోపన్న – కరీంనగర్ , పూలూరి ప్రసాద్ రావు – పెద్దపల్లి , కంకణాల రాజిరెడ్డి, మంథని, సంజీవ్ అలియాస్ అశోక్ – రంగారెడ్డి, రవి అలియాస్ భాస్కర్ – నిజామాబాద్ , రెడ్డి అలియాస్ శ్యాం – వరంగల్ , కమలేష్ అలియాస్ నాగరాజు – విజయవాడ, చందు, రఘు అలియాస్ వికాస్, వరంగల్ కు చెందిన వారున్నారు. అలాగే విమల – ఆదిలాబాద్, ప్రతాప్ – ఏపీ, రణధీర్ – వరంగల్ కు చెందిన వారు, నిర్మల అలియాస్ కోడి మంజుల తెలంగాణ ప్రాంతానికి చెందిన వారి పేర్లను పోలీసులు రిలీజ్ చేశారు. ఇందులో చాలా మంది లొంగిపోయారు. చాలా మంది ఎన్ కౌంటర్ అయ్యారు. వేళ్లపై లెక్కపెట్ట గలిగేంత మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారంటున్నారు. దేవ్ జీ, రాజిరెడ్డితో పాటు 16 మంది లొంగిపోయారంటున్నారు. వారందరూ తెరపైకి వస్తే ఈ లిస్ట్ మొత్తం క్లియర్ అయినట్లే.

మావోయిస్టుల మైన్డ్‌సెట్ మార్పు

మార్చి 31 మావోయిస్టులకు డెడ్ లైన్ విధించడంతో చాలా మంది మైండ్ సెట్ మారిపోయింది. ఇక అడవుల్లో బతికి బట్టకట్టలేం అని నిర్ధారణకు రావడంతోనే లొంగుబాటు పర్వం నడుస్తోందంటున్నారు. దేశాన్ని మావోయిస్టు రహితంగా చేసే లక్ష్యంతో కేంద్రం పని చేయడం, భద్రతా బలగాల నిరంతర ఆపరేషన్లు జరగడం, మావోయిస్టు లీడర్ షిప్ కోల్పోవడం, కొత్తగా రిక్రూట్ మెంట్ లేక సమస్యలు రావడం, భావజాల వైఫల్యంతో నష్టాలు, చాలా మంది వృద్ధాప్యంలో ఉండడం, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం, పునరావాస ప్యాకేజీలు బాగుండడం, పట్టున్న ప్రాంతాలు బలహీనం అవడం ఇవన్నీ మావోల లొంగుబాటుకు కీలకంగా మారాయ్. అటు అబూజ్ మడ్, కర్రెగుట్టల్లో CRPF క్యాంప్ ఏర్పాటు, పార్టీలో చేరేందుకు గిరిజనేతరుల అనాసక్తి చూడపడం, గిరిజన యువత కూడా చేరేందుకు ఇంట్రెస్ట్ చూపకపోవడం, గెరిల్లా జీవితం కాకుండా సేఫ్టీ లైఫ్ స్టైల్ ను నేటి యువత చూడడం కూడా మావోలకు ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే లొంగిపోయిన వారు ఆయుధాలు వదిలేయాలని పిలుపునివ్వడంతో చాలా మంది మనసు మార్చుకుని జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు.

Story by: Anup, Big Tv

Related News

కిలాడీ జంట లగ్జరీ లైఫ్ బిల్డప్.. తెరవెనుక కోట్లలో చీటింగ్.. నందూస్ వరల్డ్ జంట అసలు రంగు బట్టబయలు..?

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

Big Stories

×