Khammam: మొన్నటివరకు స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి. పార్టీ నేతలంతా ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నించారు. కానీ ఆ టైంలో బీసీ రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చి, కోర్టు తీర్పుతో నేతలంతా సైలెంట్ అయ్యారు. ప్రత్యేకించి ఆ జిల్లాలో అన్ని పార్టీలు స్తబ్ధతగా మారి ముభావాన్ని పాటిస్తున్నాయి. నేతలు కూడా ప్రజల్లోకి వెళ్లకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారట. ఇంతకీ రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన జిల్లాలో ఎందుకీ పరిస్థితి అనేది చర్చ జరుగుతోంది. ఆ జిల్లా ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
మొన్నటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలంటూ హడావిడి నడిచింది. దాంతో ఆయా పార్టీల నేతలంతా జనంలోకి దూకి, కౌగిలింతల రాజకీయం చేశారు. కానీ, అనుకోకుండా వచ్చిన ఒక బ్రేక్ అందరినీ గందరగోళంలో పడేసింది. అదే బీసీ రిజర్వేషన్ అంశం! న్యాయస్థానం తీర్పు తెరపైకి రావడంతో… ఆశలు పెట్టుకున్న నాయకులంతా ఒక్కసారిగా బ్రేకులు పడిన బండిలా మారిపోయారు. ఫలితంగా, జిల్లా రాజకీయ నేతలంతా ఒక్కసారిగా స్తబ్ధతకు లోనయ్యారు. ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు, ప్రజల మధ్యకు వెళ్లేందుకు సరైన టాపిక్ లేక, వేదిక దొరకక సతమతమవుతున్నారు.
ఖమ్మం జిల్లాను రాజకీయాల గుమ్మంగా చెబుతుంటారు. అలాంటి జిల్లాకు చెందిన నేతలు కమిట్ అయితే, తమ అభ్యర్థిని విజయతీరాలకు చేర్చడానికి రాత్రనక, పగలనక కష్టపడతారు. రాష్ట్రమంతా ఒక్కో తీర్పు ఇస్తే, ఖమ్మం ప్రజలు మాత్రం విలక్షణంగా ఓటేసి, పార్టీలకు కళ్లు తెరిపిస్తారు. కానీ, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ విషయంలో గందరగోళం రాగానే, నేతలంతా మౌనంగా మారిపోయారట. ప్రజల సమస్యలపై గొంతెత్తాల్సిన నాయకులు ఎవరూ కనిపించడం లేదట. కనీసం సమస్యలపై ఏకరు పేట్టుకునేందుకు కూడా ఏ నాయకుడు కనిపించడం లేదట. ఈ క్రమంలోనే జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, తమ అనుచరులను నిరుత్సాహపడకుండా చేసేందుకు ఏం చేయాలో అది చేస్తున్నారు. ఇన్నిరోజులు పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని ముందుకు అడుగులు వేయించారు. కానీ, రిజర్వేషన్ అంశం ఇంకా తేలకపోవడంతో, పదవుల కోసం ఆశించిన నేతలను సంతృప్తి పరచడం కష్టమైపోతోంది. సెకండ్ కేటగిరీ నేతలు కూడా, ఏంది ఈ అయోమయం? అంటూ గోలపెడుతున్నారట. అటు, జిల్లా ప్రధాన ఆలయాల కమిటీల ఏర్పాటులో జాప్యం కూడా అధికార పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా కనిపిస్తోందట.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు హవా చూపించారు. 10 నియోజకవర్గాల్లో 9 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి, తమ సత్తా చాటారు. కానీ, ఆ నేతలకు ఇప్పటివరకు దక్కిందేం లేదట. ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీ వైపు చూసిన గెస్ట్ ఆర్టిస్టులకు పదవులు అందిస్తూ, నిజమైన కాంగ్రెస్ క్యాడర్‌ను పక్కనపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయట. దాంతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని టాక్. మంత్రుల పర్యటనల సమయంలో భజన బ్యాచ్ హడావిడి చేస్తుంది కానీ, అసలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతోందట. ఆరు గ్యారెంటీలతో అదరగొడుతాం అంటూ అధిష్ఠానం ప్రచారం చేస్తున్నా, నేతలు మాత్రం మాకేం పట్టదు అన్నట్టు వ్యవహరిస్తున్నారట. ఇలాగైతే, కాంగ్రెస్‌కు డ్యామేజ్ తప్పదు అంటున్నారట ఎక్స్‌పర్ట్స్.
ఇక పదేళ్లపాటు అధికారంలో ఉన్న గులాబీ నేతలు.. పవర్ పోయేసరికి కండువా మార్చేశారట. అలా అధికార పార్టీలోకి వచ్చిన వారికి .. మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉంటున్న నేతలకు పడట్లేదట. ఇక గులాబీ నేతల కథ అలా ఉంటే కమలం నేతల తీరు మరోలా ఉందంట. జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం సమాయత్తమతున్న తరుణంలో.. జిల్లాలోని పార్టీ కేడర్ మాత్రం వర్గాలుగా విడిపోయి ప్రజల నాడిని పట్టడంలో విఫలమై సతమతమవుతుందట. ఓవరాల్ గా జిల్లాలోని రాజకీయ నేతలంతా మౌనం వహించడంతో పార్టీలు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాయి. సమస్యలపై గళమెత్తేందుకు ఏ నాయకుడు కూడా చురుగ్గా కనిపించడం లేదు. ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నేతలు రాజకీయాలకు దూరంగా ఉండడం, వామపక్షాలు కూడా ఎవరి దారి వారు చూసుకోవడంతో… ప్రజల్లోకి వెళ్లడానికి సరైన టాపిక్ దొరకక పార్టీలన్నీ కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. మళ్లీ ఎన్నికల సందడి ప్రారంభమైతేకానీ ఆ ఊపు రాదు.
Story by Venkatesh, Big Tv