krishna: జిల్లాల పునర్విభజన అంశం ఉమ్మడి కృష్ణా జిల్లాలో గందరగోళం సృష్టిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసేందుకు కూటమి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీతో ముందుకు వెళ్తుంటే ప్రజాప్రతినిధులు సరికొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు. వారి వ్యక్తిగత స్వార్థం ప్రస్తుతం జిల్లా ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తుంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో.. మరికొన్నింటి కృష్ణాజిల్లాలో కలపాలని ప్రతిపాదనకు ఆదిలోనే అడ్డంకులు వస్తున్నాయట.గన్నవరం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అడుగులు వేస్తుంటే.. పెనమలూరు ప్రజల అభీష్టానికి విరుద్ధంగా అక్కడి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వెళ్తున్నారని విమర్శలు వస్తున్నాయట. ఇంతలో గన్నవరం, పెనమలూరు ఎన్టీఆర్ జిల్లాలో కలిస్తే కృష్ణాజిల్లా చిన్నదైపోతుందని మంత్రి కొల్లు రవీంద్ర మరో వాదన అందుకున్నట్టు ప్రచారం నడుస్తోందట. దీనిపై ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోందట. వరుస చిక్కుముడులను విప్పేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంటే ప్రజాప్రతినిధులు మాత్రం కొత్త వాదనలతో గందరగోళం సృష్టించేలా వ్యవహరించటం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందట. నాడు జిల్లాల విభజనలో జరిగిన లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ప్రయత్నిస్తోందట. ఇందులో ప్రధానంగా ఒక నియోజకవర్గం ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండాలని నిర్దేశిస్తోందట. ఈ విధానాన్ని ఖచ్చితంగా నూరుశాతం అమలు చేయాల్సిందేనన్నది ప్రభుత్వ నిర్ణయంగా తెలుస్తోంది. జిల్లా పరిపాలనా కేంద్రానికి దగ్గరగా ఉండాలన్నది రెండవ అంశం కాగా.. ప్రజలు రాకపోకలకు దగ్గరగా ఉండాలన్నది మూడవ అంశం. వీటన్నింటికీ మించి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను సరిచేయటం అన్నది నాల్గవది.
విజయవాడకు సమీపంలో ఉండటం.. విజయవాడ విమానాశ్రయాన్ని కలిగి ఉన్న గన్నవరం నియోజకవర్గాన్ని కూడా విజయవాడలో కలపాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అక్కడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ, జిల్లా ఇన్చార్జి మంత్రికి ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని చెబుతున్నారు. విజయవాడ రూరల్ మండలం ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాలు మాత్రం కృష్ణాజిల్లాలో ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఒక నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాలను ఒకే రెవెన్యూ డివిజన్‌తో పాటు…ఒకే జిల్లాలో ఉండాలన్నది నిర్దేశిస్తోంది. ఈ లెక్కన చూస్తే గన్నవరం నియోజకవర్గాన్ని అక్కడి ప్రజలు, స్థానిక ఎమ్మెల్యే కూడా సమ్మతం తెలపటంతో ఎన్టీఆర్ జిల్లాలోకి తీసుకురావటం అన్నది సహేతుకంగా కనిపిస్తోందనేది జరుగుతున్న చర్చ. గన్నవరం నియోజకవర్గం, పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపితే కృష్ణాజిల్లా చిన్నదైపోతుందని మంత్రి కొల్లు రవీంద్ర సరికొత్త వాదనలు తీసుకువస్తున్నారని తెలుస్తోంది. ఈ వాదనతో అంతా గందరగోళానికి దారి తీస్తోంది.కృష్ణాజిల్లాలోకి అతిపెద్ద కైకలూరు నియోజవర్గం వచ్చి కలవనుంది. ఇలాంటపుడు కృష్ణాజిల్లా ఎందుకు చిన్నదవుతుందో మంత్రికే తెలియాలని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
పెనమలూరు ప్రజలు విజయవాడలోని కలెక్టరేట్ కార్యాలయానికి రావటం దగ్గరగా ఉండడం…పైగా విజయవాడ గ్రేటర్ విలీన జాబితాలో ఈ నియోజకవర్గంలోని పెనమలూరు, కంకిపాడు మండలాలు ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా దాదాపుగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి భిన్నంగా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రభుత్వం నియమించినకేబినెట్ సబ్ కమిటీకి ఎన్టీఆర్ జిల్లాలో కలపటానికి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన కమిటీకి పదేపదే చెబుతుండటంతో పెనమలూరు అంశంపై గందరగోళం తలెత్తుతోందట. పెనమలూరు ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యవహరిస్తున్నారే చర్చ నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతుందట. ఆయన ఏ కారణం చేత వద్దంటున్నారో నియోజకవర్గ ప్రజలకు అంతుచిక్కడంలేదనే టాక్ వినిపిస్తోందట. ఈ అంశంపై నియోజకవర్గ ప్రజలు మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. ఎమ్మెల్యే తీరుపై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారట. ఈ వ్యవహారంతో నియోజకవర్గంలో ఇప్పటి వరకు చాపకిందనీ రులా జరుగుతున్న ఇతర వ్యవహారాలన్నీ తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయట.
ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక మంత్రి… ఒకరు కావాలని మరొకరు వద్దని ఇంకొకరు చిన్న జిల్లా అని…. మాట్లాడుతూ క్యాబినెట్ సబ్ కమిటీ ముందు తమ బాధను వినిపించారు… కానీ మీరు ఎవరికీ ప్రజా అభిప్రాయాలు పట్టకపోవడం ఇబ్బంది కలిగిస్తుంది అంటున్నారు ప్రజలు.
Story by Apparao, Big Tv