Vizianagaram: తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే… సామెత పాతదే అయినా ప్రస్తుత విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాలకు సరిగ్గా సరిపోతుందంటే అతిశయోక్తి కాదు. ఆ ఇద్దరిపై కలిసి కబ్జాలు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఇద్దరు కలిసి జిల్లాలో బొత్స లాంటి నాయకుడినే తొక్కేద్దామని చూశారు. ఇంటా బయటా అన్నా, తమ్ముడూ అంటూ ప్రేమలు ఒలకబోసుకున్నారు. అయితే రాజకీయాల్లో అవన్నీ శాశ్వతం కాదనేది జగమెరిగిన సత్యం. ఆ సత్యాన్ని ప్రాక్టికల్‌గా నిజమని నిరూపిస్తున్నారు జిల్లాకు చెందిన ఆ సీనియర్లు. ఇంతకీ ఎవరా లీడర్స్ అంటారా? మీరే చూడండి
బొత్సకి చెక్ పెట్టాలని చూసిన మజ్జి శ్రీను, కోలగట్ల
విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాలంటే ముందుగా గుర్తొచ్చేది మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ. అలాంటి సీనియర్ నాయకుడికి సొంత పార్టీలోనే చెక్ పెట్టాలని శతవిధాలా ప్రయత్నించారు ఆయన మేనల్లుడైన విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి . వీరిద్దరు గత ఎన్నికల వరకు బొత్సకు వ్యతిరేకంగా కలిసి పావులు కదిపిన నేతలే. అన్నా, తమ్ముడూ అని పిలుచుకుంటూ కలిసి మెలిసి పనిచేశారు. ఇపుడు పార్టీ పదవి దగ్గరకి వచ్చేసరికి వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైందంట.
విజయనగరం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మజ్జి శ్రీను
విజయనగరం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా మజ్జి శ్రీను కొనసాగుతున్నారు. అయితే ఉన్న పదవిని కాపాడుకోవడానికి మజ్జి శ్రీను పాట్లు పడుతున్నారంట. అసలు ఆ పదవి తనదని వీరభద్రస్వామి ఇపుడు అధిష్టానం వద్ద పంచాయితీ షురూ చేస్తున్నారట. 2019 ఎన్నికలకు వెళ్ళినపుడు జిల్లా అధ్యక్షుడిగా కొలగట్లనే ఉన్నారు. ఆయన హయాంలోనే జిల్లాని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అందుకే విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచిన వీరభద్రస్వామికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా అవకాశం కల్పించింది వైసీపీ. స్వామి తరువాత జిల్లా అధ్యక్షుడు స్థానంలోకి ఎంట్రీ ఇచ్చారు చిన్న శ్రీను.
జిల్లాలో ఘోరపరాజయం పాలైన వైసీపీ నాయకులు
బొత్స సత్యనారాయణ మేనల్లుడు అవ్వడం, అప్పట్లో ఆ ఇద్దరికీ సత్సంబంధాలు ఉండటంతో మజ్జి శ్రీనుని జడ్పీ చైర్మన్‌తో పాటు జిల్లా అధ్యక్ష పదవి రెండూ వరించాయి. దానిపై అప్పట్లో ఎలాంటి అబ్జక్షన్స్ లేవు. దానికి కారణమూ లేకపోలేదు. 2019లో వైసీపీ జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకుంది. ముఖ్యనేతలందరికీ పదవులు ఉండడంతో పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి అప్పట్లో అంత డిమాండ్ లేకుండా పోయింది. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. సరిగ్గా అయిదేళ్లు తిరిగేసరికి ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అయిపోయాయి. 2024 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ నాయకులు అందరూ ఘోర పరాజయం పాలయ్యారు.
జిల్లా అధ్యక్ష పదవి కోసం పట్టుబడుతున్న కోలగట్ల
అసెంబ్లీలో వైసీపీ 11 స్థానాలకే పరిమితం అవ్వడంతో ఎవరికీ ఎమ్మెల్సీలుగా కూడా అవకాశం లేదు. బొత్స సత్యనారాయణే విశాఖ జిల్లాకు షిఫ్ట్ అయి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ దక్కించుకున్నారు. ఆ క్రమంలో జిల్లా నేతలంతా మళ్లీ పార్టీ పదవులపై కన్నేశారు. ఎవరి దగ్గరైన అదనపు పదవి ఉంటే అది మాకు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారట . మాజీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి మాత్రం ఖచ్చితంగా తనకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కావాలని పట్టుబడుతున్నారట. జడ్పీ చైర్మన్‌గా ఉన్న మజ్జి శ్రీనుకి రాజకీయ ఉపాధి ఉందని, ఆయన దగ్గర అదనంగా ఉన్న జిల్లా ప్రెసిడెంట్ పోస్టు తనకు కట్టబెట్టాలని అధిష్టాన్నాన్ని డిమాండ్ చేస్తున్నారంట
క్యాడర్‌కి అందుబాటులో లేకుండా పోయిన మాజీ డిప్యూటీ స్పీకర్
2024లో విజయనగరం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘోరంగా ఓడిపోయిన కోలగట్ల వీరభద్రస్వామి ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. నాయకులకు గానీ కార్యకర్తలకుగానీ అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్నారు. మళ్లీ అందరికీ టచ్‌లోకి రావాలన్న, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాలన్నా తిరిగి తనను జిల్లా అధ్యక్షుణ్ని చేయాలని అధిష్ఠానానికి సంకేతాలు పంపారట. తన 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీకి తగ్గ గౌరవం కావాలని కోరుకుంటున్నారట. చిన్న శ్రీను జడ్పీ ఛైర్మన్‌తో పాటు విశాఖ జిల్లాలోని భీమిలి వైసీపీ ఇన్చార్జ్ బాధ్యతలు కూడా చూస్తున్నారు. కాబట్టి జిల్లా అధ్యక్ష పదవేదో తనకి ఇస్తే అనుభవాన్ని రంగరించి పార్టీని జిల్లాలో యాక్టివ్ మోడ్‌లోకి తీసుకువస్తానని చెబుతున్నారట.
Also Read: చెవిరెడ్డి కన్నీళ్లు.. అసలు కథ ఇదే!
విషయం తెలుసుకున్న చిన్న శ్రీను.. స్వామి డిమాండ్‌పై గుర్రుగా ఉన్నారట. అయితే వీరిద్దరి పార్టీ పదవుల లొల్లి చూస్తున్న బొత్స మాత్రం మొన్నటి వరకు అన్న తమ్ముడు అంటూ భుజాలు రాసుకొని తిరిగి, ఇప్పుడేమో ఉప్పు నిప్పు అయిపోయారని నవ్వుకుంటున్నారట. జిల్లా వైసీపీలో బొత్స తరువాత చిన్న శ్రీనుకే అంత పట్టుంది అనేది బహిరంగ సత్యం. ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కాలంలో ఆయన పార్టీని నడిపిస్తున్న తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఎవరివైపు మొగ్గు చూపుతారో చూడాలి.