Indian Railways: ప్రయాణీకులకు ప్రయోజనం కలిగేలా భువనేశ్వర్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను అరకు లోయ ద్వారా కోరాపుట్ వరకు పొడిగించాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఒడిషాలోని జైపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బహినిపతి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో పాటు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు మెమోరాండం సమర్పించారు. ప్రస్తుతం ఈ రైలు 444 కి.మీ మేర ప్రయాణిస్తుండగా, మరో 215 కి.మీ పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల వందే భారత్ ఆపరేషనల్ పరిమితికి లోబడే ఉంటుందన్నారు. ప్రస్తుతం వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఆపరేషనల్ పరిమితి 800 కి.మీ లోపుగా నిర్ణయించారు. భువనేశ్వర్- విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు మరో 215 కిలో మీటర్లు యాడ్ చేయడం ద్వారా మొత్తం ప్రయాణ దూరం 669 కి.మీకి చేరుకుంటుంది.
గిరిజన ప్రాంతాలకు మేలు కలిగేలా..
తారా ప్రసాద్ బహినిపతి చెప్పినట్లుగా భువనేశ్వర్- విశాఖపట్నం రైలు ప్రయాణాన్ని విస్తరిస్తే గిరిజన ప్రాంతాలకు మేలు కలిగే అవకాశం ఉంటుంది. గిరిజనులు ఎక్కువగా నివసించే కోరాపుట్ లో రైలు కనెక్టివిటీ పెరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతాలను హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ మాత్రమే భువనేశ్వర్ తో కలుపుతుంది. హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ లో రద్దీని తగ్గించడానికి నందపూర్, లామ్తాపుట్ లాంటి వెనుకబడిన బ్లాక్‌లు, నబరంగ్ పూర్, మల్కాన్ గిరి లాంటి సరిహద్దు జిల్లాలలో అభివృద్ధిని పెంచడానికి ఈ కొత్త మార్గం ఉపయోగపడుతుందని వెల్లడించారు. భువనేశ్వర్ నుంచి కోరాపుట్ వరకు ప్రయాణానికి పొడిగింపు తర్వాత తొమ్మిది గంటలు పట్టవచ్చని, ప్రస్తుత భువనేశ్వర్-విశాఖపట్నం ట్రిప్ కు కేవలం 5 గంటలకు తగ్గుతుందన్నారు.
రూట్ మార్చిన రైల్వే బోర్డు
మార్చి 2024లో నిలిపివేయబడిన ఒడిశాకు చెందిన మూడవ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోసం రైల్వే బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రైలు మార్గాన్ని పూరి-విశాఖపట్నం నుంచి భువనేశ్వర్-విశాఖపట్నంకు మార్చింది. ప్రస్తుతానికి ఈ సెమీ-హై-స్పీడ్ రైలు సోమవారం మినహా మిగతా అన్ని రోజులు నడుస్తుంది. ఖుర్దా రోడ్, బలుగావ్, బెర్హంపూర్, ఇచ్చాపురం, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ తీసుకుంటుంది. భువనేశ్వర్ నుంచి ఉదయం 5:15 గంటలకు బయలుదేరి, ఉదయం 11 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వైజాగ్ నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమై, రాత్రి 9:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది, 669 కి.మీ. ప్రాంతాన్ని ఆరు గంటల్లో కవర్ చేస్తుంది.
హైదరాబాద్ వరకు విస్తరించాలని డిమాండ్
భువనేశ్వర్-వైజాగ్ మార్గాన్ని ఆమోదించినప్పటికీ, ఒడిశా వాసులు ఈ రైలు సర్వీసును హైదరాబాద్‌కు విస్తరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది ఒడియా కార్మికులు ఈ కనెక్టివిటీ ద్వారా తమకు ప్రయాణం మరింత సులభం అవుతుందంటున్నారు. ప్రస్తుతం, ఎనిమిది కోచ్‌ల రైలు రాకపోకలు కొనసాగిస్తోంది. ఇందులో ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, ఏడు చైర్ కార్ కోచ్ లు ఉన్నాయి. ఈ రైల్వే లైన్ పొడిగింపునకు సంబంధించి త్వరలో రైల్వే బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Read Also: 2 టికెట్స్ కన్ఫార్మ్, మరో 2 వెయిటింగ్ లిస్ట్, నలుగురూ జర్నీ చెయ్యొచ్చా?