Nandikotkur Politics: కర్నూలు జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఒకరైతే.. వారిని రిమోట్‌తో ఆడించే కింగ్ మేకర్లు తయారయ్యారంట. షాడో ఎమ్మెల్యేలు ఏమి చెప్తే అదే జరుగుతుందనే టాక్ ఆ నియోజకవర్గాలలో వినిపిస్తుందట. రిజర్వ్‌డ్ సెగ్మెంట్లైన కోడుమూరు, నందికొట్కూరుల్లో పార్టీ ఏదైనా అభ్యర్ధిని నిర్ణయించేది తెర వెనుక చక్రం తిప్పే నేతలే అంటున్నారు. పేరు కే రిజర్వ్‌డ్ నియోజకవర్గాలని, అక్కడ పెత్తనం అంతా రెడ్డి సామాజికవర్గం నేతలదే నడుస్తోందంట. ఎమ్మెల్యేలు సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితే లేదన్న టాక్ వినిపిస్తోంది. అసలు ఆ సెగ్మెంట్లలో జరుగుతున్న రాజకీయమేంటో మీరే చూడండి..
కర్నూలు జిల్లాలో 2 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల్లో టీడీపీ విజయం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో కూటమి 14 నియోజకవర్గాలలో 12 నియోజకవర్గాలు కైవసం చేసుకుంది. రిజర్వుడ్ నియోజకవర్గాలు రెండిటితో పాటు 12 చోట్ల టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన కోడుమూరు నియోజకవర్గం నుంచి బొగ్గుల దస్తగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరో ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం నందికొట్కూరులో గిత్తా జయసూర్య విజయం సాధించారు. కొడుమూరు నియోజకవర్గం విభజిత కర్నూలు జిల్లాలో ఉంటే.. నందికొట్కూరు నూతనంగా ఏర్పాటు చేసిన నంద్యాల జిల్లా పరిధిలోకి వస్తుంది.
రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో షాడో ఎమ్మెల్యేల పెత్తనం
ఆ రెండు సెగ్మెంట్లు పేరుకే రిజర్వ్‌డ్ స్థానాలని ,అక్కడ షాడో ఎమ్మెల్యే చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరాలు నడుస్తున్నాయంట. అక్కడ జరిగేదంతా రెడ్డి సామాజికవర్గం నేతల పెత్తనమే అని గత వైసిపి పాలనలో నందికొట్కూరు ఎమ్మెల్యేగా గెలిచిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్థర్ బహిరంగంగానే విమర్శించారు. అప్పట్లో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తానే ఎమ్మెల్యేని అన్నట్లు వ్యవహరించడంతో తాను డమ్మీ ఎమ్మెల్యేగా ఉండలేనని తనకు పదవి, అధికారం ఇవ్వాలని అర్థర్ మొత్తుకున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ పట్టించుకోకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. అయితే నందికొట్కూరులో ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య కూడా డమ్మీ ఎమ్మెల్యేగా మారడం హాట్ టాపిక్‌గా మారింది
నందికొట్కూరులో చక్రం తిప్పుతున్న మాండ్ర శివానందరెడ్డి
నందికొట్కూరు నియోజకవర్గంలో మాజీ ఐపీఎస్ అధికారి, టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి చెప్పిందే వేదం అన్నట్లు నడుస్తోందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితమై పార్టీ క్యాడర్ కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదంట. శివానందరెడ్డి ఏమి చెప్తే అదే చేస్తూ డమ్మీ ఎమ్మెల్యేగా మారిపోయారంట. గతంలో వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలే ఇప్పుడు జరుగుతున్నాయని, షాడో ఎమ్మెల్యేల తీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి
నియోజకవర్గం వ్యవహారాల్లో తలదూర్చని బొగ్గుల దస్తగిరి
కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా బొగ్గుల దస్తగిరి కేవలం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనే కనిపిస్తుంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుపుతున్నా ఆయన నియోజకవర్గం వ్యవహారాల్లో తలదూర్చింది లేదంట. అక్కడ షాడో ఎమ్మెల్యేగా టీడీపీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కోడుమూరు నియోజకవర్గంలో ఏది జరగాలన్నా విష్ణువర్ధన్‌రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందంట. ఎమ్మెల్యే దస్తగిరి ఏం చేయాలన్నా, ఏ కార్యక్రమంలో పాల్గొనాలన్నా విష్ణువర్ధన్‌రెడ్డి పర్మిషన్ తీసుకోవాల్సిందే అంటున్నారు.
రెడ్డి వర్గం నేతల పెత్తనంలో కుమిలిపోతున్న ఎమ్మెల్యేలు
ఏ పని చేయాలన్నా షాడో ఎమ్మెల్యేలను సంప్రదించి చేయాల్సిన పరిస్థితిల్లో.. పేరుకే తాము ఎమ్మెల్యేలమని నందికొట్కూరు, కోడుమూరుల్లో గెలిచిన అధికార పార్టీ అభ్యర్ధులు తెగ ఫీలై పోతున్నారంట. ఎస్సీ రిజర్వుడు ఎమ్మెల్యేలకు ఎలాంటి అధికారాలు లేవని, కేవలం పార్టీ సీనియర్ నేతలైన రెడ్డివర్గం నాయకులు చెప్పిందే చేయాల్సి వస్తోందని… వారిని ప్రశ్నించలేక తమలో తాము కుమిలిపోతున్నారట. ఎమ్మెల్యేలంటే తమ నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ.. క్యాడర్‌ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తుంటారు. కానీ ఆ నియోజకవర్గాలలో మాత్రం అందుకు భిన్నంగా ఆ షాడో ఎమ్మెల్యేలు ఏమి చెప్తే అదే చేయాల్సి వస్తోందంట. గతంలో వైసిపి హయంలో కూడా రిజర్వ్‌డ్ స్థానాల ఎమ్మెల్యేలకు పవర్స్ లేకుండా చేయడంతో అర్థర్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నందికొట్కూరులో ఒక వెలుగు వెలిగిన బైరెడ్డి సిద్దార్థ
నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక వెలుగు వెలిగిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. శాప్ చైర్మన్‌గా, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా, జగన్ సన్నిహితుల్లో ఒకరిగా ఆయన ఫోకస్ అయ్యారు. తన సెగ్మెంట్లో సిద్దార్ధరెడ్డి పెత్తనం భరించలేక అర్థర్ ఆయనతో విభేదించారు. అప్పట్లో రెండు వర్గాలకు రాజీ చేయడానికి పార్టీ అధిష్టానం మంత్రులను పంపించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
Also Read: ఆర్మూర్ నుండి జీవన్ రెడ్డి ఔట్?
హర్షవర్ధన్ చేతిలో కీలుబొమ్మలా పనిచేసిన సుధాకర్
మరొక సెగ్మెంట్ కోడుమూరులో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ తనదైన శైలిలో ప్రజలలో ఫాలోయింగ్ పెంచుకోవడానికి ప్రయత్నించినా.. ఆ నియోజకర్గంలో కూడా హర్షవర్ధన్ రెడ్డి ఆధిపత్యమే నడిచిందంటారు. హర్షవర్ధన్‌రెడ్డి అన్ని వ్యవహారాలు తానే చక్కబెడుతుండటంతో సుధాకర్ చేసేదేమీ లేక ఆయన చేతిలో కీలుబొమ్మలా పనిచేశారంటారు. ఈసారి కూటమి ప్రభుత్వంలో ఆరెండు నియోజకవర్గాల రాజకీయ ముఖచిత్రాలు మారుతాయని నియోజకవర్గ ప్రజలు ఆశించినా ఆ రిజర్వ్‌డ్ సెగ్మెంట్లలో ఏమాత్రం మార్పు రాలేదన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం స్పందించి ఆ ఎమ్మెల్యేల తలరాతలు మారేలా… వారికి పవర్స్ ఇస్తుందో? లేదో చూడాలి
Story By Apparao, Bigtv