స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎంతోమంది తెలుపు, కాషాయం, ఆకుపచ్చ కలగలసిన రంగులతో వంటకాలను సిద్ధం చేస్తారు. మరి కొంతమందికి ఎలా చేయాలో తెలియక సతమతమవుతారు. అలాంటి వారి కోసం ఇక్కడ మేము ఇచ్చాము. తిరంగా పులావ్, తిరంగా దోశ రెసిపీ వీటిని చాలా సులువుగా చేసేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీలు ఎలా చేయాలో తెలుసుకోండి.
తిరంగా పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం – ఒక కప్పు
క్యారెట్ – రెండు
టమోటాలు – ఒకటి
పసుపు – అర స్పూను
కారం – ఒక స్పూన్
నూనె – తగినంత
ఉప్పు – రుచికి సరిపడా
పనీరు తురుము – అరకప్పు
జీడిపప్పులు – గుప్పెడు
పాలకూర – మూడు కట్టలు
పచ్చి బఠానీలు – గుప్పెడు
పచ్చిమిర్చి – నాలుగు
జీలకర్ర – అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు స్పూన్లు
గరంమసాలా – ఒక స్పూను
కొత్తిమీర తరుగు – మూడు స్పూన్లు
తయారీ ఇలా
1. బాస్మతి బియ్యాన్ని ముందుగానే కడిగి అరగంట నానబెట్టుకోవాలి.
2. ఇప్పుడు నారింజ, తెలుపు, ఆకుపచ్చ ఇలా మూడు పొరల్లో పులావ్ వచ్చేందుకు సిద్ధం చేసుకోవాలి.
3. ముందుగా నారింజ రంగు పొర కోసం స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, క్యారెట్ తురుము, టమోటా ప్యూరీ, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా ఉడికించాలి.
4. ఇది దగ్గరగా అయితే కాషాయ రంగులోకి మారుతుంది. ఇప్పుడు దీనిలో నానబెట్టిన కొంత బియ్యాన్ని వేసి కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. నీళ్లు వేయకూడదు.
5. ఇప్పుడు తెలుపు పొర కోసం మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి నూనె వేసి జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత పనీరు తురుము, జీడిపప్పు తురుము వేసి వేయించుకోవాలి. అలాగే ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు మరి కొంత బియ్యాన్ని ఇందులో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
6. ఇప్పుడు ఆకుపచ్చ పొర కోసం మరొక కళాయిని స్టవ్ మీద పెట్టాలి. అందులో నూనె వేసి జీలకర్ర, పాలకూర ప్యూరీ, పచ్చి బఠానీలు తురుము, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఇది ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అప్పుడు మిగిలిన బియ్యం ఇందులో వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
7. ఇప్పుడు పులావ్ ఉండేందుకు పెద్ద పాత్రను తీసుకోవాలి. ముందుగా నారింజ పొరను వేయాలి. అంటే క్యారెట్ మిశ్రమాన్ని అడుగు భాగంలో వేయాలి.
8. ఆ తర్వాత తెలుపు పొర కోసం పనీర్ మిశ్రమాన్ని వేయాలి.
9. ఇక చివరగా ఆకుపచ్చ రంగులో ఉన్న మిశ్రమాన్ని వేయాలి. పైన మూత పెట్టి చిన్న మంట మీద పది నిమిషాలు ఉడికించాలి.
10. పులావ్ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
11. ఇప్పుడు దాన్ని కలపకుండా గరిటతో ఒక వైపు నుంచి కింద వరకు తీసి ప్లేట్లో వేస్తే మువ్వన్నెల జెండాలా కనిపిస్తుంది.
12. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేయడమే ఇది అద్భుతంగా ఉంటుంది. మేము చెప్పిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి మీకు కచ్చితంగా నచ్చుతుంది.
………………………………………..
తిరంగా దోశ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
దోశ పిండి – ఒకటిన్నర కప్పు
నీరు – తగినంత
ఉప్పు – రుచికి సరిపడా
క్యారెట్ – ఒకటి
పాలకూర పేస్ట్ – అరకప్పు
కొత్తిమీర – రెండు స్పూన్లు
రెసిపీ ఇదిగో
1. దోశ పిండిని మూడు భాగాలుగా చేసుకోవాలి.
2. ఒక భాగంలో తురిమిన క్యారెట్ వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అది కాషాయ రంగులోకి మారుతుంది.
3. ఇక రెండో భాగంలో పాలకూరను వేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. ఇది ఆకుపచ్చ రంగులోకి మారుతుంది.
4. ఇక దోశ పిండి తెల్లగానే ఉంటుంది. కాబట్టి తిరంగా దోశ వేసేందుకు సిద్ధమవ్వాలి.
5. దోశ పెనాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. కొద్దిగా నూనె వేయాలి.
6. ఇప్పుడు మొదటిగా కాషాయం రంగు దోశ పిండిని నిలువుగా వేసుకోవాలి.
7. ఆ తర్వాత తెలుగు రంగు కోసం సాధారణ దోశ పిండిని వేసుకోవాలి.
8. దాని తర్వాత ఆకుపచ్చ రంగులో ఉన్న దోశ పిండిని వేయాలి. దీన్ని రెండు వైపులా కాల్చితే తిరంగా దోశ సిద్ధమైపోతుంది.