Armoor BRS Ex MLA: ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ సీనియర్ నేతలు మొదటి సారి తిరుగుబాటు మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వారి నియోజవర్గానికి చుట్టపు చూపుల వచ్చి వెళుతుండడంతో పార్టీ క్యాడర్ డీలా పడిపోయింది. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్‌రెడ్డి ఓడిపోయిన మరుసటి రోజు నుంచి కన్నెత్తి చూడలేదంట. ఆడపదడపా వచ్చినప్పుడు మాత్రం హడావిడి చేసి వెళ్లిపోతున్నారంట. ఆయన పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదని, క్యాడర్‌కు ధైర్యం చెప్పే దిక్కులేకుండా పోయిందని గులాబీశ్రేణులు జీవన్‌రెడ్డిపై భగ్గుమంటున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన్ని పక్కనపెట్టక పోతే జిల్లాలో పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తున్నాయి.
మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు
తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన 2014 లో జరిగిన తొలి ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో గులాబీపార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నాయకులు పలువురు జీవన్‌రెడ్డి విజయానికి వెన్నుదన్నుగా నిలిచారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సన్నిహితుడిగా మెలుగుతూ వచ్చిన జీవన్‌రెడ్డి కొద్దికాలం సీనియర్ నాయకులను గౌరవించినప్పటికీ .. తర్వాత వారిని పట్టించుకోకుండా కొద్ది కొద్దిగా దూరం పెడుతూ వచ్చారంట. ఇక అప్పటినుంచి భూకబ్జాలు, బెదిరింపులు అక్రమాలకు పాల్పడటం … ఎదిరిస్తే అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపడం వంటి అరాచకాలు చేశారని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
జీవన్‌రెడ్డిని ఆర్మూరు నుంచి తప్పించాలని డిమాండ్
2018లో జరిగిన ఎన్నికల్లో జీవన్‌రెడ్డి మరోసారి ఆర్మూరు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి గెలిచిన తర్వాత పార్టీలో ఒక మాస్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ, తన నియోజకవర్గంలో మాత్రం క్యాడర్ కు తీవ్ర నష్టం చేశారని సొంత పార్టీ నేతల నుంచి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై గులాబీ శ్రేణులే తిరుగుబాటు చేస్తూ, ఆయన్ని ఆర్మూరుకు దూరం చేయాలని డిమాండ్ చేస్తుండటం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రూ. కోట్ల బకాయిల కారణంగా సీజ్ అయిన జీవన్ మాల్
ఇప్పటికే జీవన్‌రెడ్డికి చెందిన జీవన్ మాల్, ఆర్టీసీ స్థలం లీజుకు సంబంధించి బకాయిలు కోట్ల రూపాయల్లో ఉండడంతో నోటీసులు జారీ అయ్యాయి. జీవన్‌మాల్ సీజ్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడు కొత్తగా సొంత పార్టీ క్యాడర్ జీవన్‌రెడ్డి చేసిన అరాచకాలపై ధ్వజమెత్తుతుండటం గులాబీ పార్టీలో కలకలం రేపుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకసారి కల్వకుంట్ల కవిత ఓటమికి, రెండవసారి బాజిరెడ్డి గోవర్ధన్ ఓటమికి ఆర్మూరు నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో ఓట్లు రాకపోవడమే కారణమని, దానికి కారణం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వైఖరే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లా వ్యాప్తంగా పార్టీ పరిస్థితి దిగజారిపోయిందని విమర్శలు
జీవన్ రెడ్డి ఈ 10 ఏళ్లలో చాలా అరాచకాలు చేశారని బెదిరింపులు, భూకబ్జాలు, అక్రమ కేసులు పెట్టించి ప్రజలను ఇబ్బంది పెడుతూ, సొంత పార్టీ కార్యకర్తలను ముప్పతిప్పులు పెట్టి జైలపాలు చేశారని పార్టీ క్యాడర్ ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ టార్గెట్ చేస్తోంది. తన అరాచకాలను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులను సైతం జీవన్‌రెడ్డి బెదిరించారంట. జీవన్ రెడ్డికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టినప్పటి నుంచి ఒక నియోజకవర్గమే కాదు జిల్లావ్యాప్తంగా పార్టీ పరిస్థితి దిగజారిపోయిందని తిరుగుబాటు దారులు ఆరోపిస్తున్నారు. వెంటనే జీవన్ రెడ్డినీ పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని హెచ్చరిస్తున్నారు.
జీవన్‌రెడ్డికి వ్యతిరేకంగా పెరుగుతున్న ధిక్కార స్వరాలు
సొంత నియోజకవర్గంలోనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ, పార్టీ శ్రేణుల ఆగ్రహానికి గురవుతున్న జీవన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పార్టీకి ఏం న్యాయం చేస్తారని, వెంటనే ఆయన్ని తప్పించాలన్న ధిక్కార స్వరాలు పెరిగిపోతున్నాయి. ఆర్మూర్ నియోజవర్గంలో సొంత పార్టీ నాయకులు ఆయనపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తుంటే.. మిగిలిన నియోజకవర్గాల నేతలు జీవన్‌రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: వివాదంగా జగన్ పల్నాడు టూర్
ఆర్మూరులో దాదాపు 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన జీవన్‌రెడ్డి
2018 ముందస్తు ఎన్నికల్లో 28 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచిన జీవన్‌రెడ్డి గత ఎన్నికల్లో దాదాపు 30 వేల తేడాతో పరాజయం పాలవ్వడానికి ఆయన అరాచకాలే కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రావాలంటే జిల్లాకు పార్టీని సమర్ధంగా నడిపించే నాయకుడు కావాలని.. లేకపోతే ఆర్మూర్ నియోజవర్గంలో పార్టీ పోతనమైనట్లు జిల్లాలోని మిగిలిన నియోజవర్గాల్లోనూ అధోగతి పాలవుతుందని క్యాడర్ అధిష్టానానికి సూచిస్తోంది. త్వరలోనే కేసీఆర్, కేటీఆర్‌లను కలిసి ఈ విషయం నివేదిస్తామని ఆర్మూరు సీనియర్ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. మరి చూడాలి ఈ పంచాయతీని గులాబీ పార్టీ పెద్దలు ఎలా సెటిల్ చేస్తారో.
Story By Apparao, Bigtv