ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ దొరికితే చాలు అనుకుంటారు ఎమ్మెల్యేలు. ప్రతిపక్షం ఎమ్మెల్యేలు కూడా సిఎం ను కలిసే అవకాశం వస్తే వదులుకోరు. సీఎం దృష్టిలో పడేందుకు నానా హంగామా చేస్తారు. కానీ దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు వరంగల్ జిల్లాలోని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా సీఎం అయితే నాకేంటి అన్నట్టుగా దొంతి వ్యవహారం నడుస్తోందట. తన వ్యక్తిగత కారణాలతో పార్టీ శ్రేణులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాకు వచ్చిన ఏ సందర్భంలోనూ నర్సంపేట ఎమ్మెల్సే దొంతి మాధవరెడ్డి ఆయన్ని కలవలేదు. అసెంబ్లీ లోనూ ఎదురు పడింది లేదు. భారీ వర్షాలకు జరిగిన పంట నష్టం పరిశీలించేందుకు ఆగస్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. తిరుగు ప్రయాణంలో నర్సంపేట నియోజక వర్గం మీదుగా రోడ్డు మార్గంలో వరంగల్ వెళ్లారు. సీఎం నియోజక వర్గం మీదుగా వెళ్లినా కనీసం కలిసేందుకు దొంతి మాధవ రెడ్డి రాలేదు.
వరంగల్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నియోజక వర్గాల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం నిర్వహించిన సమీక్షకు దొంతి మాధవ రెడ్డి హాజరు కాలేదు. నర్సంపేటలో మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి సీఎంను ఆహ్వానించకుండా మంత్రులను ఆహ్వానించి తతంగం కానిచ్చేశారు. తాజాగా ఇందిరా శక్తి విజయోత్సవ సభకు సైతం హాజరు కాలేదు. అలాగని ఆయన ఇతర పనుల్లో బిజీగా ఉన్నారా..? అందుబాటులో లేరా..? అంటే అదీ లేదు. నియోజకవర్గంలోనే ఉంటారు కానీ సీఎం కార్యక్రమాల్లో పాల్గొనకుండా.. అంతా నా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తారు.
Also Read: దామోదర వర్సెస్ గూడెం.. గొడవకు కారణం ఇదేనా..?
అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా పీసీపీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి.. హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం నుంచే ఆయన యాత్ర మొదలు పెట్టారు. మేడారం నుంచి యాత్ర నర్సంపేట నియోజకవర్గం మీదుగా మహబూబాబాద్‌కు చేరేలా పాదయాత్ర షెడ్యుల్ ఖరారైంది. అయితే తన నియోజక వర్గంలో మీ పాదయాత్ర వద్దని మాధవరెడ్డి నిర్మొహమాటంగా చెప్పడంతో పాదయాత్ర రూట్ మార్చుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి దొంతి వైఖరి సినిమా సీతయ్యలా తయారైందంటున్నారు.
ఏవో వ్యక్తిగత కారణాలతో దొంతి మాధవరెడ్డి అలా వ్యవహరిస్తున్నారన్న టాక్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవాలను వరంగల్ ఆర్ట్స్ వేదిక నిర్వహించారు వాటికి కూడా ఆయన వెళ్లకపోవడంతో.. ఎందుకు వెళ్లలేదని తన సొంత అనుచరులే నిలదీస్తున్నారం. పైగా విజయోత్సవ వేడుకలకు పార్టీ శ్రేణులను సైతం వెళ్ల వద్దని చెప్పడంతో దొంతి తీరుపై నర్సంపేట కాంగ్రెస్ సీనియర్లు గుర్రుగా ఉన్నారట. తనను ఎమ్మెల్యేను చేసిన సొంత పార్టీపై మొండితనం పనికి రాదని.. వైఖరి మార్చుకోకపోతే తీవ్రంగా నష్టపోతావని వారు హెచ్చరిస్తున్నారంట.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ అధిష్టానాన్ని కాదని మొండితనానికి పోతే నర్సంపేట నియోజకవర్గంలో అసలుకే ఎసరు వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే తన తీరు మార్చుకోకపోతే.. మాట వినే ప్రసక్తే లేదని.. తాము కూడా సీతయ్య సినిమా డైలాగ్ చెప్పాల్సి వస్తుందని పార్టీ శ్రేణులు అంటుండటం విశేషం. ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్న, ఓ కాంగ్రెస్ సీనియర్ నేత డైరెక్షన్ లోనే ఎమ్మెల్యే దొంతి అడుగులు వేస్తున్నారని, అందుకే అధిష్టానంతో గ్యాప్ పెరిగిందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. తనను గెలిపించిన పార్టీపై అలక మంచిది కాదంటూ సన్నిహితులు సలహా ఇస్తున్నా తీరు మార్చుకోకుండా అలాగే ప్రవర్తిస్తుండటంతో హస్తం శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. అతిగా మొండితనానికి పోతే.. తామే మొండిచేయి చూపాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారట సీనియర్ కాంగ్రెస్ నేతలు. మరి చూడాలి దొంతి మాధవరెడ్డి ఆ సీతయ్య పాత్రలో నుంచి ఎప్పుడు బయటకొస్తారో?