Rajiv Swagruha Properties: తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ సర్కార్. ఎవరైనా తమ సొంతింటి కలను నెరవేర్చుకొనే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది ప్రభుత్వం. అందుకు ప్రభుత్వం ప్లాట్లను వేలం వేస్తుండగా, అందులో పాల్గొని సొంతింటి కలను సాకారం చేసుకొనే ఛాన్స్ మీ ముందుకు తెచ్చింది. మరెందుకు ఆలస్యం పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తెలంగాణ వ్యాప్తంగా 2007లో రాజీవ్ స్వగృహ పథకాన్ని నాటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ముఖ్యలక్ష్యం ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి వేలంపాట ద్వారా లబ్దిదారులకు అందించడం. అందుకోసం గతంలో ప్రభుత్వ స్థలాలో ప్లాట్లను సైతం నిర్మించారు. వాటిలో కొన్ని విక్రయించగా, మరికొన్ని అలాగే ఉండిపోయాయి. అలా మిగిలిన వాటిని ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వేలంపాట నిర్వహించాలని నిర్ణయించింది.
హైదరాబాద్ లోని జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ పరిధిలో ఈ ప్లాట్లు సుమారు 1500 నుండి 2000 వరకు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ ప్లాట్లను అసలు ఏమి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తాజాగా మూడు ఉన్నత స్థాయి కమిటీలను నియమించింది. ఆ కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం వాటిని వేలం వేయాలని నిర్ణయించింది. అది కూడా డిసెంబర్ నెలలో విడతల వారీగా వేలం వేసి, పాట పాడుకున్న వారికి అప్పగించాలని ప్రభుత్వం భావించింది. వీటిలో అధికంగా జిహెచ్ఎంసి పరిధిలో ప్లాట్లు ఉండగా, ప్రభుత్వానికి ఈ వేలంపాట ద్వారా సుమారు రూ. 2 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని సంబంధిత అధికారులు అంచనా వేశారు.
ఈ నిధులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి, ప్లాట్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇళ్లు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లే భావించవచ్చు. అలాగే స్వయంగా ప్రభుత్వమే వేలం ప్రకటన వేయనుండగా, వేలంపాటలో అధికంగా పాటదారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. మీ సొంతింటి కలను సాకారం చేసుకొనేందుకు డిసెంబర్ నెల వరకు ఆగండి.. మీ కలను సాకారం చేసుకోండి. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు సుమా!