Karregutta Operation: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని సాంద్ర అటవీ ప్రాంతం.. మరోసారి ఉత్కంఠ వాతావరణం నలకొంది. దేశవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు టాప్ కమాండర్ హిడ్మా తన దళంతో అక్కడ తలదాచుకున్నట్లు.. ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారం ఆధారంగా, కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి.
భద్రతా వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం హిడ్మా 200 మంది PLGA బెటాలియన్ సభ్యుల సంరక్షణలో.. కర్రెగుట్టల లోతుల్లో తలదాచుకున్నట్లు గుర్తించారు. హిడ్మా దళం గతంలో దాంతేవాడ, సుక్మా, భీమపల్లి ప్రాంతాల్లో జరిగిన అనేక దాడులకు మాస్టర్‌మైండ్‌గా పరిగణించబడింది. అందువల్ల ఈసారి కూడా బలగాలు అత్యంత అప్రమత్తతతో ముందుకు సాగుతున్నాయి.
ఇటీవల థర్మల్ సెన్సార్ డ్రోన్లు, హై-రెజల్యూషన్ సర్వైలెన్స్ కెమెరాలు మావోయిస్టుల కదలికలను స్పష్టంగా రికార్డ్ చేశాయి. ఈ వీడియోలను విశ్లేషించిన తర్వాత, బలగాలు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఉన్నట్లు ధృవీకరించాయి. వెంటనే అక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసే పనిని ప్రారంభించారు.
ఇప్పటికే సుమారు 5,000 మంది కేంద్ర భద్రతా బలగాలు కర్రెగుట్టల్లో.. కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. వీరికి తోడుగా తాజాగా మరో మూడు కొత్త బెటాలియన్లు, 217, 212, 237 CRPF యూనిట్లు అక్కడికి తరలించబడ్డాయి. ఈ బలగాలు అత్యాధునిక ఆయుధాలు, నైట్ విజన్ పరికరాలతో, అడవిలో గుహా తాలూకా దళాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందినవిగా గుర్తించారు.
ఇకపోతే, ఛత్తీస్‌గఢ్ వైపు నుండి కూడా బలగాలు మోహరించాయి. సరిహద్దు ప్రాంతాల్లో భీమారం, గొల్లపల్లి ప్రాంతాల్లో కొత్త బేస్ క్యాంపులు నిర్మిస్తున్నారు. భీమారంలో క్యాంపు ఇప్పటికే పూర్తయింది. గొల్లపల్లి క్యాంపు నిర్మాణం కూడా చివరి దశలో ఉంది. అదనంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మరో రెండు తాత్కాలిక క్యాంపులు ఏర్పాటు చేయడంతో మావోయిస్టులకు వెనుకకు వెళ్ళే మార్గాలు దాదాపు మూసుకుపోయాయి.
సమాచారం ప్రకారం, హిడ్మా బృందం ఇటీవలే కొత్త సభ్యులను నియమించుకొని, అడవుల్లో తమ ప్రభావాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బలగాలు సర్జికల్ స్ట్రైక్ తరహా ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నాయి.
అదనపు బలగాల మోహరింపుతో భారీ ఎన్‌కౌంటర్ జరిగే అవకాశాలు ఉన్నాయని.. స్థానిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి మోహరింపుల తర్వాత పెద్ద ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. అడవుల్లో హిడ్మా దళం కదలికలు తగ్గకపోవడంతో, బలగాలు ఈసారి పూర్తి చుట్టుముట్టే వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి.
భద్రతా అధికారులు, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర గూఢచారి సంస్థలు సమన్వయంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఏ చిన్న సమాచారం వచ్చినా వెంటనే బలగాలు స్పందించేలా ఫాస్ట్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా, డ్రోన్ సర్వైలెన్స్ రాత్రింబవళ్లు కొనసాగుతుంది.