కేసీఆర్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో జీవో నెం. 317 చెలగాటమాడింది. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్‌తో ఉద్యమానికి ఊపిరిలూదిన కేసీఆర్ వెన్నంటే నడిచారు ఉద్యోగులు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో ఉద్యోగుల పాత్ర కీలకంగా మారింది. ఉద్యమానికే కాదు.. కేసీఆర్‌కూ ఊతంగా నిలిచారు.
అధికారం వచ్చిన తరువాత గానీ అసలు రూపం బయటపడదు అన్నట్టుగా.. ఉద్యమకాలం నాటి సహచరులంతా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా మారిన తరువాత తీరు మారింది. అహంకారం పెరిగింది. పట్టింపు లేకుండా పోయింది.కేసీఆర్ తొలత ఉద్యోగులతో బాగానే మసలుకున్నారు. కానీ దగ్గరకు తీస్తే మొత్తం నెత్తిమీదెక్కి పెత్తనం చేస్తారనే అనుమానామో.. సహజంగా ఉన్న అప్పటి వరకు అణిచిపెట్టుకున్న అసలు రూపమో తెలియదు గానీ, ఉద్యోగులను దూరం పెట్టేశాడు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత.. సీఎంగా ఫిట్‌మెంట్ బాగానే ప్రకటించి వారిని ప్రసన్నం చేసుకున్నా.. ఆ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కుక్క తోకనాడించాలి గానీ, తోక కుక్కనాడిస్తుందా? మీరు మా వెనుక లేకపోతే ఏందీ.. జనం మా మాటే వింటారు.. మమ్మల్నే మళ్లీ మళ్లీ గెలిపిస్తారనే అహం కూడా తోడైంది. అందుకే జీవో నెం. 317 లాంటి నిర్ణయాలు వెలువడ్డాయి.
ఈ జీవో వల్ల, కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయాల వల్ల పెద్ద ఎత్తున నష్టపోయింది ప్రభుత్వ ఉద్యోగులే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్‌పై కూడా ఉద్యోగులు సమర శంఖం పూరిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో పెండింగ్ డీఏలు, పీఆర్‌సీ, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ నిధుల విడుదలపై సర్కార్ క్లారిటీ ఇవ్వనుంది. ఈ నిర్ణయాన్ని బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందంటున్నారు ఉద్యోగులు.
అయితే సర్కార్‌పై ఉద్యోగుల్లో పెరుగుతున్న గ్యాప్‌ను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కేసీఆర్ ..హరీశ్‌ను రంగంలోకి దింపాడు. అందుకే హరీశ్ తగుదునమ్మా అంటూ ఉద్యోగుల సమస్యలను మీదేసుకుని మరీ మాట్లాడే ప్రయత్నం చేయడం, వారిని కలిసి మద్దతనిస్తామనే విధంగా వ్యూహాన్ని ప్రదర్శించినా ఫలితం దక్కలేదు. బెడిసికొట్టింది. హరీశ్‌ను దగ్గరకు కూడా రానీయడం లేదు ఉద్యోగులు.
అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఆలోచనలు తీరు ఎంతలా ఇబ్బంది పెట్టాయో.. కింది స్థాయిలో కేటీఆర్, హరీశ్, శ్రీనివాస్ గౌడ్ తదితర మంత్రుల బృందం కూడా ఉద్యోగులను కనీసం పట్టించుకోలేదు. ఆత్మగౌరవం కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే .. స్వరాష్ట్రంలోనే దాన్ని దూరం చేసి మరీ చూపిన ఆ వైనాన్ని, గత పాలన చేదు అనుభవాలను వారింకా మరిచినట్టు లేదు. అందుకే హరీశ్ పప్పులు ఉద్యోగుల దగ్గర ఉడకలేదు.
మేం మిమ్మల్ని నమ్మడం లేదు.. మీ అవసరం మాకు లేదు.. అని ఖరాఖండిగా ముఖం మీదే ఉద్యోగులు చెప్పిన విధానం. .. కేసీఆర్ పదేళ్ల పాలనను ఇంకా ఉద్యోగులు మరిచిపోలేదనే విషయాన్ని పట్టిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా, నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపుల కోసం డిసెంబర్ 2021లో 317 జీవోను తెచ్చింది కేసీఆర్ సర్కార్.
అయితే దీని అమలు విధానం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. స్థానికత కోల్పోయారు. ఉద్యోగుల సొంత జిల్లాలు (చదువుకున్న ప్రాంతాలు) కాకుండా, కేవలం సీనియారిటీ ప్రాతిపదికన కొత్త జిల్లాలకు కేటాయించారు. దీనివల్ల వేలాది మంది తమ సొంత జిల్లాలను వదులుకుని నాన్-లోకల్స్‌గా మారాల్సి వచ్చింది. సీనియారిటీ ప్రాతిపదికన కేటాయింపులు జరగడం వల్ల.. సీనియర్ ఉద్యోగులంతా పట్టణాలు, అభివృద్ధి చెందిన జిల్లాలను ఎంచుకోగా, జూనియర్ ఉద్యోగులు విధిలేక మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది.
ఇది ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. కుటుంబాల విచ్ఛిన్నం అయ్యాయి. స్పౌజ్ కింద భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికీ, వేర్వేరు జిల్లాలకు బదిలీ అయ్యారు. దీంతో వందలాది కుటుంబాలు మానసిక క్షోభకు గురయ్యాయి. ప్రమోషన్లపై ప్రభావం పడింది. కొత్త జిల్లాల కేడర్ ప్రకారం సీనియారిటీ జాబితాలు మారడంతో ఉద్యోగుల పదోన్నతులు, పే-స్కేల్స్ వంటి అంశాలపై తీవ్ర ప్రభావం చూపింది.
కేసీఆర్ పాలనపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఆ పార్టీ ఓటమికి ఇదీ ఓ ప్రధాన కారణంగా చెప్పుకుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సమస్యపై దామోదర రాజనర్సింహ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికను కూడా సమర్పించింది. పూర్తి స్థాయిలో ఈ జీవోను రద్దు చేయకపోయినప్పటికీ, బాధితులకు ఊరట కల్పించేలా మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్ (పరస్పర బదిలీలు), స్పౌజ్ కేటగిరీ బదిలీల కోసం వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు మార్గదర్శకాలను విడుదల చేస్తూ ప్రభుత్వం కొన్ని సవరణలతో కూడిన జీవోలను ..జీవో 243, 244, 245 లను జారీ చేసింది.
అయినప్పటికీ, తమకు శాశ్వత స్థానికత హోదా కల్పించాలని, ‘సూపర్ న్యూమరరీ’ పోస్టులు సృష్టించి సొంత జిల్లాలకు పంపాలని బాధితులు ఇప్పటికీ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. విద్యాశాఖలో ఈ జీవోలు ఇంకా అమలు చేయకపోవడంతో అక్కడ ఇంకా వ్యతిరేకత కొనసాగుతోంది.
టీఆర్ఎస్ చీఫ్ తాజాగా ఈ ఇష్యూపై మాట్లాడటంతో దీనిపై మళ్లీ డిస్కషన్ నడుస్తోంది. అప్పుడు ఈ జీవో గురించి కేసీఆర్ ప్రభుత్వానికి తానెంత చెప్పినా పట్టించుకోలేదన్నారామె.