ఎన్డటీవీకి కేటీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. కీలక విషయాలు వెల్లడించాడు. మూడు అంశాలను ప్రతిపాదికగా చేసుకుని, తిరిగి తాము అధికారంలోకి రావడం పక్కా అని కుండబద్దలు కొడుతున్నాడు.
ఒకటి.. బీఆర్‌ఎస్ పార్టీ ఇంకా జనాల్లో సజీవంగా ఉండటం. తెలంగాణ ప్రజలు తాము ఓడిపోయామని మొత్తం మైండ్‌లో నుంచి పార్టీని తుడిచిపెట్టలేదంటున్నాడాయన. ఇంకా బలంగా ఉందని, ప్రత్యామ్నాయంగానే జనాలు ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చాడు. తక్కువ మార్జిన్‌తో ఓటమి పాలైన విషయాన్ని వెల్లడించిన కేటీఆర్.. రేవంత్ ఏమీ మాస్ అప్పీల్ ఉన్న నేతేమీ కాదు.. ఆయనకు జనాలు బ్రహ్మరథం పట్టేలా విజయాన్నేమీ అందించలేదు. బొటాబొటి మెజారిటీతో , మేజిక్ ఫిగర్‌కు చేరువలో గెలిచి.. అధికారాన్ని కైవసం చేసుకున్నారని అన్నాడు. 1.8 ఓట్ల శాతమే తమని ఓటమి పాలు చేసిందని కూడా వివరించాడు.
ఇక రెండో గెలుపు అంచనా.. రేవంత్ వెయ్యి రోజుల పాలన అట్టర్ ఫ్లాప్. వంద రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మాటిచ్చి మోసం చేశారని, వెయ్యి రోజులైనా వాటిని నెరవేర్చలేదన్నాడు. జనాల్లో ఇది బాగా పాతుకుపోయిందన్నాడు. ఇక్కడే కాంగ్రెస్ పాలనను, కేసీఆర్ పాలనతో సరిపోల్చి చూసుకుంటున్నారని ఇదే తమకు పెద్ద ప్లస్ పాయింట్ కానుందని తెలిపాడు కేటీఆర్. ఇక జనాల మైండ్ సెట్ మార్చడం ఇప్పుడు రేవంత్ తరం కాదన్నాడు. జనం ఫిక్స్ అయిపోయారు. రేవంత్‌కు పరిపాలన చేతకాదని, ఇచ్చిన హామీలు నెరవేర్చడం కూడా వల్లకాదని. అందుకే కేసీఆర్ రాక కోసం వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నాడు.
ఇక మూడో పాయింట్.. బీజేపీ ఎదగకపోవడం. రాష్ట్రంలో బీజేపీ ఎదగకపోవడం వల్ల అది తమకే మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు కేటీఆర్. ఎంపీ ఎన్నికల్లో మోడీ ముఖం చూసి ఓట్లేసి గెలిపించుకుంటున్న జనం.. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి వారిని తుక్కు తుక్కు ఓడగొడుతున్నారని అన్నాడు. అంటే ఇక్కడ బీజేపీ నేతల ముఖం చూసి ఓట్లు పడటం లేదని, మోడీ కోసమే ఎంపీ ఎన్నికల్లో ఓట్లు పడుతున్నాయన్నారు.
బీజేపీ ఎదగకపోవడంతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీనే ఆల్టర్నేట్ పార్టీగా చూస్తున్నారని, అందుకే మరోసారి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని అన్నాడు. ఈ మూడు కీలక అంశాల ఆధారంగానే తాము మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నామని, కేసీఆర్‌ను జనం అంత తొందరగా మరిచిపోలేరన్నాడు.