పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ .. తన సొంత ఇలాఖా నిజామాబాద్ జిల్లా నుంచి పోటీ చేయడంపై ఇప్పుడే క్లారిటీ వచ్చేసింది. ఆయన సొంత ఊరు భీమ్‌గల్ మండలం రహత్‌నగర్ కావడం.. ఇది బాల్కొండ నియోజకవర్గ పరిధికి రావడంతో.. ఇక్క అక్కడ్నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్టు తేల్చేశారు.
స్వయానా ఈ విషయాన్ని ఆయనే పరోక్షంగా వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా నుంచి తను పోటీ చేయనున్నట్టు మీడియాకు చెప్పారు. గతంలో ఓసారి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. ఆ తరువాత ఓ టర్ము గ్యాప్ ఇచ్చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ అర్బన్ నుంచే పోటీ చేద్దామని రెడీ అయినా.. కామారెడ్డి నుంచి రేవంత్‌రెడ్డి పోటీకి దిగడంతో.. సమీకరణలో భాగంగా షబ్బీర్ అలీని అర్బన్‌కు షిఫ్ట్ చేశారు.
దీంతో మహేశ్ మొన్నటి ఎన్నికల్లో టికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. ఎమ్మెల్సీగా అధిష్టానం అవకాశం ఇవ్వడం.. ఆ వెంటనే టీపీసీసీ చీఫ్‌గా అరుదైన అవకాశం దక్కడం.. చకచకా జరిగిపోయాయి. అధిష్టానం మహేశ్ విధేయతకు పట్టం గట్టాయి.
అయితే మహేశ్‌కు ఎమ్మెల్యేగా గెలుపొంది… అవసరమైతే బీసీ సీఎం నినాదాన్ని అధిష్టానం బలంగా తీసుకుంటే తాను సీఎం పీఠమెక్కాలనే ఆలోచన ఉంది. నిజామాబాద్‌కే చెందిన దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత డీ శ్రీనివాస్ పీసీసీ చీఫ్‌గా చేయడం, రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడం.. సీఎం పీఠం ఎక్కే చాన్స్ తృటిలో మిస్ కావడంతో చివరి నిమిషంలో జిల్లాకు సీఎం సీటు దూరమైంది.
ఇప్పుడు మహేశ్ దీన్ని నెరవేరుస్తారా? అనే చర్చ కూడా సాగుతోంది. తన సొంత ఇలాఖా భీమ్‌గల్ మండలంలోని రహత్‌నగర్‌లో ఇటీవలే ఆయన తన సొంత జాగా 11 ఎకరాలను ప్రభుత్వ పాఠశాలకు, అభివృద్ధి పనుల కోసం దానం చేశారు. దీంతో ఆయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోయింది.
ఇప్పుడు ఏకంగా తను నిజామాబాద్ జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో .. దాదాపుగా ఆయన బాల్కొండ నుంచి పోటీ చేయడం ఖాయంగా చెబుతున్నారు. అక్కడ వరుసగా మూడు సార్లు మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గెలిచారు. సీఎంకు సన్నిహితుడిగా పేరున్న వేములకు పోటీగా మహేశ్‌ను దింపడమే కరెక్టని సీఎం రేవంత్ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటి వరకు అక్కడ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న ముత్యాల సునీల్‌రెడ్డిని ఎక్కడ అకామిడేట్ చేస్తారో సస్పెన్స్ గా మారింది. ఇక మరో బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కూడా ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అనిల్‌ను నిజామాబాద్ అర్బన్‌కు మార్చాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది.
అర్బన్‌లో దాదాపు 40వేల ఓట్లు పద్మశాలి సామాజికవర్గానికి చెందిన వారివి ఉన్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంకు, ముస్లింల ఓట్లు అనిల్ కు కలిసి వస్తాయనే సమీకరణ అధిష్టానం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.