ఎప్పుడో ఇస్తామన్నారు రుణాలు. చెప్పి కూడా 8 నెలలు గడిచిపోతున్నాయి. అసలు దీని గురించి దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు కూడా మరిచిపోయి ఉంటారు. కానీ సర్కార్ తీరిగ్గా ఈ అటకెక్కిన ఫైలు దుమ్ముదులిపే పనిని ముందేసుకున్నది. నవంబర్ 19 న ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా ఆగిపోయిన ఈ పథకాన్ని మళ్లీ పట్టాలెక్కించాలని డిసైడ్ అయ్యింది.
లక్ష నుంచి 3 లక్షల దాకా సబ్సిడీ రుణాలను అందించడం ద్వారా నిరుద్యోగులు ఏదైనా వ్యాపారం చేసుకుని స్వశక్తితో ఎదగాలనేది సర్కార్ ఉద్దేశ్యం.గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ స్కీమ్‌ను అమలు చేసింది. కానీ ఈసారి ఆదిలోనే ఈ పథకానికి అన్ని బ్రేకులు పడ్డాయి. నిధుల కొరత ప్రధాన కారణంగా ప్రభుత్వం చెప్పినా..ఈ దరఖాస్తులపై స్థానిక ఎమ్మెల్యేల ఒత్తిడి ఉందనే ప్రచారం కూడా బాగా జరిగింది. దీనికి తోడు బ్యాంకర్లు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు సిబిల్ స్కోరు సరిగా లేదని, అసలు కొందరికి సిబిల్ రికార్డే లేదన్న కారణాలను ప్రధానం చూపారు.
అంతే కాదు.. ప్రభుత్వం బ్యాంకర్లకు ఇవ్వాల్సిన సబ్సిడీ నిధులను కూడా జమ చేయకపోవడంతో .. వీటిని నిలిపివేశారు. అయితే ఫైరవీలు బాగా జరిగాయనే ప్రచారం నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డే ఈ స్కీమ్‌ను నిలిపివేశారనే ప్రచారం జరిగింది. సిబిల్ స్కోర్ నిబంధనలను మీడియా హైలెట్ చేసి చూపడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బ్యాంకర్లు కొందరు వెనక్కి తగ్గినా.. మిగిలిన అంశాల్లో ప్రభుత్వం నుంచే దీనిపై కదలిక లేకపోవడంతో మొత్తానికి గత తొమ్మిది, పది నెలలుగా ఈ స్కీమ్ అటకెక్కింది.
దీనిపై అడపాదడపా ప్రతిపక్షం నిలదీస్తూనే ఉంది. యువతకు రుణాలెక్కడిచ్చారు? ఇస్తామన్న యువ శక్తి ఎటు పోయింది? అంటూ నిలదీస్తున్నారు. ఈ స్కీమ్ ఆరంభానికి ముందు .. హైదరాబాద్‌లో భారీ హోర్డింగులతో సర్కార్ హోరెత్తించింది. వీటికే కొన్ని కోట్లు ఖర్చు చేసింది. చివరికి పైసా రుణం ఇవ్వకుండానే దీన్ని మూసేసింది.
ఇప్పుడు ఇందిరాగాంధీ జయంతి సందర్బంగా నవంబర్ 19 నుంచి దీన్ని మళ్లీ ప్రారంభించాలని సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అప్పటికే 16 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇంత పెద్ద మొత్తంగా దరఖాస్తులు రావడం కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కొన్ని బ్యాంకులు దరఖాస్తుదారులతో ఇంటర్వ్యూలు కూడా చేసి.. లబ్దిదారులను ఎంపిక చేసి పెట్టుకున్నాయి.
మరి వీటిని క్యాన్సల్ చేసి మళ్లీ కొత్తగా దరఖాస్తులు చేసుకోమంటారా? అనే అనుమానాలు లేకపోలేదు. అదే జరిగితే మళ్లీ జిరాక్స్ పత్రాలకు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలకే తడిసి మోపడవుతుంది. కానీ పాత వాటినే ఇంకా సమీక్షించలేదు కాబట్టి.. వాటినే ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారనే వాదన వినిపిస్తోంది. సిబిల్ స్కోర్ విషయంలో బ్యాంకర్లకు మరోసారి సర్కార్ కచ్చితమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ పథకం అమలు కోసం ఈ ఏడాది బడ్జెట్‌లోనే ప్రభుత్వం రూ.6 వేల కోట్లు కేటాయించింది. కానీ వీటిని ఇతర కార్యక్రమాలకు వినియోగించారు. మరి ఇప్పుడు ఏ నిధులను వాడుతారో స్పష్టత లేదు.
ఈ పథకం ద్వారా మొత్తం 3 విధాలుగా సబ్సిడీ ఇస్తారు.
మొదటి విభాగంలో భాగంగా రూ. లక్ష లోన్ తీసుకుంటే.. దాని మీద 80 శాతం సబ్సిడీ లభిస్తుంది. అంటే లబ్ధిదారులు రూ.20 వేలు తిరిగి చెల్లిస్తే సరిపోతుంది.
రెండో విభాగంలో లబ్ధిదారులకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు లోన్ ఇస్తారు. దీనిపై 70 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది.
మూడవ విభాగంలో రూ.3 లక్షల వరకు లోన్ తీసుకుంటే 60 శాతం సబ్సిడీ వర్తింపజేస్తారు.
ప్రధానంగా నిరుద్యోగ యువత, పేద కమ్యూనిటీల యువత లక్ష్యంగా ఈ రుణాలు మంజూరు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.