Patancheru Congress Politics: కాంగ్రెస్ పార్టీలో పటాన్‌చెరు పంచాయితీ గుబులు రేపుతోందట. పార్టీని నమ్ముకొని.. ఆస్తులు అమ్ముకొని మరీ పాలిటిక్స్ చేస్తుంటే తనకు సముచిత న్యాయం జరగడం లేదని ఆయన అసంతృప్తిలో ఉన్నారట. పైగా ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యే మాటే నియోజకవర్గంలో సాగుతుండడంపై తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నారట. హైదరాబాద్ శివార్లలో ఉన్న ఆ నియోజకవర్గంలో ఎందుకీ పరిస్థితి..? ఇదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారుతోందట.
హైదరాబాద్ శివార్లలో కీలక నియోజకవర్గ పటాన్ చెరు
సంగారెడ్డి జిల్లాలో ఉన్న అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో పటాన్ చెరు ముఖ్యమైనది. హైదరాబాద్ శివారు ప్రాంతంగా ఉండడం, ఎన్నో వందలాది పరిశ్రమలకు కేరాఫ్‌గా నిలవడంతో ఇక్కడి రాజకీయం ఎప్పుడూ సెపరేట్‌గానే ఉంటుంది. ఇలాంటి చోట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పంచాయితీ నడుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ కాంగ్రెస్ ఉనికి దాదాపుగా లేదనే చెప్పాలి. అలాంటి వేళ.. ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా, బెదిరింపులు వచ్చినా, కేసులు నమోదైనా ఎదురొడ్డి మరీ హస్తం జెండా భుజాన మోశారు కాట శ్రీనివాస్ గౌడ్. గులాబీ హవాలో పార్టీ కేడర్‌ను నిలుపుకునేందుకు, కారు పార్టీ అవినీతి, అక్రమాలు చేస్తుందంటూ పోరాడేందుకు చివరకు ఆస్తులు సైతం అమ్ముకొని మరీ కాటా.. పాలిటిక్స్ చేశారంటారు నియోజకవర్గ నాయకులు. అలాంటి కాట శ్రీనివాస్ గౌడ్‌కు హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక సరైన గుర్తింపు దక్కలేదన్నది ఆయన సైతం చెప్పేమాట.
2023 ఎన్నికల్లో పటాన్‌చెరు ఎమ్మెల్యేగా..
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన కాటా శ్రీనివాస్ గౌడ్ ఓటమి పాలయ్యారు. గులాబీ పార్టీ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా మహిపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడి నుంచే అసలు సినిమా మొదలైందట. రాష్ట్రంలో అధికారం మారటం, నియోజకవర్గంలో పరిస్థితుల ప్రభావంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి జైకొట్టారు. దీంతో.. ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారిపోయింది. వాస్తవానికి కాట శ్రీనివాస్ గౌడ్ హస్తం పార్టీకి నియోజకవర్గంలో అండగా నిలిచారు. ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీ వైపు నడిపించి నియోజకవర్గంలో పార్టీని బలంగా తీర్చిదిద్దారు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో అప్పట్లో అధికార బీఆర్ఎస్‌కు నియోజకవర్గంలోని పలు చోట్ల గట్టి పోటీ ఇచ్చేలా చూశారు. కొన్ని స్థానాల్లో గెలిపించారు. కార్యకర్తలకు ఏ మాత్రం కష్టం వచ్చినా తన సొంత ఖర్చులతో సైతం ఆదుకునేందుకు వెనుకాడలేదంటారు కాట గురించి తెలిసిన వారు ఎవరైనా.
నియోజకవర్గంలో పార్టీని బలంగా తీర్చిదిద్దిన కాట శ్రీనివాస్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2015లో పటాన్‌చెరు వచ్చినప్పుడు పది వేల మందిని సమీకరించి భారీగా స్వాగతం పలకడమే కాదు.. జోడో యాత్రలోనూ ఆయన దృష్టిలో పడి శెభాష్ అన్పించుకున్నారు కాటా శ్రీనివాస్ గౌడ్. అలాంటిది మహిపాల్ రెడ్డి రాకతో.. కాట పరిస్థితి చిత్రంగా తయారైందట. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు సంతోష పడాలా లేదంటే .. ఇప్పటి వరకు తాము ఎవరికైతే వ్యతిరేకంగా పోరాటం చేశామో ఆ వ్యక్తికే మద్దతు పలకాలా అన్న డైలమాలో పడిపోయారట కేడర్. ఇక అప్పటి నుంచి మొదలైన కాట ఆవేదనకు అంతులేకుండా పోయిందన్నది నియోజకవర్గంలోని నాయకులు చెప్పేమాట.
తనకు న్యాయం జరగలేదని కాటా ఆవేదన
కేవలం ఇదే కాదు.. కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు కాటాకు పటాన్‌చెరు టికెట్ ఇచ్చినా చివరి నిమిషంలో తర్జనభర్జన పడి ఇచ్చిందని.. అయినా సరే స్వల్ప తేడాతోనే ఓటమి పాలయ్యారని కాటా వర్గం చెబుతోంది. ఇంత జరిగినా గెలుపోటములు పక్కన పెట్టి పార్టీనే నమ్ముకొని ఉన్న కాటాకు.. ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరోపిస్తున్నారు. కానీ, మూడోసారి గెలిచిన తర్వాత మహిపాల్ రెడ్డి .. అక్రమ మైనింగ్ కేసులో ఉక్కిరి బిక్కిరి చేశారని ఫైరవుతున్నారు. ఇవన్నీ తెలిసినా హస్తం పార్టీ మహిపాల్ రెడ్డి విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చివరకు గాంధీ భవన్ వద్ద ధర్నాకు దిగింది కాటా వర్గం.
క్యా్ంపు కార్యాలయంలో సీఎం ఫోటో లేదని ఫైర్
పైకి మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు జై కొట్టినా.. ఆయన తన తీరు మాత్రం మార్చుకోలేదని ఆరోపిస్తోంది కాటా వర్గం. ఇంకా చెప్పాలంటే పటాన్‌చెరులో కాంగ్రెస్ పార్టీని పతనం చేయాలన్న లక్ష్యంతో గూడెం పనిచేస్తున్నారని ఫైరవుతున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రత్యేకించి కాటా వర్గీయులను దూరం పెడుతూ బీఆర్ఎస్ నాయకులకే ప్రాధాన్యం ఇవ్వడం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ ఫోటో సైతం పెట్టుకోకపోవడంపై ఇప్పటికే ఆందోళనకు దిగారు. ఇది కాస్తా రాష్ట్రంలోనే హాట్‌టాపిక్‌గా మారింది.
ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్‌లో అసంతృప్తి తీవ్రంగా ఉండడం, నియోజకవర్గంలో కీలక నాయకుడు కావడంతో చివరకు పీసీసీ ఈ విషయంపై దృష్టి సారించింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఫోటో లేకపోవడం అనే అంశంపై విచారణ చేపట్టింది. అంతేకాదు..కష్టపడిన కార్యకర్తల మనోభావాలు కాపాడతామని, న్యాయం చేస్తామని హామీసైతం ఇచ్చారు పీసీసీ తరఫున వచ్చిన నేతలు. కానీ, ఇదంతా గడిచి ఆరు నెలలు గడుస్తున్నా ఎమ్మెల్యేపై ఎలాంటి చర్య తీసుకోకపోవడంపై కాటా వర్గం అసంతృప్తిగా ఉందట. ఓవైపు పార్టీ విషయంలో ఎంత అసంతృప్తి ఉన్నా కాటా శ్రీనివాస్ మాత్రం హస్తం కార్యక్రమాలకు దూరంగా ఉండడం లేదు. లేటెస్ట్‌గా రైతు భరోసా నిధులు అన్నదాతల అకౌంట్లలో పడిన సందర్భంలోనూ కార్యకర్తలతో కలిసి పటాన్‌చెరు నియోజకవర్గంలో పాలాభిషేకాలు, సంబరాలు జరిపారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాత్రం ఈ కార్యక్రమాల వైపు కన్నెత్తి చూడలేదని చెబుతున్నారు కాటా వర్గీయులు.
Also Read: టికెట్ పోరు.. జగన్ ఎవరివైపు?
పార్టీ అధిష్టానం ఏం చేస్తుందన్న దానిపై ఉత్కంఠ
పరిస్థితిని గమనించిన అధిష్టానం మరోసారి కాటా శ్రీనివాస్ గౌడ్‌ను బుజ్జగించే చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని రోజుల క్రితమే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.. కాటతో రెండుసార్లు సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని, పార్టీ కమిటీలు వేయాలని సూచించగా అందుకు నిరాకరించారట కాటా శ్రీనివాస్ గౌడ్. అంతేకాదు.. అధిష్టానం ఈ సమస్యను పరిష్కరించకపోతే నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ నష్టం తప్పదని హెచ్చరించారట. దీంతో.. ఈ సమస్యకు ఎలా ఎండ్ కార్డ్ వేయాలని చూస్తోందట పీసీసీ. ఇందులో భాగంగా ఇప్పటికే అభిప్రాయాలు సేకరిస్తున్నారట కాంగ్రెస్ అగ్రనేతలు. చూడాలి మరి చివరకు పటాన్‌చెరు పంచాయితీలో ఏం జరుగుతుందో.
Story By Rajashekar, Bigtv