Srikakulam Politics: వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం సీటు దక్కించుకునేందుకు వైసీపీ నేతలు అప్పుడే అక్కడ కర్చీఫ్ వేస్తున్నారట. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో ఒకరు.. అధినేతతో ఉన్న సాన్నిహిత్యంతో మరొకరు.. సజ్జల అండతో ఇంకొకరు అన్నట్లుగా టికెట్ తమకే దక్కుతుందని ఆశలు పెంచుకుంటున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ స్పీకర్ తనయుడి భవిష్యత్ ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. తండ్రి మాదిరిగానే కుమారుడు కూడా జిల్లా రాజకీయాలపై తనదైన ముద్ర వేస్తారా..? టికెట్ కన్ఫమ్ చేసుకుంటారా..? ఇదే చర్చ ఇప్పుడు అక్కడ నడుస్తోందట.
2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారామ్‌పై విజయం
శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో టఫ్ ఫైట్ నడిచే నియోజకవర్గాల్లో ఆముదాలవలస ఒకటి. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారామ్‌పై విజయం సాధించారు కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన కూన రవి కుమార్. వైసీపీ హయాంలో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన తమ్మినేని 2024 ఎన్నికల్లో ఇక్కడి నుంచి మరోసారి విజయం సాధిస్తారా లేదంటే కూన రవికుమార్ గెలుస్తారా అని రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎన్నికల వేళ ఎదురుచూశారు. కానీ.. కూటమి హవా ముందు ఓటమి పాలయ్యారు తమ్మినేని సీతారామ్.
ఆముదాలవలస పై తమ్మినేని ముద్ర
నిజానికి తమ్మినేని సీతారామ్‌కు ఆముదాలవలస నియోజకవర్గంపై గట్టి పట్టే ఉంది. టీడీపీ నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన.. వైసీపీ అభ్యర్థిగా 2019లో బంపర్ విక్టరీ కొట్టారు. అలాంటిది 2024లో ఎదురుదెబ్బ తగలడంతో 2029లో పరిస్థితి ఏంటన్న చర్చ అప్పుడే మొదలైందట నియోజకవర్గంలో. గ్రౌండ్ లెవల్‌లో పరిస్తితి చూస్తే.. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో సీన్ మారిపోయింది. కూటమి హవాలో వైసీపీ చిత్తైన పరిస్థితి. ఈ క్రమంలో పలు మార్పులు చేర్పులు చేశారు వైసీపీ అధినేత వై.ఎస్ జగన్. ఇందులో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ సీనియర్ నేత చింతాడ రవికుమార్‌ను నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2014-19 మధ్యకాలంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా బలంగా తన గళం విన్పించారు చింతాడ. ఫలితంగా జగన్ దృష్టిలో పడ్డారాయన.
చింతాడకు బాధ్యతలివ్వడంతో తమ్మినేని అలక
ప్రస్తుతం రాష్ట్రంలో మళ్లీ వైసీపీది ప్రతిపక్ష పాత్ర. దీంతో.. బలంగా వాయిస్ విన్పించే చింతాడకు జగన్.. బాధ్యతలు అప్పగించారన్న టాక్ నడుస్తోంది. కాలం కలిసి వస్తే నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న ఆయన 2029 నాటికి ఆముదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారని ఆయన వర్గీయులు గుసగుసలాడుకుంటున్నారట. ఈ పరిణామాలపై ఆగ్రహించారట తమ్మినేని. పైకి చెప్పకపోయినా సమన్వయకర్తగా చింతాడ నియామకం నాటి నుంచి చాలా రోజుల పాటు నియోజవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు తమ్మినేని. చివరకు పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బుజ్జగింపులతో మళ్లీ లైన్‌లోకి వచ్చారట తమ్మినేని. చివరకు వైసీపీ పిలుపు మేరకు వెన్నుపోటు దినోత్సవాన్ని నియోజకవర్గంలో ముందుండి నడిపించారట. అయితే.. అప్పటి వరకు తండ్రి చాటుగా ఉంటూ వచ్చిన తమ్మినేని తనయుడు చిరంజీవి.. యువత పోరు కార్యక్రమానికి బయటకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన ఫుల్ యాక్టివ్‌గా కన్పించడంతో తమ్మినేని అనుచరులు తమ భవిష్యత్ నాయకుడు చిరంజీవేనని నియోజకవర్గంలో చెప్పుకోవడం మొదలు పెట్టారట.
ఆముదాలవలప సీటుపై కర్చీఫ్ వేసిన మరికొందరు నేతలు
ఇక్కడే మరో వాదనా విన్పిస్తోంది. పార్టీ సీనియర్ నేత తమ్మినేని వారసుడిగా ఆరంగేట్రం చేసినంత మాత్రాన చిరంజీవికి ఆముదాల వలస సీటు దక్కుతుందని అనుకోవడం పొరపాటే అంటున్నారు విశ్లేషకులు. ఓవైపు భారీ అనుచరగణం తమ్మినేని కుటుంబం వెనుక ఉన్నా.. మరికొందరు నేతలు నియోజకవర్గంలో ఈ సీటుపై ఫోకస్ చేసి ఉండడమే కారణమని చెబుతున్నారు. ఓవైపు చింతాడ ఉన్నా ఎందుకు ఈ పరిస్థితి అంటే.. ఆయనకు నియోజకవర్గంలో పెద్దగా ప్రజాదరణ లేదన్న టాక్ గట్టిగా విన్పిస్తోంది. పైగా ఆయన నేతృత్వంలో నిర్వహించిన పలు పార్టీ కార్యక్రమాలకు వైసీపీ కేడర్ 80 శాతం దూరంగానే ఉందట. ఇవన్నీ గమనించే మరికొందరు నేతలు రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కర్చీఫ్ వేశారట.
లిస్ట్‌లో వైసీపీ అధికార ప్రతినిధి కోట గోవిందరావు
ఈ లిస్ట్‌లో ఉన్న మరో నేత శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి కోట గోవిందరావు. ఈయనకు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన సజ్జల సపోర్ట్ ఫుల్‌గా ఉందట. దీంతో..2029 ఎన్నికల్లో కచ్చితంగా సీటు తనకే వస్తుందని చెప్పుకుంటున్నారట గోవిందరావు. ఇక, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు కిల్లి వెంకట సత్యనారాయణ సైతం పోటీకి గ్రౌండ్ ప్రిపేట్ చేసుకుంటున్నారట. ఈయనతోపాటు రాష్ట్ర కళింగ సామాజికవర్గ అధ్యక్షులు దుంపల రామారావు కూడా నేను సైతం అంటున్నారట. వైసీపీ అధినేత జగన్ ఈయన్ను ఆప్యాయంగా లక్ష్మణ్ అన్న అంటూ పిలుస్తుంటారు. పైగా టీచర్‌గా పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మరీ పార్టీ కోసం సేవలందించారన్న మంచి పేరు ఈయనకు హైకమాండ్ వద్ద ఉందట. దీంతో.. ఇవన్నీ లక్ష్మణ్‌కు ప్లస్ పాయింట్‌గా చెప్పుకుంటున్నారట ఆయన సన్నిహితులు.
Also Read: శ్రీవారిని దర్శించుకుని.. టెంపోను ఢీ కొట్టిన లారీ స్పాట్‌లోనే 14 మంది..
మరి.. వీళ్లందర్నీ కాదని వైసీపీ అధినేత జగన్ తమ్మినేని కుమారుడు చిరంజీవికి టికెట్ కేటాయిస్తారా అంటే రాబోయే రోజుల్లో ఆయన పనితీరు ఆధారంగా.. వైసీపీ అధినేత నిర్ణయం ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు తమ్మినేని అభిమానులు, అనుచరులు. అయితే.. ప్రత్యర్థులు మాత్రం తమ్మినేని దూకుడు..పార్టీకి ఆయన వల్ల కలిగిన ఇబ్బందులు అధినేతకు ఇప్పటికే తెలుసని.. ఫలితంగా రాబోయే రోజుల్లో టికెట్ తమకే దక్కుతుందని దీమా వ్యక్తం చేస్తున్నారట. మరి వైసీపీ అధినేత జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది తేలేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
Story By Rajashekar, Bigtv