
Political Heat In Dharmavaram Assembly Constituency: ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అక్కడ బలమైన అభ్యర్థిగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ పోటీలో ఉన్నారు. ఈ సమయంలో ధర్మవరం టిక్కెట్ పంచాయితీ మరింత వేడెక్కింది. సీటు కోసం విపరీతమైన పోటీ ఉండగా.. మరొక వ్యక్తి వచ్చి.. ఆ టిక్కెట్ ఎగరేసుకుపోయారు.
ఆయనే బీజేపీ నేత సత్యకుమార్. ఊహించని ట్విస్ట్ రావటంతో అటు పరిటాల శ్రీరామ్ వర్గీయులతో పాటు మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి షాక్ తగిలింది. పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీటు ఇవ్వటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
పొత్తులో భాగంగా సత్యకుమార్‌కు సీటు ప్రకటించక ముందు ధర్మవరంలో టీడీపీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ధర్మవరం నాదంటే నాదంటూ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి పోటీపడ్డారు. ఓ సందర్భంగా ఇరువురూ అమీతుమికి దిగారు. మీడియా సమావేశాలు పెట్టి మరీ ఒకరిపై ఒకరు బురద జల్లుకున్నారు. ఒకరి గురించి మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు.
ఇద్దరూ బలమైన నేతలు కావడంతో ఎవరో ఒకరికే వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ… ఆ ఇద్దరికీ.. ఇరు పార్టీల హైకమాండ్‌లు షాక్ ఇచ్చాయి. బీజేపీ నుంచి సీటుని కన్ఫామ్ చేయటంతో సత్యకుమార్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో పరిటాల శ్రీరామ్, సూరి.. షాక్ నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఆ ఇద్దరిలో వరదాపురం సూరే ఎక్కువ ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఇక.. సత్యకుమార్ కూడా ధర్మవరంలో అడుగుపెట్టి.. ప్రచారం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకునే పనిలో పడ్డారు.
ధర్మవరంలో కూటమి అభ్యర్థి సత్యకుమార్‌ను అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీరామ్ పిలుపునిచ్చారు. పార్టీ మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ.. పార్టీ నిర్ణయమే శిరోధార్యం అని చెబుతున్నారు.
నాలుగేళ్లుగా నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లి కష్టపడి పనిచేశామని గుర్తు చేస్తూనే.. అనుకోని కారణాల వల్ల టికెట్ బీజేపీకి పోయిందని కార్యకర్తలను సముదాయిస్తున్నారు. అధిష్టానం నిర్ణయం మేరకు సత్యకుమార్ గెలుపుకోసం కృషి చేయాలని అంటున్నారు. గతంలో తాను ఇచ్చిన హామీలన్నీ సత్యకుమార్ ద్వారా అమలు చేయిస్తానని పేర్కొన్నారు.
ఈ విషయంలో మాట తప్పే ప్రసక్తే లేదంటున్నారు పరిటాల శ్రీరామ్. ధర్మవరం చరిత్రలో మొట్టమొదటిసారిగా బీసీ అభ్యర్థి ఎన్నికల బరిలో నిలబడుతున్నారని.. నియోజకవర్గంలో ఉన్న బీసీలంతా ఆయనకు మద్దతు తెలపాలని శ్రీరామ్ చెబుతున్నారు.
మనం చేసిన త్యాగం వృథా పోకూడదని.. సత్యకుమార్‌ను గెలిపిస్తేనే చేసిన త్యాగానికి న్యాయం జరుగుతుందని శ్రీరామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ధర్మవరంలో మరోసారి రాక్షసపాలన రాకుండా పని చేయాల్సిన అవసరం ఉందన్న శ్రీరామ్.. 40 రోజులు సమయంలో ప్రజలకు మరింత చేరువకావాలని టీడీపీ శ్రేణులకు శ్రీరామ్ పిలుపునిచ్చారు.
ఇక్కడ వరకూ బాగానే ఉంది. పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలతో సత్యకుమార్ సహా బీజేపీ నేతలంతా హ్యాపీగా ఫీలయ్యారు. ఈ సమయంలో వరదాపురం సూరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ధర్మవరంలో నేతలతో పాటు ఇటు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. టికెట్ రాలేదన్న బాధలో నుంచి తీరుకున్న సూరి.. కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
Also Read: కడప గడపలో వైఎస్ వర్సెస్ వైఎస్.. అక్క చేతిలో తమ్ముడి పరిస్థితి ఏంటో..?
ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మవరం నుంచి పోటీలో ఉండేది మనమే అని సూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. వందశాతం ఎమ్మెల్యే తానే అయి తీరతానంటూ కార్యకర్తలకు అభయం ఇచ్చారు. బీజేపి హైకమాండ్ కూడా టికెట్ విషయంపై పునరాలోచన చేస్తుందని.. ఈ మేరకు తనకు సమాచారం ఉందంటూ సూరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఊహించని ట్విస్ట్‌తో సత్యకుమార్ అలెర్ట్ అయ్యారు. ఏప్రిల్ ఒకటిన జరగాల్సిన ధర్మవరం పర్యటనను.. ఈనెల 4 తేదీకి వాయిదా వేసుకున్నారు. సూరి చేసిన వ్యాఖ్యలపై నిజంగానే అధిష్టానం ఆలోచన చేస్తోందా లేక.. సూరి క్యాడర్‌ను కన్ఫ్యూజ్ చేసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే ఆలోచనలో సత్యకుమార్ పడినట్లు సమాచారం. అంతే కాదు.. టికెట్ తెచ్చుకున్న ఆనందం కంటే ఇద్దరు కీలకనేతల మధ్య ఫైట్ సత్యకుమార్‌కు ఎక్కువ ఇబ్బందినీ కలిగిస్తోందట. ఇద్దరు నేతలూ.. ఒకరికి సపోర్ట్ చేసే పరిస్థితి లేక పోవటంతో ఎలాంటి అడుగులు వేయాలనే యోచనలో సత్యకుమార్ ఉన్నట్లు సమాచారం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు పరిటాల శ్రీరామ్ మద్దతిస్తే.. సూరి మాత్రం దూరంగా ఉంటూ టెన్షన్ పెడుతున్నాడు. ఆ ఇద్దరి మద్దతుతో ధర్మవరంలో అడుగుపెట్టాలని అనుకున్న సత్యకుమార్.. ట్విస్ట్‌లతో ఇరకాటంలో పడ్డారట. బీజేపీ అదిష్టానం మనసులో ఏముంది అనేది తెలిశాకే.. జనంలోకి వెళ్లాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నారట. నిజంగా టిక్కెట్ మారుస్తారా.. లేక సూరి కన్ఫ్యూజ్ చేసేందుకు అలా అన్నారా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.