Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని.. ఇది ప్రజలను మోసం చేయడమేనని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. షేక్‌పేట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, బీఆర్‌ఎస్, బీజేపీ వైఖరిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో నాలుగు వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబోతున్నాం. నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు. మూసీ రివర్ ఫ్రంట్ నిర్మాణ ప్రణాళికపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. సవాల్ విసిరినా కిషన్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
తమపై వచ్చిన విమర్శలపై సీఎం స్పందించారు. ‘నేను మొదటి నుంచి సెక్యులర్ భావాలు ఉన్న వ్యక్తిని. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలకు ఎన్నో అవకాశాలు కల్పించింది. కొడంగల్‌లో తాను మూడుసార్లు గెలవడానికి మైనారిటీల సహకారం ఉందన్నారు. గత 20 నెలల కాంగ్రెస్ పాలనలో మైనారిటీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నామని స్పష్టం చేశారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఎలా ఇచ్చారని కిషన్‌రెడ్డి అడగడం సరికాదని.. ఎందుకు ఇవ్వకూడదో కిషన్‌రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే కిషన్‌రెడ్డికి ఏం ఇబ్బంది అని నిలదీశారు. ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్ ఒక్కటేనని.. వీరిద్దరూ ముస్లింలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
‘సవాళ్లు విసిరి పారిపోవడం కేటీఆర్‌కు అలవాటుగా మారింది. ఆయన విసిరే సవాళ్లను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పట్టించుకోరు’ అని సీఎం ఎద్దేవా చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారా? అని ప్రశ్నించారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులపై జీవోలు త్వరలోనే ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ నాయకత్వంపై.. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో సీఎం విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ ప్రజలు సెంటిమెంటా లేక డెవలప్‌మెంట్ అన్నదానిపై ఆలోచించాలని ఆయన కోరారు. సెంటిమెంట్ పేరుతో ఓటు అడగడానికి కేసీఆర్‌కు హక్కు లేదని.. పీజేఆర్ మరణం సమయంలో ఆయన వ్యాఖ్యలను గుర్తుచేశారు. పీజేఆర్ కుటుంబ సభ్యులను అవమానించిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. తన ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో 3 నెలల్లోనే రూ. 400 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టిందని.. 2.39 లక్షల మందికి సన్నబియ్యం, త్వరలో 4000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ కోరితే మోదీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి, కేటీఆర్‌లపై కూడా ఆయన నిప్పులు చెరిగారు. కంటైన్‌మెంట్ ప్రాంతంలో రూ. 5000 కోట్ల జీవోలు చూపిస్తే కేటీఆర్ పారిపోయారని.. రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు.
నవీన్ యాదవ్ విజయం కోసం ఎంఐఎం నేతలు కృషి చేస్తున్నారని.. ఆయనకు మొదట ఎంఐఎం టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో హిందూ, ముస్లింల మధ్య తారతమ్యం లేదని.. సిరాజ్, నిఖత్ జరీన్, అజరుద్దీన్‌లకు అవకాశాలిచ్చామని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ రహస్య అవగాహనతో ఉన్నాయని ఆరోపించారు. నవీన్ యాదవ్‌ను 30 వేల మెజారిటీతో గెలిపించాలని కోరుతూ.. జూబ్లీహిల్స్‌లో మోదీ, కేసీఆర్ ఒక వైపు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ మరోవైపు ఉన్నారని అన్నారు.
జూబ్లీహిల్స్‌లో ‘జై కాంగ్రెస్’ నినాదం వినిపిస్తుంటే.. ఫామ్‌హౌస్‌లలో నిద్రపోతున్న గుండెలు అధరాలు పడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొన్నం ప్రభాకర్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ వంటి నాయకులు ఈ విజయంలో భాగస్వాములయ్యారని తెలిపారు. గత పదేళ్లుగా BRS జూబ్లీహిల్స్‌లో గెలిచినా, అభివృద్ధికి ఏమీ చేయలేదని విమర్శించారు. పేద ప్రజల కోసం పనిచేసిన PJR మరణానంతరం KCR వారిని కలవలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గద్దర్ పేరుతో అవార్డులు అందించి.. సినిమా కార్మికుల పిల్లలకు సకల సౌకర్యాలతో విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గేదెలు కూడా తినని దొడ్డు బియ్యం ఇచ్చిన BRS, సన్నబియ్యం గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి.. 21 వేల రైతు రుణమాఫీ పూర్తి చేసిందని ఒక కాంగ్రెస్ నాయకుడు ప్రకటించారు. తమది ప్రజా ప్రభుత్వమని.. అందుకే ఇన్ని పథకాలను అందించగలిగామని ఆయన స్పష్టం చేశారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తుంటే BRS పార్టీ ఓర్వలేకపోతుందని ఆరోపించారు. BRS, BJP ల మధ్య చీకటి ఒప్పందం ఉందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆధారాలను బయటపెట్టామని.. కిషన్ రెడ్డి విమర్శలను తిప్పికొట్టారు. KCRను నియంతలా దెబ్బ కొట్టింది కాంగ్రెస్ కార్యకర్తలేనని అన్నారు. కిషన్ రెడ్డి కింగ్ కాలేరని ఎద్దేవా చేశారు. బస్తీ ప్రజలు స్థానిక అభ్యర్థి నవీన్ యాదవ్‌ను 30 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. అతన్ని ఓడించడానికి కుట్రలు జరుగుతున్నాయని సీఎం వ్యాఖ్యానించారు.
ALSO READ: Bhatti Vikramarka: “కాంగ్రెస్ అంటేనే కరెంట్” పరిగిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలు